బొగ్గుపై జెన్‌కోలకు కేంద్రం మరో హెచ్చరిక
రాష్ట్రాలతో విదేశీ బొగ్గును కొనుగోలు చేయించేందుకు కేంద్రం అన్ని మార్గాల్లోనూ ఒత్తిడి తెస్తోంది. బెదిరింపుకు, హెచ్చరికలకు దిగుతోంది. విద్యుత్ ఉత్పత్తికి వాడుతున్న బొగ్గులో.. 10 శాతం మేర తప్పనిసరిగా విదేశీ బొగ్గును దిగుమతి చేసుకోవాలని కొద్దికాలంగా కేంద్రం ఒత్తిడి తెస్తోంది. తొలుత మే 31లోగా విదేశీ బొగ్గు దిగుమతులకు ఒప్పందాలు చేసుకోవాలని.. అలా చేయని పక్షంలో రాబోయే కాలంలో విదేశీ బొగ్గును మరింత ఎక్కువగా దిగుమతి చేసుకునేలా ఆంక్షలు విధిస్తామని హెచ్చరించింది. తాజాగా మరోసారి హెచ్చరికలు జారీ […]
రాష్ట్రాలతో విదేశీ బొగ్గును కొనుగోలు చేయించేందుకు కేంద్రం అన్ని మార్గాల్లోనూ ఒత్తిడి తెస్తోంది. బెదిరింపుకు, హెచ్చరికలకు దిగుతోంది. విద్యుత్ ఉత్పత్తికి వాడుతున్న బొగ్గులో.. 10 శాతం మేర తప్పనిసరిగా విదేశీ బొగ్గును దిగుమతి చేసుకోవాలని కొద్దికాలంగా కేంద్రం ఒత్తిడి తెస్తోంది. తొలుత మే 31లోగా విదేశీ బొగ్గు దిగుమతులకు ఒప్పందాలు చేసుకోవాలని.. అలా చేయని పక్షంలో రాబోయే కాలంలో విదేశీ బొగ్గును మరింత ఎక్కువగా దిగుమతి చేసుకునేలా ఆంక్షలు విధిస్తామని హెచ్చరించింది.
తాజాగా మరోసారి హెచ్చరికలు జారీ చేసింది కేంద్రం. శుక్రవారంలోగా విదేశీ బొగ్గుకు రాష్ట్రాలు ఆర్డర్ ఇవ్వాలని, లేని పక్షంలో .. దేశీయ బొగ్గు కేటాయింపులను తగ్గిస్తామని హెచ్చరించింది. శుక్రవారంలోగా ఆర్డర్ ఇవ్వని రాష్ట్రాలకు దేశీయ బొగ్గును కేవలం 70 శాతం మాత్రమే కేటాయిస్తామని ప్రకటించింది. ఆ తర్వాత దాన్ని 60 శాతానికి కుదిస్తామని హెచ్చరించింది. దాంతో రాబోయే కాలంలో మరింత ఎక్కువ మొత్తంలో విదేశీ బొగ్గును రాష్ట్రాలు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వస్తుందని కేంద్రం బెదిరిస్తోంది.
చివరకు సింగరేణి గనులతో సరిపడ బొగ్గు నిల్వలున్న తెలంగాణ జెన్‌కో కూడా విదేశీ బొగ్గు కొనాల్సిందేనని కేంద్రం ఒత్తిడి తెస్తోంది. తెలంగాణలో సింగరేణి బొగ్గు లభ్యత పుష్కలంగా ఉందని..తమకు విదేశీ బొగ్గు అవసరం లేదని, పైగా తెలంగాణకు పోర్టు లేదు కాబట్టి 450 కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణపట్నం పోర్టు నుంచి రైలు లేదా రోడ్లు మార్గంలో విదేశీ బొగ్గును తీసుకురావడం రాష్ట్రానికి తలకు మించిన భారం అవుతుందని తెలంగాణ వాదిస్తోంది. సింగరేణి బొగ్గు టన్నుకు 5వేల రూపాయలకు దొరుకుతోందని… అదే విదేశీ బొగ్గు కొనాలంటే అందుకు ఐదారు రెట్లు ఎక్కువగా ధర చెల్లించాల్సి ఉంటుందని.. దాని వల్ల రాష్ట్ర విద్యుత్ సంస్థలు ఆర్థికంగా కుదేలవుతాయని తెలంగాణ వాదిస్తోంది. కానీ కేంద్రం మాత్రం పదేపదే విదేశీ బొగ్గును కొనాల్సిందేనంటూ ఒత్తిడి మరింత పెంచుతోంది.