సీమలో భారీ వర్షాలు...
రాయలసీమలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షం రికార్డు అయింది. నంద్యాల డివిజన్‌లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు చోట్ల రోడ్లు తెగిపోయి రాకపోకలు నిలిచిపోయాయి. నంద్యాల డివిజన్‌లో సోమవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురుస్తోంది. పలు గ్రామాలను వరద నీళ్ళు చుట్టుముట్టాయి. దీంతో ఇన్‌చార్జ్ కలెక్టర్ భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో అధికారులతో కలిసి పర్యటిస్తున్నారు. ఆళ్లగడ్డ, గోస్పాడు… ఇలా పలు గ్రామాల్లోకి వరద నీరు వచ్చి […]
రాయలసీమలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షం రికార్డు అయింది. నంద్యాల డివిజన్‌లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు చోట్ల రోడ్లు తెగిపోయి రాకపోకలు నిలిచిపోయాయి.
నంద్యాల డివిజన్‌లో సోమవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురుస్తోంది. పలు గ్రామాలను వరద నీళ్ళు చుట్టుముట్టాయి. దీంతో ఇన్‌చార్జ్ కలెక్టర్ భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో అధికారులతో కలిసి పర్యటిస్తున్నారు. ఆళ్లగడ్డ, గోస్పాడు… ఇలా పలు గ్రామాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. చాలా ఏళ్ల తర్వాత ఇలాంటి వర్షం చూస్తున్నామని స్థానికులు చెబుతున్నారు.
కడప జిల్లాలోని 15 మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఈ ఏడాది కడప జిల్లాలో అతి తక్కువ వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో లోటు కొద్దిమేర తీరే అవకాశం ఉంది.
రాజుపాలెం, దువ్వూరు మండలాల్లో 15 సెంటీమీటర్ల భారీ వర్షం నమోదైంది. ఈ రెండు మండలాల్లో వందల ఎకరాల పంట నీట మునిగింది. పలుచోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి.
అటు ఒంగోలులో సోమవారం సాయంత్రం హఠాత్తుగా భారీ వర్షం కురిసింది. రెండు గంటల పాటు వర్షం హోరెత్తింది .దాంతో నగరం జలమయమైంది. పలు చోట్ల చెట్లు కూలిపోయాయి. రోడ్లపై మోకాళ్ల లోతు నీళ్లు నిలిచాయి. దాంతో అధికారులను మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అప్రమత్తం చేశారు. ప్రకాశం జిల్లాలోని పలు మండలాల్లో భారీ వర్షం కురిసింది.
అనంతపురం జిల్లాలోనూ ఆదివారం రాత్రి నుంచే వర్షం కురుస్తోంది. చాలా కాలం తర్వాత పెన్నా నదిలో నీటి ప్రవాహం కనిపిస్తోంది. తాడిప్రతిలో 9 సెం.మీల వర్షం నమోదైంది. జిల్లా మొత్తం ముసురుకుంది.
జిల్లాలోని 59 మండలాల్లో 10 మి. మీ సగటు వర్షపాతం నమోదైంది. జిల్లాలో విస్తరంగా వర్షం కురుస్తుండడంతో మొక్క జొన్న, ఇతర చిరు ధాన్యాల పంటలను వేసేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు.