ఏపీలో పోటాపోటీ దీక్షల విరమణ.. ఎల్లుండి ఢిల్లీకి చంద్రబాబు..
ఏపీలో పోటాపోటీగా సాగిన దీక్షలను రెండు పార్టీలు విరమించాయి. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడికి నిరసనగా చంద్రబాబు పార్టీ ఆఫీస్ లో చేపట్టిన 36గంటల నిరసన దీక్షను విరమించారు. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పోలీసులు ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. కార్యకర్తలకు తాము తోడుగా ఉంటామని, కేసులకు భయపడవద్దని సూచించారు. ప్రతీకారం తీర్చుకుంటాం.. ప్రస్తుతం ప్రజలకు అన్యాయం చేస్తున్నవారు ఎక్కడున్నా తమ ప్రభుత్వం వచ్చాక పట్టుకొస్తామని, చట్టప్రకారం శిక్షిస్తామని చెప్పారు చంద్రబాబు. టీడీపీ […]
ఏపీలో పోటాపోటీగా సాగిన దీక్షలను రెండు పార్టీలు విరమించాయి. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడికి నిరసనగా చంద్రబాబు పార్టీ ఆఫీస్ లో చేపట్టిన 36గంటల నిరసన దీక్షను విరమించారు. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పోలీసులు ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. కార్యకర్తలకు తాము తోడుగా ఉంటామని, కేసులకు భయపడవద్దని సూచించారు.
ప్రతీకారం తీర్చుకుంటాం..
ప్రస్తుతం ప్రజలకు అన్యాయం చేస్తున్నవారు ఎక్కడున్నా తమ ప్రభుత్వం వచ్చాక పట్టుకొస్తామని, చట్టప్రకారం శిక్షిస్తామని చెప్పారు చంద్రబాబు. టీడీపీ అధికారంలోకి రాగానే కమిషన్ వేస్తామని.. తప్పుడు కేసులు పెడితే రేపు అనేది ఉందని మరచిపోవద్దని హెచ్చరించారు. ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరుకు కార్యకర్తలంతా ఉక్కు సంకల్పంతో రావాలని పిలుపునిచ్చారు.
ఢిల్లీ వెళ్లి ఫిర్యాదులు..
ఏపీకి బలగాలను పంపించాలని, ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసిన చంద్రబాబు.. సోమవారం ఢిల్లీ వెళ్లి నేరుగా ఫిర్యాదు చేయడానికి సిద్ధమయ్యారు. టీడీపీ నేతలతో కలసి ఆయన ఢిల్లీ పర్యటన ఖరారు చేసుకున్నారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ని కలుస్తామని చెప్పారు. ఢిల్లీలోని ఇతర పెద్దల్ని కూడా కలసి రాష్ట్రంలోని పరిస్థితి వివరిస్తామన్నారు.
వెంటిలేటర్ పై టీడీపీ.. త్వరలో సహజ మరణం..
మరోవైపు టీడీపీకి పోటీగా వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా జనాగ్రహ దీక్షలు చేపట్టింది. రెండురోజులపాటు సాగిన ఈ దీక్షలు కూడా శుక్రవారం సాయంత్రం ముగిశాయి. దీక్షా శిబిరాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు..కీలక నేతలు పాల్గొన్నారు, చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఏపీలో టీడీపీ ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉందని, త్వరలో సహజమరణం ఖాయమని అన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. కేంద్రం జోక్యం చేసుకుని వైసీపీ ప్రభుత్వాన్ని అస్థిరపరిస్తే.. టీడీపీని బీజేపీలో విలీనం చేస్తానంటూ చంద్రబాబు ఢిల్లీ పెద్దల మందు ప్రతిపాదన పెట్టారని, అందుకే రాష్ట్రపతి పాలన అడుగుతున్నారని విమర్శించారు.
దొంగ దీక్షలు.. కొంగ దీక్షలు..
చంద్రబాబు చేపట్టిన దీక్ష ఓ డ్రామా అని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఈ దీక్ష ద్వారా ఆయన ప్రజలకు ఏం సందేశం ఇచ్చారని ప్రశ్నించారు. 36గంటల పాటు నిరాహార దీక్ష చేసిన 72ఏళ్ల వ్యక్తి గంటకు పైగా ఆవేశంతో ఎలా మాట్లాడగలిగారని, అందుకే దాన్ని దొంగ దీక్ష అంటున్నామని చెప్పారు. పట్టాభి చేసిన అనుచిత వ్యాఖ్యలను సమర్థిస్తూ దానిపై ఓ ఉద్యమం నడిపేందుకు చంద్రబాబు దీక్ష చేపట్టారని మండిపడ్డారు.