సంధి.. లేదా సమరం.. తెలంగాణలో 'ఉగాది' రాజకీయం..
ఇటీవల కాలంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కి, గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కి పొసగడం లేదనే విషయం అందరికీ తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలను రాజ్ భవన్ పక్కనపెట్టడంతో ఈ గొడవ మొదలైంది. బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ కి ఆహ్వానం లేకపోవడంతో అది పతాక స్థాయికి చేరింది. కానీ ఎవరూ ఎక్కడా బయటపడలేదు. ఓ దశలో గవర్నర్ తమిళి సై ట్విట్టర్ వేదికగా కొన్ని పోస్టింగ్ లు పెట్టినా నేరుగా ప్రభుత్వాన్ని టార్గెట్ […]
ఇటీవల కాలంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కి, గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కి పొసగడం లేదనే విషయం అందరికీ తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలను రాజ్ భవన్ పక్కనపెట్టడంతో ఈ గొడవ మొదలైంది. బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ కి ఆహ్వానం లేకపోవడంతో అది పతాక స్థాయికి చేరింది. కానీ ఎవరూ ఎక్కడా బయటపడలేదు. ఓ దశలో గవర్నర్ తమిళి సై ట్విట్టర్ వేదికగా కొన్ని పోస్టింగ్ లు పెట్టినా నేరుగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేయలేదు. అయితే ఇప్పుడు ఉగాది పండగ సందర్భంగా వీరిద్దరికీ ఓ రాజీమార్గం దొరిగింది. రాజ్ భవన్ లో ఈరోజు ఉగాది ముందస్తు వేడుకలు తలపెట్టిన గవర్నర్.. ఆ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ ని కూడా ఆహ్వానించారు. ఈ వేడుకకు కేసీఆర్ వస్తారా రారా అనేదానిపైనే సయోధ్య ఆధారపడి ఉంది.
గత గవర్నర్ నరసింహన్ హయాంలో.. రాజ్ భవన్ తో కేసీఆర్ కి ప్రత్యేక అనుబంధం ఉండేది. ప్రతి కార్యక్రమానికీ ఇద్దరూ కలసి వెళ్లేవారు, రాజ్ భవన్ లో జరిగే కార్యక్రమాలకి కూడా కేసీఆర్ తరచూ హాజరయ్యేవారు. కానీ తమిళిసై హయాంలో గ్యాప్ పెరిగింది. కేసీఆర్ కేంద్రంలోని బీజేపీిని పదే పదే టార్గెట్ చేయడం కూడా దీనికి పరోక్ష కారణంగా చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఉగాది సందర్భంగా ఏం జరుగుతుందో తేలాల్సి ఉంది.
గవర్నర్ కి ఆహ్వానం ఉందా..?
మరోవైపు శనివారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు జరగాల్సి ఉంది. ఈ వేడుకల్లో అధికార పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. మరి ఈ వేడుకకు గవర్నర్ కి ఆహ్వానం పంపారా లేదా అనేదానిపై అధికారిక సమాచారం లేదు. ముందుగా సీఎం కేసీఆర్, ఈరోజు రాజ్ భవన్ లో జరిగే ఉగాది వేడుకల్లో పాల్గొని, ఆ తర్వాత గవర్నర్ ని ఆహ్వానిస్తే.. ఇక్కడితో సమస్యకు ఫుల్ స్టాప్ పడిపోతుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య దూరం తగ్గిపోతుందని అంచనా వేస్తున్నారు. ఉగాది రోజు కూడా ఎవరికి వారే ఎడమొహం పెడమొహంగా ఉంటే.. రాబోయే రోజుల్లో సీఎం వర్సెస్ గవర్నర్ ఎపిసోడ్ మరింత క్లిష్టంగా మారే అవకాశముంది.