'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా రివ్యూ

నటీనటులు: సాయితేజ్‌, న‌భా న‌టేశ్, రాజేంద్ర ప్రసాద్ , రావు రమేష్ , ఝాన్సీ, వెన్నెల కిషోర్ త‌దిత‌రులు సంగీతం: త‌మ‌న్‌ సినిమాటోగ్ర‌ఫీ: వెంక‌ట్ సి.దిలీప్‌ నిర్మాత‌: బీవీఎస్ఎన్‌.ప్ర‌సాద్‌ రచన – ద‌ర్శ‌క‌త్వం: సుబ్బు విడుదల : జీ స్టూడియోస్ విడుదల తేదీ : 25 డిసెంబర్ 2020 రేటింగ్ : 2.25/5 దాదాపు 9 నెలల తర్వాత థియేటర్లు ఓపెన్ అయ్యాయి.. కాస్త హైప్ ఉన్న సినిమా ఏదైనా థియేటర్లలోకి వస్తే ఆడియన్స్ రెస్పాన్స్ చూద్దామని ఇండస్ట్రీ […]

Advertisement
Update:2020-12-25 11:18 IST

నటీనటులు: సాయితేజ్‌, న‌భా న‌టేశ్, రాజేంద్ర ప్రసాద్ , రావు రమేష్ , ఝాన్సీ, వెన్నెల కిషోర్ త‌దిత‌రులు
సంగీతం: త‌మ‌న్‌
సినిమాటోగ్ర‌ఫీ: వెంక‌ట్ సి.దిలీప్‌
నిర్మాత‌: బీవీఎస్ఎన్‌.ప్ర‌సాద్‌
రచన – ద‌ర్శ‌క‌త్వం: సుబ్బు
విడుదల : జీ స్టూడియోస్
విడుదల తేదీ : 25 డిసెంబర్ 2020
రేటింగ్ : 2.25/5

దాదాపు 9 నెలల తర్వాత థియేటర్లు ఓపెన్ అయ్యాయి.. కాస్త హైప్ ఉన్న సినిమా ఏదైనా థియేటర్లలోకి వస్తే ఆడియన్స్ రెస్పాన్స్ చూద్దామని ఇండస్ట్రీ అంతా ఎదురుచూస్తోంది. మరోవైపు సినీ ప్రేమికులు, సిల్వర్ స్క్రీన్ పై సినిమా కోసం వెయిటింగ్. సరిగ్గా ఇలాంటి టైమ్ లో సోలో బ్రతుకే సో బెటర్ రిలీజైంది. దీంతో ఇండస్ట్రీ అంతా దీనికి హైప్ ఇచ్చింది. హీరోలంతా కలిసి ఈ సినిమాను ప్రమోట్ చేశారు. అందరూ మాస్కులు పెట్టుకొని థియేటర్లకు రావాలని ఊదరగొట్టారు.

ఈ హైప్, అడ్వాంటేజ్ వల్ల సోలో బ్రతుకే సో బెటర్ సినిమాకు ఓపెనింగ్స్ వచ్చాయి. మూవీ బిజినెస్, థియేట్రికల్ బిజినెస్ ను ఎంకరేజ్ చేయాలి కాబట్టి కొందరు మొహమాటానికి ఈ సినిమాను యావరేజ్ చేశారు. అంతేతప్ప.. ఇంతకుముందు వచ్చిన చాలా సినిమాల్లా ఇది కూడా ఓటీటీలోకి వచ్చి ఉన్నట్టయితే చాలామంది దీన్ని పిచ్చ లైట్ తీసుకునేవాళ్లు. రేటింగ్స్ లో కూడా చీల్చి చెండాడేవాళ్లు.

రెండు పారాగ్రాఫుల్లో చెప్పాలంటే ఈ సినిమా రిజల్ట్ ఇదే. ఇప్పుడు సినిమాలో అసలు మేటర్ గురించి చూద్దాం. విరాట్ (సాయితేజ్) కు సోలోగా ఉండడమే ఇష్టం. తల్లి, తండ్రి, ప్రేయసి లాంటి ఎటాచ్ మెంట్స్ ఇతడికి ఇష్టం ఉండవు. (ఎందుకని అడగొద్దు, దర్శకుడు చెప్పలేదు). ఇలాంటి విరాట్ ఏకంగా సోలో బ్రతుకే సో బెటర్ అంటూ స్లోకాలతో ఓ పుస్తకం రాస్తాడు, ఉద్యమం నడుపుతాడు. గ్యాంగ్ ను తయారుచేస్తాడు. హీరో మామ (రావురమేష్) ఇతడికి ఫుల్ సపోర్ట్ ఇస్తుంటాడు.

అయితే సోలో బ్రతుకు సో బెటర్ కాదని ప్రూవ్ చేయడం కొత్త దర్శకుడు సుబ్బు లక్ష్యం. అందుకే దానికి తగ్గట్టు బ్యాక్ టు బ్యాక్ ఎపిసోడ్స్ దించేస్తాడు. ముందుగా ముగ్గురు స్నేహితుల్ని పెళ్లి పేరుతో హీరోకు దూరం చేస్తాడు. తర్వాత హీరో మామయ్య భార్యను చంపేస్తాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి హీరో మామయ్యను కూడా చంపేస్తాడు. ఈ పరిణామాలతో హీరోకు సోలో బ్రతుకు వేస్ట్ అనిపిస్తాది. జంట కోసం వేట మొదలుపెడతాడు.

సరిగ్గా ఇక్కడే హీరోకు హీరోయిన్ పరిచయం అవుతుంది. హీరో స్లోకాలకు, సో కాల్డ్ ఉద్యమానికి ప్రభావితం అయిన అమ్మాయి ఈమె. హీరో మధ్యలో ఆపేసిన సోలో బ్రతుకు ఉద్యమాన్ని ఈమె కొనసాగిస్తుంటుంది. ఈమె మనసు మార్చి, హీరో ఎలా తన దారిలోకి తెచ్చుకున్నాడేది క్లైమాక్స్.

లెక్కప్రకారం ఈ సీక్వెన్స్ లో కథ తర్వాత హీరోహీరోయిన్ల పెర్ఫార్మెన్సుల గురించి మాట్లాడుకోవాలి. కానీ ఇక్కడ వీళ్ల కంటే ముందు కొత్త దర్శకుడు సుబ్బు గురించి మాట్లాడుకోవాలి. ఈ సినిమా చూస్తున్నంత సేపు సుబ్బుకు దర్శకుడు అయిపోదామనే తొందర ఎందుకు అనే ప్రశ్న మనసును తొలి చేస్తుంది. సినిమా పూర్తయ్యేసరికి, ఈ దర్శకుడు ఇంకొన్నాళ్లు ఎవరిదగ్గరైనా పనిచేసి, ఆ తర్వాత ఈ సినిమా తీస్తే బాగుణ్ను అనే గట్టి అభిప్రాయానికి వచ్చేస్తాం. అంతలా ప్రభావం చూపించాడు సదరు సుబ్బు.

అతడి అనుభవలేమి ఈ సినిమాలో కొట్టొచ్చినట్టు కనిపించింది. ఎమోషనల్ గా హై ఇచ్చే సీన్ ఒక్కటంటే ఒక్కటి లేదు. బాగా పేలుతుందనుకున్న కామెడీ సీన్స్ ను కూడా పైపైన తేల్చేశాడు ఈ దర్శకుడు. చివరికి హీరోహీరోయిన్ల నుంచి కూడా సరైనా హావభావాలు రాబట్టుకోలేకపోయాడు.

ఇప్పటికే ఎన్నో లవ్ స్టోరీల్లో నటించాడు సాయితేజ్. కానీ ఈ సినిమాలో అతడి యాక్టింగ్ లో మొహమాటం కనిపించింది. ఇక్కడ ఇంత చాల్లే… మనకెందుకులే.. అనే ఫీలింగ్ తో నటించినట్టు అనిపించింది. దీనికితోడు చాలా చోట్ల సాయితేజ్ ఫిజిక్ ఇబ్బందిపెడుతుంది. బాగా బక్కచిక్కిన నభా, కాస్త బొద్దుగా మారిన సాయితేజ్ కొన్ని ఫ్రేముల్లో ఎబ్బెట్టుగా కనిపించారు.

ఇక టెక్నికల్ గా చూసుకుంటే, ఈ సినిమాను అంతోఇంతో చూడదగ్గట్లుగా చేసిన ఎలిమెంట్స్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ. అటు తమన్, ఇటు వెంకట్ దిలీప్ కలిసి ఈ సినిమాను టెక్నికల్ గా నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఆర్ట్ వర్క్ అస్సలు బాగాలేదు. స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రొటీన్ గా ఉన్నాయి.

నిజానికి ఈ సినిమాను ఓ అనుభవజ్ఞుడైన దర్శకుడు, కాస్త కామెడీ పల్స్ తెలిసిన డైరక్టర్ ఎవరైనా హ్యాండిల్ చేసి ఉన్నట్టయితే పైన ఇచ్చిన 2.25 రేటింగ్ 3 క్రాస్ అయ్యేది. ఎందుకంటే ఈ కంటెంట్ లో అలాంటి స్టఫ్ ఉంది. అందరూ సరదాగా నవ్వుకునే ఫన్ ఉంది. కానీ ఏం లాభం, సన్నివేశాల్లో బలం లేకపోవడం, దర్శకుడిలో అనుభవం లేకపోవడం సోలో బ్రతుకును సోల్ లేని బ్రతుగ్గా మార్చేసింది.

బాటమ్ లైన్: సోల్ లేని బ్రతుకు

Advertisement

Similar News