కశ్మీర్ ఫైల్స్.. అక్కడ 144 సెక్షన్..

దేశవ్యాప్తంగా ఇప్పుడు కశ్మీర్ ఫైల్స్ సినిమా గురించే చర్చ నడుస్తోంది. కశ్మీర్ ఫైల్స్ సినిమా చూడకపోయినా, ఆ సినిమా చూసి నచ్చిందని చెప్పకపోయినా.. వారిపై దేశద్రోహి అనే ముద్ర వేసేలా ఉంది పరిస్థితి. ఆమధ్య సినిమాపై తన అభిప్రాయాన్ని చెప్పకపోయే సరికి బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. దాన్ని తట్టుకోలేక.. సినిమా బాగుంది, అందరూ చూడండి అంటూ ఓ స్టేట్ మెంట్ ఇచ్చి తప్పించుకోవాల్సి వచ్చింది మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్. […]

Advertisement
Update:2022-03-23 03:05 IST

దేశవ్యాప్తంగా ఇప్పుడు కశ్మీర్ ఫైల్స్ సినిమా గురించే చర్చ నడుస్తోంది. కశ్మీర్ ఫైల్స్ సినిమా చూడకపోయినా, ఆ సినిమా చూసి నచ్చిందని చెప్పకపోయినా.. వారిపై దేశద్రోహి అనే ముద్ర వేసేలా ఉంది పరిస్థితి. ఆమధ్య సినిమాపై తన అభిప్రాయాన్ని చెప్పకపోయే సరికి బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. దాన్ని తట్టుకోలేక.. సినిమా బాగుంది, అందరూ చూడండి అంటూ ఓ స్టేట్ మెంట్ ఇచ్చి తప్పించుకోవాల్సి వచ్చింది మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్. అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్ లాంటి ప్రముఖులకే కాదు, సామాన్యులకు కూడా ఇది తప్పేలా లేదు. ఈ సినిమాకి బీజేపీ పూర్తి అనుకూలంగా ప్రకటించుకుంటూ.. హిందువులపై జరుగుతున్న దాడులను కళ్లకు కట్టారంటూ సినిమాకి ఎక్కడలేని ప్రచారం చేస్తోంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సినిమా చూసేందుకు సెలవలు ప్రకటించడం, ప్రత్యేకంగా సినిమా టికెట్లు కొని పంపిణీ చేయడం కూడా చూస్తున్నాం.

తాజాగా కాంగ్రెస్ పాలిత రాజస్థాన్ లో ఈ సినిమా కారణంగా వివాదం ముసురుకుంది. కోట జిల్లాలో 144 సెక్షన్ విధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్ష బీజేపీ తప్పుబట్టింది. ఏకంగా అసెంబ్లీలో రచ్చ జరిగింది. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే సందీప్ శర్మ, ప్రభుత్వ విధానాలను తప్పుబట్టారు. శాంతి భద్రతలను కాపాడలేని ప్రభుత్వం ఇలా 144 సెక్షన్ విధించి తమ అసమర్థతను చాటుకుంటోందని అసెంబ్లీలో ఆయన మండిపడ్డారు.

సినిమాపై నిషేధం లేదు..
కశ్మీర్ ఫైల్స్ సినిమా వాస్తవాలను కళ్లకు కట్టిందని, కశ్మీరీ పండిట్లపై జరిగిన దాడుల్ని ప్రజలకు చూపించిందనేది బీజేపీ, దాని అనుబంధ సంఘాల వాదన. కానీ ఆ సినిమాతో మత సామరస్యం దెబ్బతింటుందని కొంతమంది ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ లోని కోట జిల్లాలో కశ్మీర్ ఫైల్స్ సినిమా ప్రదర్శన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. సున్నితమైన ప్రాంతం కావడంతో అక్కడ ర్యాలీలు, ప్రదర్శనలు చేపట్టకుండా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీంతో బీజేవైఎం నాయకులు ఆందోళనకు దిగుతున్నారు. ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేపడతామంటున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం వెనక్కు తగ్గబోమంటోంది. సినిమాపై నిషేధం లేదని స్పష్టం చేసింది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని చెబుతోంది.

Tags:    
Advertisement

Similar News