మరో సంస్కరణ.... ఇక బ్రోకర్లు ఉండరు... మొత్తం ఆన్ లైన్ లోనే...
ఏపీలోని వైసీపీ ప్రభుత్వం రిజిస్ట్రేషన్స్ శాఖలో ప్రక్షాళనకు సిద్ధమైంది. ఈ నవంబర్ 1 నుంచే ఈ శాఖలో మార్పులకు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. అవినీతి ఎక్కువగా జరిగే రిజిస్ట్రేషన్ శాఖలో ఇక అవినీతి అనేదానికే చోటు లేకుండా, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పూర్తిగా ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ విధానాన్ని అమలుచేయబోతోంది. ఈ కొత్త విధానం వల్ల రిజిస్ట్రేషన్ శాఖలో పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం, అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రక్షాళనలో భాగంగా ఇకపై అమ్మకం దారులు, కొనుగోలుదారులు […]
ఏపీలోని వైసీపీ ప్రభుత్వం రిజిస్ట్రేషన్స్ శాఖలో ప్రక్షాళనకు సిద్ధమైంది. ఈ నవంబర్ 1 నుంచే ఈ శాఖలో మార్పులకు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. అవినీతి ఎక్కువగా జరిగే రిజిస్ట్రేషన్ శాఖలో ఇక అవినీతి అనేదానికే చోటు లేకుండా, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పూర్తిగా ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ విధానాన్ని అమలుచేయబోతోంది.
ఈ కొత్త విధానం వల్ల రిజిస్ట్రేషన్ శాఖలో పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం, అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రక్షాళనలో భాగంగా ఇకపై అమ్మకం దారులు, కొనుగోలుదారులు స్వయంగా వాళ్ళ డాక్యుమెంట్ లను వాళ్ళే తయారు చేసుకొని… ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ రుసుమును కూడా ఆన్ లైన్ లో చెల్లించే విధంగా మార్పులు చేశారు అధికారులు.
వ్యవసాయ భూములు, నివాస స్థలాలు, భవనాలకు సంబంధించి…. తాకట్టు రిజిస్ట్రేషన్, సేల్ అగ్రిమెంట్, జిపిఎ, సేల్‌డీడ్, గిఫ్ట్ రిజిస్ట్రేషన్… తదితర రిజిస్ట్రేషన్ ప్రక్రియలకు అనుగుణంగా 16 నమూనా డాక్యుమెంట్లను స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ వెబ్ సైట్ లో ఉంచింది. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ఈ నమూనా డాక్యుమెంట్లలను ఉంచారు. వినియోగదారులు వారికి అవసరమైన నమూనాని వినియోగించుకోవచ్చు.
ఈ డాక్యుమెంట్ లలో అమ్మకం, కొనుగోలుదారులు తమ వివరాలను నింపి వాటిని ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయాలి. ఈ పనిని గతంలో డాక్యుమెంట్ రైటర్లు చేసేవారు. ఇప్పుడు వారితో అవసరం లేకుండానే కొనుగోలు, అమ్మకం దారులే నేరుగా చేసుకునే వీలు కల్పించారు. ఈ నమూనా పత్రంలో ఉన్న వివరాలే కాకుండా…. అదనపు అంశాలను కూడా దీనిలో నమోదు చేసుకోవచ్చు. సిద్దం చేసుకున్న మొత్తం డాక్యుమెంట్‌ను ప్రింట్ తీసుకోని రిజిస్ర్టేషన్ కార్యాలయానికి వెళ్తే.. సదరు డాక్యుమెంట్‌ను స్కాన్ చేసి, అధికారులు రిజిస్ర్టేషన్ ప్రక్రియను నిర్వహిస్తారు.
ఇప్పటికే కృష్ణా జిల్లా, విశాఖపట్నంలో ఎంపిక చేసిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ ప్రక్రియను ప్రయోగాత్మకంగా చేపట్టారు. ఈ ప్రక్రియ అమలులో ఇబ్బందులను తెలుసుకునేందుకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే ఇందులోని పలు లోపాలను అధికారులు గుర్తించి, వాటిని సవరించారు. ఈ ప్రక్రియను నవంబర్ ఒకటో తేదీనుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు చేయబోతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ సంస్కరణలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆ శాఖ కమిషనర్ శ్రీ సిద్దార్ధాజైన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించబోతున్నారు. ఈ అవగాహన కార్యక్రమాలకి న్యాయవాదులు, పురప్రముఖులు, రియాల్టర్లు, బిల్డర్లు, సాధారణ ప్రజలను ఆహ్వానిస్తున్నారు. వారి నుంచి సలహాలను, సూచనలను స్వీకరిస్తారు. ఇందుకోసం రెండు బృందాలను ఎంపిక చేశారు.
ఈ కొత్త విధానంలో భాగంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో సమర్పించే డాక్యుమెంట్లను… ఏ కారణం చేతనైనా తిరస్కరిస్తే, దానిపై అప్పీల్ చేసుకునేందుకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. ఏ కారణాల వల్ల డాక్యుమెంట్ ను తిరస్కరించారో సదరు అధికారి నిర్ణీత సమయంలో పూర్తి వివరణ అందించాలి. దీనివల్ల రిజిస్ట్రేషన్లలో పారదర్శకత మరింత పెరుగుతుందని ప్రభుత్వం, అధికారులు భావిస్తున్నారు.