రాముడి పేరుతో ఎవరికెంత మైలేజీ..?
ఆంధ్రరాష్ట్ర రాజకీయాలన్నీ రామతీర్థం చుట్టూనే తిరుగుతున్నాయి. శ్రీరాముడి విగ్రహానికి అవమానం జరిగిందంటూ ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయడం సహజమే అయినా.. వారిలో వారే మైలేజీ కోసం గొడవలు పడటం మరింత ఆసక్తి కలిగించే అంశం. రామతీర్థం ఘటన జరిగిన వెంటనే బీజేపీ స్పందించింది, జనసేనాని అంతకంటే తీవ్రంగా స్పందించారు. అయితే వీరిని వెనక్కి నెడుతూ ఏకంగా చంద్రబాబు రామతీర్థానికి వెళ్లొచ్చే సరికి టీడీపీకి మైలేజీ పెరిగింది. చంద్రబాబు పర్యటనతో ఏదో జరిగిపోయిందని కాదు కానీ.. విశాఖ ఎయిర్ పోర్ట్ […]
ఆంధ్రరాష్ట్ర రాజకీయాలన్నీ రామతీర్థం చుట్టూనే తిరుగుతున్నాయి. శ్రీరాముడి విగ్రహానికి అవమానం జరిగిందంటూ ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయడం సహజమే అయినా.. వారిలో వారే మైలేజీ కోసం గొడవలు పడటం మరింత ఆసక్తి కలిగించే అంశం. రామతీర్థం ఘటన జరిగిన వెంటనే బీజేపీ స్పందించింది, జనసేనాని అంతకంటే తీవ్రంగా స్పందించారు. అయితే వీరిని వెనక్కి నెడుతూ ఏకంగా చంద్రబాబు రామతీర్థానికి వెళ్లొచ్చే సరికి టీడీపీకి మైలేజీ పెరిగింది. చంద్రబాబు పర్యటనతో ఏదో జరిగిపోయిందని కాదు కానీ.. విశాఖ ఎయిర్ పోర్ట్ లో ఆయన ఎంట్రీ, మందీ మార్బలంతో బోడికొండ మెట్లెక్కడం.. లాంటి వన్నీ టీడీపీ అనుకూల మీడియాలో మారుమోగిపోయాయి.
అసలు తాను రామతీర్థం వెళ్లడమే ఓ పెద్ద విజయం అన్నట్టుగా చంద్రబాబు విజయ చిహ్నాన్ని చూపెడుతూ, బొటనవేలు పైకెత్తి అభివాదం చేస్తూ హడావిడి చేశారు. దీంతో సహజంగానే బీజేపీ నేతల్లో కలవరం మొదలైంది. టీడీపీ ఈ విషయాన్ని హైజాక్ చేసిందనే ఆలోచనతో.. బాబు రామతీర్థంలో ఉండగానే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన.. టీడీపీ హయాంలో జరిగిన తప్పుల్ని, ఆలయాల కూల్చివేతను ప్రస్తావించి బాబుపై విమర్శలు సంధించారు. ఇక సినిమా షూటింగ్ లో ఉన్న పవన్ కల్యాణ్ కి కూడా అర్జంట్ గా రామతీర్థం వచ్చేయాలనిపించింది. పనిలో పనిగా పాకిస్తాన్ తో పోలిక పెడుతూ.. వైసీపీ సర్కారుపై విమర్శలు సంధించారు పవన్ కల్యాణ్. పాకిస్తాన్ లో ఆలయాలు కూల్చివేస్తే అక్కడి ప్రభుత్వం 45మందిని అరెస్ట్ చేసిందని, ఆలయాల పునర్నిర్మాణ బాధ్యత తీసుకుందని గుర్తు చేశారు పవన్. ఆ పాటి తెగువ జగన్ ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. ఇదంతా ప్రెస్ మీట్ రాజకీయం కావడంతో పెద్దగా జనాలకు ఎక్కలేదు. దీంతో పవన్ నేరుగా రామతీర్థం రావడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. అందుకోసమే ‘రామతీర్థ ధర్మయాత్ర’ పేరుతో ఓ కార్యక్రమాన్ని రూపొందించింది జనసేన. ఈనెల 5న ఈ యాత్ర ఉంటుందని ప్రకటించారు. బీజేపీతో గొడవ ఎందుకని అనుకున్నారో ఏమో.. బీజేపీ-జనసేన సంయుక్త ఆధ్వర్యంలో అంటూ కేవలం జనసేన తరపున మాత్రమే ఈ ప్రెస్ నోట్ విడుదలైంది. ఇక ఈ యాత్ర పేరుతో పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్రను చుట్టి వస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం దర్శకుడు క్రిష్ కి కరోనా సోకడంతో పవన్ కల్యాణ్ తో ఆయన చేస్తున్న సినిమా షూటింగ్ వాయిదా పడింది. అలా కాల్షీట్లు ఖాళీ అవడంతో ఆ టైమ్ ని ఇలా సద్వినియోగం చేసుకుంటున్నారు పవన్. మొత్తమ్మీద రామతీర్థం వ్యవహారంలో ప్రతిపక్షాలన్నీ మైలేజీకోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. రామనామ స్మరణలో హనుమంతుడినే మించిపోతున్నాయి.