ముందు చదువుపై దృష్టిపెట్టు.. విద్యార్థికి క్లాస్ పీకిన సుప్రీంకోర్టు..
దేశవ్యాప్తంగా విద్యార్థులంతా తిరిగి స్కూళ్లకు వచ్చేలా ఆదేశాలివ్వాలని, ఈ మేరకు ప్రభుత్వాలకు మార్గదర్శకాలు జారీ చేయాలంటూ ఢిల్లీకి చెందిన 12వ తరగతి విద్యార్థి వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇది పాలనకు సంబంధించిన అంశమని, దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వమేనని తేల్చి చెప్పింది. అదే సమయంలో సదరు విద్యార్థి చదువుపై దృష్టిపెట్టాలంటూ చురకలంటించింది. పబ్లిసిటీ జిమ్మిక్కని చెప్పలేం కానీ.. పిల్లలందర్నీ స్కూళ్లకు పంపేలా ప్రభుత్వాలను ఆదేశించాలంటూ ఢిల్లీ విద్యార్థి ఏకంగా సుప్రీంకోర్టుని ఆశ్రయించడంతో ఈ […]
దేశవ్యాప్తంగా విద్యార్థులంతా తిరిగి స్కూళ్లకు వచ్చేలా ఆదేశాలివ్వాలని, ఈ మేరకు ప్రభుత్వాలకు మార్గదర్శకాలు జారీ చేయాలంటూ ఢిల్లీకి చెందిన 12వ తరగతి విద్యార్థి వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇది పాలనకు సంబంధించిన అంశమని, దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వమేనని తేల్చి చెప్పింది. అదే సమయంలో సదరు విద్యార్థి చదువుపై దృష్టిపెట్టాలంటూ చురకలంటించింది.
పబ్లిసిటీ జిమ్మిక్కని చెప్పలేం కానీ..
పిల్లలందర్నీ స్కూళ్లకు పంపేలా ప్రభుత్వాలను ఆదేశించాలంటూ ఢిల్లీ విద్యార్థి ఏకంగా సుప్రీంకోర్టుని ఆశ్రయించడంతో ఈ పిల్ వ్యవహారం దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది. పిల్లలు స్కూల్ వాతావరణాన్ని మిస్ అవడం వల్ల వారి మానసిక సమతుల్యం దెబ్బతింటోందని, ఇతరత్రా అనర్థాలు వస్తాయని ఇటీవల పలువురు నిపుణులు, రాజకీయ నాయకులు తమ అభిప్రాయాలు వెలిబుచ్చారు. అయితే దేశవ్యాప్తంగా ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలు ఆన్ లైన్ బోధనకే మొగ్గు చూపుతున్నాయి. పూర్తి స్థాయిలో తరగతి గతి బోధన అన్ని ప్రాంతాల్లో మొదలు కాలేదు. ఈ నేపథ్యంలో విద్యార్థి వేసిన పిల్ పై సుప్రీంకోర్టు ఏమని చెబుతుందోననే ఉత్కంఠ నెలకొంది. అయితే ధర్మాసనం మాత్రం అది తమ పరిధిలో లేదని చెబుతూనే సదరు విద్యార్థిని ముందు చదువుపై దృష్టిపెట్టాలని సుతిమెత్తగా మందలించింది.
‘‘పిటిషన్ వేసిన విద్యార్థిని ముందు చదువుపై దృష్టి పెట్టాలని చెప్పండి. కేసులు, రాజ్యాంగ పరిష్కారాల గురించి ఇప్పుడు అతనికి ఎందుకు? కేవలం ప్రచారం కోసమే ఆ విద్యార్థి ఈ పిల్ వేశాడని చెప్పలేం కానీ, ఇది తప్పుగా వేసిన పిటిషన్. న్యాయమూర్తులు కూడా పత్రికలు చదువుతారు. కొన్ని దేశాల్లో స్కూల్స్ తెరవడం వల్ల కరోనా కేసులు పెరిగాయనే విషయం మాకు తెలుసు. అన్ని రాష్ట్రాలు, వాటి జనసాంద్రత ఒకేలా లేవు. సెకండ్ వేవ్ తీవ్రత ఎలా ఉందో అందరం చూశాం, థర్డ్ వేవ్ తో ముప్పు రావాలని మేము కోరుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులను బడులకు పంపాలని ఆదేశాలు జారీ చేయలేం’’ అని ధర్మాసనం పేర్కొంది. పిల్ ఉపసంహరించుకునేందుకు పిటిషనర్ కు అవకాశం కల్పించింది.