ఆన్ లైనా.. ఆఫ్ లైనా.. పిల్లలకి ఏది బెటర్..?
తెలంగాణలో జులై 1నుంచి బడులు తెరుస్తారు. ఏపీ ప్రభుత్వం ఆగస్ట్ వరకు వేచి చూసే అవకాశం ఉంది. జులైలో టెన్త్, ఇంటర్ పరీక్షలు పూర్తి చేసి, ఆ తర్వాత స్కూళ్లు, కాలేజీలు తెరిచేందుకు ఏపీ విద్యాశాఖ ప్రణాళికలు రచిస్తోంది. అయితే ఇప్పటికిప్పుడు స్కూళ్లు తెరిచినా ఆన్ లైన్ లో పాఠాలు చెప్పాలా, లేక పిల్లలందర్నీ స్కూళ్లకు పిలవాలా అనేది సందేహంగా మారింది. సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుతోంది సరే, థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందనే సంకేతాలు […]
తెలంగాణలో జులై 1నుంచి బడులు తెరుస్తారు. ఏపీ ప్రభుత్వం ఆగస్ట్ వరకు వేచి చూసే అవకాశం ఉంది. జులైలో టెన్త్, ఇంటర్ పరీక్షలు పూర్తి చేసి, ఆ తర్వాత స్కూళ్లు, కాలేజీలు తెరిచేందుకు ఏపీ విద్యాశాఖ ప్రణాళికలు రచిస్తోంది. అయితే ఇప్పటికిప్పుడు స్కూళ్లు తెరిచినా ఆన్ లైన్ లో పాఠాలు చెప్పాలా, లేక పిల్లలందర్నీ స్కూళ్లకు పిలవాలా అనేది సందేహంగా మారింది. సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుతోంది సరే, థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందనే సంకేతాలు కూడా ఉన్నాయి కదా. ఆదమరిస్తే విపత్తు ఎంత భయంకరంగా ఉంటుందో ఇటీవలే ప్రత్యక్షంగా చూశాం. మరోసారి అలాంటి స్వయంకృతాపరాధాలకు ఎవరు మాత్రం సాహసిస్తారు.
తల్లిదండ్రుల్లో భయం..
వాస్తవం చెప్పాలంటే పిల్లల్ని స్కూళ్లకు పంపించడానికి తల్లిదండ్రులు భయపడుతున్నారు. ప్రత్యక్ష తరగతుల నిర్వహణను హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్(HSPA) పూర్తిగా వ్యతిరేకిస్తోంది. అయితే అదే సమయంలో తమ పిల్లలకు ఆన్ లైన్ పాఠాలు అర్థం కావట్లేదనేవారు కూడా ఉన్నారు. ప్రస్తుతానికి తెలంగాణ ప్రభుత్వం మాత్రం జులై 1నుంచి స్కూల్స్ తెరుస్తున్నా.. పిల్లల్ని బడికి పంపించడం తల్లిదండ్రుల ఇష్టానికే వదిలేస్తోంది. పాఠశాలలకు వచ్చి చదువుకోవాలనుకుంటే తల్లిదండ్రుల అంగీకారపత్రం తప్పనిసరి చేస్తారు. ఏపీలో కూడా గతేడాది ప్రభుత్వ స్కూళ్లు, హాస్టళ్ల విషయంలో ఇలాంటి పద్ధతినే పాటించారు.
ఆవురావురు మంటున్న ప్రైవేట్ స్కూల్స్..
తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యులు కరోనా కష్టకాలంలో తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. కార్పొరేట్ స్కూల్స్ తల్లిదండ్రుల వద్ద ముక్కుపిండి ఆన్ లైన్ తరగతుల పేరుతో స్కూల్ ఫీజులు వసూలు చేశాయి. ఓ మోస్తరు కాన్వెంట్ లు, చిన్న పట్టాణాల్లో ఉన్న ప్రైవేట్ స్కూల్స్ మాత్రం ఫీజులు వసూలు కాక ఇబ్బందుల పడ్డాయి. తీరా స్కూల్స్ చివరి దశకి వచ్చే సరికి ఈ ఏడాది లాక్ డౌన్ అనేశారు. దీంతో అరకొర ఫీజులు కూడా ఆగిపోయాయి. ప్రస్తుతం స్కూల్స్ తిరిగి ప్రారంభిస్తారంటున్న నేపథ్యంలో యాజమాన్యాలు రెడీగా ఉన్నాయి. ఆన్ లైన్, ఆఫ్ లైన్ అన్నిటికీ తమ టీచర్స్ సిద్ధంగా ఉన్నారని చెబుతూ పేరెంట్స్ ని ఆకర్షించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాయి.
హాస్టళ్ల సంగతేంటి..?
ప్రభుత్వ హాస్టల్స్, ప్రైవేట్ హాస్టల్స్ లో చదువుకునే విద్యార్థుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. తరగతి గదిలో పిల్లలు భౌతిక దూరం పాటిస్తారు కానీ, హాస్టల్ గదిలో అలాంటిది ఊహించలేం. ప్రభుత్వ హాస్టల్స్ లో పర్యవేక్షణ అంతంతమాత్రంగానే ఉంటుంది. ఒకరికి కరోనా వస్తే.. మిగతా వారికి కూడా అదే రోజు అటాక్ కావడం గ్యారెంటీ. అందుకే హాస్టళ్ల నిర్వహణపై ప్రభుత్వం కాస్త ఆలోచనలో పడింది. దశలవారీగా విద్యాసంస్థలను ప్రారంభిస్తే బాగుంటుందని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. విద్యారంగ నిపుణులు మాత్రం పిల్లలకు ఆన్ లైన్ క్లాసులకంటే, ప్రత్యక్ష తరగతులే ఎక్కువ ఉపయోగంగా ఉంటాయని చెబుతున్నారు. ఆన్ లైన్ పాఠాలతో కంప్యూటర్ స్క్రీన్లు, మొబైల్ స్క్రీన్లకు పిల్లలు అతుక్కుపోతే కంటిచూపు సమస్యలు తలెత్తుతాయని, హెచ్చరిస్తున్నారు. మొత్తమ్మీద తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లు తెరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నా.. ఆన్ లైనా, ఆఫ్ లైనా.. లేదా రెండూ కలిపి నిర్వహించాలా అనే విషయంపై ప్రభుత్వాలు స్థిరమైన నిర్ణయానికి రాలేకపోతున్నాయి.