లంచాలు, కమిషన్లు ఇకపై ఉండవు...

ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో పారదర్శకత కోసమే కార్పొరేషన్‌ను తీసుకొచ్చినట్టు చెప్పారు ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి. ఏపీ కార్పొరేషన్‌ ఫర్‌ ఔట్‌ సోర్స్‌డ్‌ సర్వీసెస్‌ – ఆప్కాస్‌ను తాడేపల్లి నుంచి ఆన్‌లైన్‌లో ప్రారంభించిన ముఖ్యమంత్రి. ఇకపై ఎటువంటి లంచాలు, వివక్ష లేకుండా నేరుగా ఉద్యోగుల చేతికే జీతాలు అందుతాయన్నారు. మధ్యవర్తులతో పని ఉండదన్నారు. ఈ కార్పొరేషన్ వల్ల 47వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మంచి జరుగుతుందన్నారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల్లో 50 శాతం బీసీ,ఎస్సీ ఎస్టీలకు కేటాయిస్తామన్నారు. మహిళలకు […]

Advertisement
Update:2020-07-03 06:46 IST

ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో పారదర్శకత కోసమే కార్పొరేషన్‌ను తీసుకొచ్చినట్టు చెప్పారు ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి. ఏపీ కార్పొరేషన్‌ ఫర్‌ ఔట్‌ సోర్స్‌డ్‌ సర్వీసెస్‌ – ఆప్కాస్‌ను తాడేపల్లి నుంచి ఆన్‌లైన్‌లో ప్రారంభించిన ముఖ్యమంత్రి.

ఇకపై ఎటువంటి లంచాలు, వివక్ష లేకుండా నేరుగా ఉద్యోగుల చేతికే జీతాలు అందుతాయన్నారు. మధ్యవర్తులతో పని ఉండదన్నారు. ఈ కార్పొరేషన్ వల్ల 47వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మంచి జరుగుతుందన్నారు.

ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల్లో 50 శాతం బీసీ,ఎస్సీ ఎస్టీలకు కేటాయిస్తామన్నారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. ఔట్‌ సోర్సింగ్ వ్యవస్థను ఇకపై పూర్తిగా కలెక్టర్లే పర్యవేక్షిస్తారన్నారు. పద్దతి ప్రకారమే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు అందిస్తామన్నారు.

ఇకపై ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల నియామకంలో పూర్తి పారదర్శకత ఉంటుందన్నారు. పాదయాత్ర సమయంలో అనేక మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు వారి సమస్యలను తన దృష్టికి తెచ్చారన్నారు.

టీడీపీ హయాంలో మొత్తం ఔట్‌ సోర్సింగ్ వ్యవస్థ కొందరు వ్యక్తుల చేతుల్లో ఉండేదన్నారు. అన్ని గుళ్లలో పారిశుద్ధ కాంట్రాక్టును చంద్రబాబు బంధువు భాస్కరనాయుడికే ఔట్ సోర్సింగ్ కింద అప్పగించారన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను నియమించకుండానే… నియమించినట్టు రికార్డులు చూపి డబ్బులు కాజేసిన ఉదంతాలున్నాయన్నారు. టీడీపీ హయాంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగం రావాలన్నా… జీతం అందాలన్నా లంచాలు, కమిషన్లు ఇవ్వాల్సి వచ్చేదన్నారు. ఇకపై ప్రతి నెల ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తామన్నారు.

ఆప్కాస్‌కు కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, సిబ్బంది బదలాయింపు తర్వాత వారి వేతనాలన్నీ ఆ కార్పొరేషన్‌ ద్వారానే చెల్లిస్తారు. ఆయా శాఖలు, విభాగాలు, సంస్థలు, కార్యాలయాలు నేరుగా వేతనాలు చెల్లించవు. ఉద్యోగులు, సిబ్బందిని నియమించుకున్న సంస్థలు, శాఖలు, విభాగాలు, కార్యాలయాలు ప్రతి నెలా వేతనాలు, ఇతర సదుపాయాలకు సంబంధించిన బిల్లులను ఏపీసీఓఎస్‌కు చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి పారదర్శకంగా సాగే ఈ విధానం వల్ల ఎక్కడా కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, సిబ్బంది వేతనాల్లో కోత పడదు. అవినీతికి తావుండదు. ప్రైవేట్‌ ఏజెన్సీలు, దళారీలు తొలగిపోతారు కాబట్టి లంచాలు, కమీషన్లకు తావుండదు.

ఇది ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్‌ అని… ఉద్యోగ భద్రత ఉండాలంటే జాగ్రత్తగా పనిచేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు బాగా పనిచేసినంత కాలం ఉద్యోగానికి వచ్చిన ముప్పేమీ ఉండదన్నారు.

Tags:    
Advertisement

Similar News