వేలంలో చెల్లనివాడు...ప్లే-ఆఫ్ లో దంచికొట్టాడు... రేటు 20 లక్షలు...ఆటతీరు కోటానుకోట్లు!
టాటా-ఐపీఎల్ 15వ సీజన్ లీగ్ దశ పోటీలలో మాత్రమే కాదు…ప్లే-ఆఫ్ రౌండ్ మ్యాచ్ ల్లో సైతం రేటు తక్కువ, ఆట ఎక్కువ ఆటగాళ్ల జోరు కొనసాగుతోంది. భారత క్రికెట్ మక్కా కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ తో ముగిసిన ఎలిమనేటర్ రౌండ్ మ్యాచ్ లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ఆటగాడు రజత్ పాటిదార్ చెలరేగిపోయాడు. తన కెరియర్ లోనే అత్యుత్తమ బ్యాటింగ్ ప్రతిభతో మ్యాచ్ విన్నర్ గా నిలిచాడు. కేవలం తన […]
టాటా-ఐపీఎల్ 15వ సీజన్ లీగ్ దశ పోటీలలో మాత్రమే కాదు…ప్లే-ఆఫ్ రౌండ్ మ్యాచ్ ల్లో సైతం రేటు తక్కువ, ఆట ఎక్కువ ఆటగాళ్ల జోరు కొనసాగుతోంది.
భారత క్రికెట్ మక్కా కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ తో ముగిసిన ఎలిమనేటర్ రౌండ్ మ్యాచ్ లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ఆటగాడు రజత్ పాటిదార్ చెలరేగిపోయాడు. తన కెరియర్ లోనే అత్యుత్తమ బ్యాటింగ్ ప్రతిభతో మ్యాచ్ విన్నర్ గా నిలిచాడు. కేవలం తన బ్యాటింగ్ ప్రతిభతోనే బెంగళూరును క్వాలిఫైయర్స్ -2 రౌండ్ కు చేర్చాడు.
ఫటాఫట్ పాటీదార్….
విరాట్ కొహ్లీ ఐపీఎల్ వేతనం సీజన్ కు 15 కోట్ల రూపాయలు..ఎలిమినేటర్ రౌండ్లో సాధించిన పరుగులు 25, కెప్టెన్ పాఫ్ డూప్లెసీ వేలం రేటు 7 కోట్ల రూపాయలు..సాధించిన పరుగులు డకౌట్…అదే రజత్ పాటీదార్ రేటు 20 లక్షలు మాత్రమే…ఎలిమినేటర్ రౌండ్లో సాధించిన పరుగులు 112 నాటౌట్.
వాస్తవానికి.. 2022 ఐపీఎల్ మెగావేలంలో 28 సంవత్సరాల రజత్ పాటీదార్ ను కనీస వేలం ధర 20 లక్షల రూపాయలకు తీసుకోడానికి ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు.
బెంగళూరుజట్టులోని లవనీత్ సిసోడియా గాయంతో తప్పుకోడంతో..అతని స్థానంలో పాటీదార్ ను చేర్చుకొన్నారు.
ప్రస్తుత సీజన్లో బెంగళూరు జట్టు ఆడిన మొత్తం రౌండ్ల లీగ్, ఎలిమినేటర్ రౌండ్ మ్యాచ్ లతో కలిపి పాటీదార్ 10 మ్యాచ్ ల్లో ఆడాడు. 234 పరుగులతో 127.2 స్ట్ర్రయిక్ రేట్ నమోదు చేశాడు.
అదే ఎలిమినేటర్ రౌండ్లో మాత్రం డూప్లెసీ, కొహ్లీ , మాక్స్ వెల్ లాంటి మేటి స్టార్లంతా విఫలమైన నేపథ్యంలో జట్టు భారాన్ని తనపైనే వేసుకొని పాటీదార్ ఒంటరిపోరాటమే చేశాడు.
49 బాల్స్ లోనే మెరుపు సెంచరీ….
కేవలం 49 బాల్స్ లోనే 11 ఫోర్లు, 6 సిక్సర్లతో వంద పరుగుల మైలురాయిని చేరిన పాటీదార్ 54 బాల్స్ లో 7 సిక్సర్లు, 12 బౌండ్రీలతో 112 పరుగుల నాటౌట్ స్కోరు సాధించాడు. దీంతో బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్లకు 207 పరుగుల భారీస్కోరు నమోదు చేయగలిగింది.
దినేశ్ కార్తీక్ తో కలసి 5వ వికెట్ కు పాటిదార్ 92 పరుగుల అజేయభాగస్వామ్యం నమోదు చేశాడు. కార్తీక్ 23 బాల్స్ లో 37 పరుగుల నాటౌట్ స్కోరుతో నిలిచాడు.
ఆఖరి 5 ( డెత్ ) ఓవర్లలో పాటీదార్- కార్తీక్ జోడీ 88 పరుగుల దండుకోడం ద్వారా బెంగళూరు 207 పరుగుల లక్ష్యాన్ని చేరుకోగలిగింది.
తొలి అన్ క్యాప్ డే ప్లేయర్ పాటీదార్…
ఐపీఎల్ ప్లేఆఫ్ రౌండ్లో అజేయశతకం బాదిన తొలి అన్ క్యాప్డ్ బ్యాటర్ గా, సెంచరీ సాధించిన ఐదో ఆటగాడిగా రజత్ పాటీదార్ రికార్డుల్లో చేరాడు. గతంలో 2014 ఐపీఎల్ ఫైనల్లో కోల్ కతా నైట్ రైడర్స్ ఆటగాడు మనీష్ పాండే 50 బాల్స్ లో సాధించిన 94 పరుగుల అత్యధిక స్కోరు రికార్డును రజత్ పాటీదార్ ప్రస్తుత సీజన్లో అధిగమించాడు.
అంతేకాదు..ఫ్లే-ఆఫ్ రౌండ్లో అత్యంత వేగంగా సెంచరీ సాధించిన వృద్దిమాన్ సాహా రికార్డును సైతం పాటీదార్ సమం చేయగలిగాడు.
2014 ఐపీఎల్ ఫైనల్లో కింగ్స్ పంజాబ్ తరపున బరిలో నిలిచిన వృద్ధిమాన్ సాహా 55 బాల్స్ లో 115 పరుగులు సాధిస్తే…ప్రస్తుత సీజన్ ఎలిమినేటర్ రౌండ్లో పాటిదార్ 54 బాల్స్ లో 112 పరుగుల అజేయ స్కోరు నమోదు చేశాడు.
2011 సీజన్లో ముంబై ఇండియన్స్ తో జరిగిన ప్లేఆఫ్ రౌండ్లో అప్పటి బెంగళూరు ఓపెనర్ క్రిస్ గేల్ 47 బాల్స్ లో సాధించిన 89 పరుగుల అత్యధిక స్కోరు రికార్డును పాటిదార్ తెరమరుగు చేశాడు.
ఆ ముగ్గురి సరసన పాటిదార్…
ఐపీఎల్ చరిత్రలో శతకం బాదిన అన్ క్యాప్డ్ ప్లేయర్లలో బెంగళూరు బ్యాటర్ దేవదత్ పడిక్కల్, మనీష్ పాండే, పాల్ వెలాతీల సరసన రజత్ పాటీదార్ నిలిచాడు.
ప్లే ఆఫ్ రౌండ్లో శతకాలు సాధించిన ఆటగాళ్లలో వీరేంద్ర సెహ్వ్గాగ్, షేన్ వాట్సన్, వృద్దిమాన సాహా, మురళీ విజయ్‌ల సరసన పాటిదార్ చేరాడు.
పాటీదార్ మెరుపు శతకం, దినేశ్ కార్తీక్ తో కలసి నమోదు చేసిన కీలక భాగస్వామ్యం కారణంగా బెంగళూరు 14 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ ను కంగుతినిపించడం ద్వారా క్వాలిఫైయర్-2 కు అర్హత సాధించగలిగింది.
అహ్మదాబాద్ వేదికగా మే 27న జరిగే క్వాలిఫైయర్ -2 మ్యాచ్ లో మాజీ చాంపియన్ రాజస్థాన్ రాయల్స్ తో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ అమీతుమీ తేల్చుకోనుంది.
ఈ పోరులో నెగ్గినజట్టు ఈ నెల 29న మోడీ స్టేడియం వేదికగా జరిగే టైటిల్ సమరంలో గుజరాత్ టైటాన్స్ ను ఢీకోనుంది.