లాక్ డౌన్ మొదలు పెడితే, అది తమిళనాడుతోనే..
దేశంలో ఒమిక్రాన్ కేసులు వేగంగా విస్తరిస్తున్నాయి. తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాలన్నిటిలో ఒమిక్రాన్ జాడ కనపడుతోంది. అయితే ముందస్తు చర్యల్లో భాగంగా ఒమిక్రాన్ వ్యాప్తిని కట్టడి చేయాలంటే కఠిన ఆంక్షలు తప్పనిసరి అంటున్నారు అధికారులు. తమిళనాడు ప్రభుత్వం ఈ విషయంలో మరో అడుగు ముందుకు వేసింది. రాష్ట్రంలో లాక్ డౌన్ తరహా ఆంక్షలు విధించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఆమేరకు అనుమతివ్వాలంటూ కేంద్రానికి లేఖ రాసింది. తమిళనాడు రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ సెల్వ వినాయగం ఈమేరకు […]
దేశంలో ఒమిక్రాన్ కేసులు వేగంగా విస్తరిస్తున్నాయి. తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాలన్నిటిలో ఒమిక్రాన్ జాడ కనపడుతోంది. అయితే ముందస్తు చర్యల్లో భాగంగా ఒమిక్రాన్ వ్యాప్తిని కట్టడి చేయాలంటే కఠిన ఆంక్షలు తప్పనిసరి అంటున్నారు అధికారులు. తమిళనాడు ప్రభుత్వం ఈ విషయంలో మరో అడుగు ముందుకు వేసింది. రాష్ట్రంలో లాక్ డౌన్ తరహా ఆంక్షలు విధించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఆమేరకు అనుమతివ్వాలంటూ కేంద్రానికి లేఖ రాసింది. తమిళనాడు రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ సెల్వ వినాయగం ఈమేరకు కేంద్రానికి ఓ అభ్యర్థన లేఖ పంపించారు. ప్రస్తుతం అక్కడ ఒకే ఒక్క ఒమిక్రాన్ కేసు ఉంది. అయినా కూడా తమిళనాడు కఠిన నిర్ణయాలకు సిద్ధమవుతోంది.
హైదరాబాద్ లో కంటైన్మెంట్ జోన్లు..
తెలంగాణలో కూడా ఒమిక్రాన్ కేసులు రెండంకెల స్థాయిని చేరుకుని వేగంగా వ్యాపిస్తున్నాయి. దీంతో హైదరాబాద్ లోని టోలిచౌకిని ఇప్పటికే కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు అధికారులు. మరోవైపు విదేశాలనుంచి వచ్చినవారితో రిస్క్ ఎక్కువగా ఉండటంతో వారిని గుర్తించి హోమ్ ఐసోలేషన్ ని కఠినంగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎట్ రిస్క్ దేశాలకంటే, ఇతర దేశాలనుంచి వచ్చినవారిలోనే ఒమిక్రాన్ ఎక్కువగా కనపడుతుండటంతో అప్రమత్తం అయ్యారు. అన్ని దేశాలనుంచి వచ్చినవారికి ఒమిక్రాన్ వేరియంట్ ని గుర్తించే పరీక్షలు చేయాలంటూ కేంద్రానికి లేఖ రాశారు. అంతర్జాతీయ విమానాశ్రయంలోనే వారికి పరీక్షలు నిర్వహించి బయటకు పంపించాలని సూచించారు. ఈ అభ్యర్థనకు కేంద్రం ఇంకా స్పందించలేదు.
ఏపీలో నేటినుంచి ఫీవర్ సర్వే..
మరోవైపు ఏపీలో కూడా ఒమిక్రాన్ కేసు బయటపడినా.. రిజల్ట్ వచ్చేనాటికే.. సదరు వ్యక్తికి కొవిడ్ నెగెటివ్ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఏపీలో అధికారికంగా ఒమిక్రాన్ కేసులేవీ లేవు. అయితే మందస్తు జాగ్రత్తల్లో భాగంగా ఈరోజు నుంచి ఇంటింటి ఫీవర్ సర్వే మొదలు పెడుతోంది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే 33 సార్లు ఫీవర్ సర్వే చేపట్టారు. ఇది 34వ సర్వే. ఆశా వర్కర్లు, వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేస్తారు. జ్వరం, జలుబు లాంటి లక్షణాలున్నవారి శ్వాబ్ సేకరిస్తారు. అదే సమయంలో ఈనెల 1నుంచి 17 వరకు విదేశాలనుంచి వచ్చిన 26వేలమంది సమాచారం సేకరించి వారందరికీ మరోసారి పరీక్షలు నిర్వహిస్తారు. కొవిడ్ లక్షణాలుంటే ఒమిక్రాన్ వేరియంట్ ని కూడా నిర్థారించే పరీక్షలకు పంపిస్తారు. మొత్తమ్మీద ఒమిక్రాన్ నేపథ్యంలో కేంద్రం కాస్త నెమ్మదిగా ఉన్నట్టు అనిపించినా.. రాష్ట్రాలు మాత్రం అప్రమత్తం అయ్యాయి. ముందస్తు ఏర్పాట్లలో నిమగ్నం అయ్యాయి.