ప్రైవేటు ఆస్పత్రుల్లో టీకాలు వద్దు -మోదీకి జగన్ లేఖ

భారత్ ని టీకాల కొరత వేధిస్తోంది. కొత్త రకాలు వచ్చినా, పాతవాటి ఉత్పత్తి పెరిగినా.. ఇప్పుడప్పుడే ఈ కొరత తీరే అవకాశం లేదు. ఈ సందర్భంలో ప్రైవేటు ఆస్పత్రులకు నేరుగా తయారీ కంపెనీలనుంచే వ్యాక్సిన్ కొనుగోలుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. కొన్నాళ్లు ఈ ప్రక్రియ సజావుగా సాగినా.. టీకాల కొరతతో ప్రస్తుతం ప్రైవేటు ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్ నిదానించింది. అయితే ఈ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కు తీసుకోవాలని, ప్రైవేటు ఆస్పత్రులు నేరుగా కంపెనీల వద్ద టీకాలు కొనుగోలు చేయకుండా […]

Advertisement
Update:2021-05-23 03:02 IST

భారత్ ని టీకాల కొరత వేధిస్తోంది. కొత్త రకాలు వచ్చినా, పాతవాటి ఉత్పత్తి పెరిగినా.. ఇప్పుడప్పుడే ఈ కొరత తీరే అవకాశం లేదు. ఈ సందర్భంలో ప్రైవేటు ఆస్పత్రులకు నేరుగా తయారీ కంపెనీలనుంచే వ్యాక్సిన్ కొనుగోలుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. కొన్నాళ్లు ఈ ప్రక్రియ సజావుగా సాగినా.. టీకాల కొరతతో ప్రస్తుతం ప్రైవేటు ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్ నిదానించింది. అయితే ఈ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కు తీసుకోవాలని, ప్రైవేటు ఆస్పత్రులు నేరుగా కంపెనీల వద్ద టీకాలు కొనుగోలు చేయకుండా నిలువరించాలని కోరుతూ ప్రధాని నరేంద్రమోదీకి ఏపీ సీఎం జగన్ లేఖ రాశారు.

ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో 45 ఏళ్ల వయసు పైబడిన వారికే టీకాలు అందుతున్నాయి. 18 ఏళ్ల వయసు వారికి అనే లాంఛనం మొదలైనా.. టీకాల కొరత వల్ల అది సాధ్యం కావడంలేదు. 45ఏళ్ల వారికి రెండో డోసు వేయడానికే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ దశలో ప్రైవేటు ఆస్పత్రులకు వ్యాక్సిన్లు తరలి వెళ్తే పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారే అవకాశం ఉంది. మరోవైపు ప్రైవేటు ఆస్పత్రుల్లో టీకాల రేట్లకు రెక్కలొచ్చే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు ఒక్కో డోస్‌ కు రూ.2 వేల నుంచి రూ.25 వేల వరకు వసూలు చేస్తున్నాయని అన్నారు సీఎం జగన్. దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే అవకాశం ఉందని, బ్లాక్ మార్కెట్ వ్యవహారం పెరిగేందుకు కూడా అవకాశం ఉందని సీఎం జగన్ తన లేఖలో వివరించారు.

ప్రజలందరికీ ఉచితంగా టీకా ఇవ్వాలని, లేని పక్షంలో నామమాత్రపు ధరలకే అందివ్వాలని జగన్ కోరారు. ప్రైవేటు ఆస్పత్రులకు నేరుగా టీకాలు కొనే అధికారం ఇస్తే.. బ్లాక్ మార్కెట్ కి వ్యాక్సిన్లు తరలిపోతాయని, రెమిడిసెవిర్ విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందేనని గుర్తు చేశారు. అవసరానికి మించి వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నప్పుడే, ప్రైవేటు భాగస్వామ్యం మంచిదని చెప్పారు. “వ్యాక్సిన్‌ విరివిగా అందుబాటులో ఉన్నప్పుడు ఖర్చు చేయగలిగిన స్థోమత ఉన్న వారు తమకు ఇష్టం ఉన్న ఆస్పత్రికి వెళ్లి వ్యాక్సిన్‌ వేయించుకుంటారు. కానీ డిమాండ్‌ కంటే చాలా తక్కువగా ఇప్పుడు వాక్సిన్‌ ఉత్పత్తి అవుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రులు నేరుగా ఉత్పత్తిదారుల నుంచి వ్యాక్సిన్‌ కొనుగోలుకు అనుమతి ఇచ్చారు. దీంతో వారు ప్రజల నుంచి ఇష్టానుసారం చార్జీ వసూలు చేసే అవకాశం ఏర్పడింది. దేశంలో ఉత్పత్తి అవుతున్న కొవిడ్‌ వ్యాక్సిన్‌ డోస్‌ లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రమే అందుబాటులో ఉండాలి. అప్పుడే ప్రజలందరికీ ఏ ఇబ్బంది లేకుండా టీకాలు వేసే వీలుంటుంది. ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుని, వ్యాక్సిన్‌ బ్లాక్‌ మార్కెట్‌కు తరలిపోకుండా నిరోధిస్తారని ఆశిస్తున్నాను.” అని లేఖలో కోరారు జగన్.

Tags:    
Advertisement

Similar News