యువత కోసం 'గాడ్సే' గ్రంథాలయం!

ప్రపంచం దృష్టిలో అతడు నేరస్థుడు. మహాత్ముడిని చంపిన కిరాతకుడు. కానీ హిందుత్వ సంస్థలకు మాత్రం అతడు ఆరాధ్యుడు. బీజేపీ సహా పలువురు హిందూ సంస్థల ప్రతినిధులు ఇప్పటికే ఈ విషయాన్ని అనేకమార్లు అంగీకరించారు కూడా. అవును… గాంధీని హత్య చేసిన నాథురామ్ గాడ్సే అంటే హిందూ సంస్థలకు ఎనలేని గౌరవం. తాజాగా అఖిల భారతీయ హిందూ మహాసభ మరోమారు గాడ్సే పై అభిమానాన్ని చాటుకుంది. గాడ్సే జ్ఞాపకార్థం.. మధ్యప్రదేశ్​లో ఓ గ్రంథాలయాన్ని ప్రారంభించింది. గ్వాలియర్​లో ఏర్పాటు చేసిన […]

Advertisement
Update:2021-01-12 13:23 IST

ప్రపంచం దృష్టిలో అతడు నేరస్థుడు. మహాత్ముడిని చంపిన కిరాతకుడు. కానీ హిందుత్వ సంస్థలకు మాత్రం అతడు ఆరాధ్యుడు. బీజేపీ సహా పలువురు హిందూ సంస్థల ప్రతినిధులు ఇప్పటికే ఈ విషయాన్ని అనేకమార్లు అంగీకరించారు కూడా. అవును… గాంధీని హత్య చేసిన నాథురామ్ గాడ్సే అంటే హిందూ సంస్థలకు ఎనలేని గౌరవం. తాజాగా అఖిల భారతీయ హిందూ మహాసభ మరోమారు గాడ్సే పై అభిమానాన్ని చాటుకుంది. గాడ్సే జ్ఞాపకార్థం.. మధ్యప్రదేశ్​లో ఓ గ్రంథాలయాన్ని ప్రారంభించింది. గ్వాలియర్​లో ఏర్పాటు చేసిన ఈ గ్రంథాలయానికి ‘గాడ్సే’ పేరును పెట్టింది హిందూ మహాసభ.

గాడ్సే ను నిజమైన జాతీయవాదిగా ప్రపంచం ముందు ఉంచేందుకే ఈ లైబ్రరీని ప్రారంభించినట్టు హిందూ మహాసభ నేతలు ప్రకటించారు. దేశ విభజనను గాడ్సే వ్యతిరేకించాడని గుర్తు చేశారు. యువతలో జాతీయతను ప్రేరేపించడమే గాడ్సే గ్రంథాలయ ఉద్దేశ్యమని హిందూ మహా సభ ఉపాధ్యక్షుడు డాక్టర్​ జైవీర్​ భరద్వాజ్ తెలిపారు. మహాత్మా గాంధీ హత్యకు గాడ్సేను ప్రేరేపించిన అంశాలు, వ్యాసాలు, ఆయన ప్రసంగాలకు సంబంధించిన సాహిత్యమంతా ఈ గ్రంథాలయంలో ఉంటుందన్నారు.

నెహ్రూ, జిన్నాల అధికారం కోసమే దేశ విభజన జరిగిందన్న భరద్వాజ్, నేటి తరానికి వాస్తవాలు తెలియజేసేందుకు ఈ లైబ్రరీ ఉపయోగపడుతుందన్నారు. అందుకే గాంధీని హత్యచేసిన గ్యాలియర్‌ ప్రాంతాన్నే లైబ్రరీ ఏర్పాటుకు ఎంపిక చేసినట్టు తెలిపారు. కాగా… గతంలో హిందూ మహాసభ గ్వాలియర్ కార్యాలయంలో గాడ్సేకు ఆలయాన్ని నిర్మించి విమర్శలు ఎదుర్కొంది. ఆలయం విషయంలో వెనక్కితగ్గిన మహాసభ ఇప్పుడు లైబ్రరీ పేరుతో ముందుకు వచ్చింది.

నాథూరామ్ గాడ్సే పేరుతో గ్రంథాలయం ఏర్పాటు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. హిందూ మహాసభపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. గాంధీని చంపిన వ్యక్తిని ఆరాధించడమంటే హింసను ప్రోత్సహించడమే అని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ప్రతినిధి అబ్బాస్ హఫీజ్ అన్నారు. గాడ్సేను కీర్తించిన సాధ్వి ప్రగ్యకు టికెట్ ఇచ్చిన చరిత్ర బీజేపీది అని కాంగ్రెస్ నేత రవి సక్సేనా విమర్శించారు. కాగా… ఈ విషయంలో తమ ప్రమేయం ఏమీలేదని, రాష్ట్ర ప్రభుత్వమే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని బీజేపీ పేర్కొంది. గతంలోనూ ప్రభుత్వం ఇలాంటి విషయాల్లో చర్యలు తీసుకుందని, ఇప్పుడూ అలాగే స్పందిస్తుందని బీజేపీ ప్రతినిధి పంకజ్ చతుర్వేది అన్నారు. మరి గాడ్సే గ్రంథాలయంపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Tags:    
Advertisement

Similar News