ముంబై టైటిల్ విజయంలో ఆ ఐదుగురు

బ్యాటింగ్ లో కిరాన్ పోలార్డ్ కీలక ఇన్నింగ్స్ బౌలింగ్ లో బుమ్రా, చాహార్ షో డెత్ ఓవర్ల బౌలింగ్ లో డెడ్లీ మలింగ ఆల్ రౌండ్ ప్రతిభతో హార్థిక్ పాండ్యా ఐపీఎల్ 12వ సీజన్లో ముంబై ఇండియన్స్ విజయాల వెనుక ఐదుగురు ఆటగాళ్ల విశేష కృషి ఎంతో ఉంది. సీనియర్ స్టార్లు లాసిత్ మలింగ, కీరాన్ పోలార్డ్ నుంచి నవతరం ఆటగాళ్లు రాహుల్ చాహర్, హార్థిక్ పాండ్యా వరకూ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. క్రికెట్లో… ఫార్మాట్ ఏదైనా […]

Advertisement
Update:2019-05-15 02:51 IST
  • బ్యాటింగ్ లో కిరాన్ పోలార్డ్ కీలక ఇన్నింగ్స్
  • బౌలింగ్ లో బుమ్రా, చాహార్ షో
  • డెత్ ఓవర్ల బౌలింగ్ లో డెడ్లీ మలింగ
  • ఆల్ రౌండ్ ప్రతిభతో హార్థిక్ పాండ్యా

ఐపీఎల్ 12వ సీజన్లో ముంబై ఇండియన్స్ విజయాల వెనుక ఐదుగురు ఆటగాళ్ల విశేష కృషి ఎంతో ఉంది. సీనియర్ స్టార్లు లాసిత్ మలింగ, కీరాన్ పోలార్డ్ నుంచి నవతరం ఆటగాళ్లు రాహుల్ చాహర్, హార్థిక్ పాండ్యా వరకూ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.

క్రికెట్లో… ఫార్మాట్ ఏదైనా ఓ జట్టు విజేతగా నిలవాలంటే జట్టులోని 11 మంది ఆటగాళ్లు సమష్టిగా రాణించక తప్పదు. అయితే..ధూమ్ ధామ్ టీ-20లో.. అదీ …ఐపీఎల్ లీగ్ మ్యాచ్ ల్లో మాత్రం..జట్టులోని ప్రధాన ఆటగాళ్లు ఇద్దరు లేదా ముగ్గురు రాణించినా…కీలక ఇన్నింగ్స్ ఆడినా సరిపోతుంది.

ముంబై పంచపాండవులు…

అయితే… మూడుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ రికార్డుస్థాయిలో ఐదోసారి విజేతగా నిలవడం వెనుక…ప్రధానంగా ఐదుగురు ఆటగాళ్ల పాత్ర ఎంతో ఉంది.

ఓపెనర్లు క్వింటన్ డీ కాక్, రోహిత్ శర్మ, వన్ డౌన్ సూర్యకుమార్ యాదవ్ సైతం తమవంతు పాత్ర నిర్వర్తించినా… కీరన్ పోలార్డ్, హార్ధిక్ పాండ్యా, జస్ ప్రీత్ బుమ్రా, లాసిత్ మలింగ, రాహుల్ చాహర్ ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోక తప్పదు.

పాండ్యా ఫటాఫట్ బ్యాటింగ్…

ముంబై ఇండియన్స్ డైనమైట్, యంగ్ గన్ హార్థిక్ పాండ్యా…లీగ్ దశలో స్థాయికి మించి రాణించాడు. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లోనూ తానేమిటో నిరూపించుకొన్నాడు.

తన అమ్ములపొదిలోని సరికొత్త అస్త్రం హెలీకాప్టర్ షాట్ తో అభిమానులను అలరించడమే కాదు… ధోనీనే గుర్తుకు తెచ్చాడు.

కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా నైట్ రైడర్స్ తో ముగిసిన మ్యాచ్ లో హార్థిక్ పాండ్యా కేవలం 17 బాల్స్ లోనే మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. 9 సిక్సర్లు, 6 బౌండ్రీలతో 91 పరుగులు నమోదు చేశాడు.

2019 సీజన్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించిన క్రికెటర్ గా అవార్డు అందుకొన్నాడు. మొత్తం 16మ్యాచ్ ల్లో 402 పరుగులతో సహా… 191.42 స్ట్రయిక్ రేట్ సాధించాడు. ఫైనల్లో సైతం మెరుపువేగంతో సాధించిన పరుగులు ముంబై విజయానికి తోడ్పడ్డాయి.

ముంబై కింగ్ పో…లార్డ్…

ముంబై ఇండియన్స్ సీనియర్ స్టార్ కీరాన్ పోలార్డ్…లీగ్ దశలో మాత్రమే కాదు…ఫైనల్లో సైతం కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టు టైటిల్ విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు.

లీగ్ దశలో కింగ్స్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో… ఓటమి తప్పదనుకొన్న స్థితి నుంచి తనజట్టును విజేతగా నిలిపాడు.

కేవలం 31 బాల్స్ లోనే 10 సిక్సర్లతో 83 పరుగుల మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు.

హైదరాబాద్ వేదికగా ముగిసిన లో స్కోరింగ్ టైటిల్ ఫైట్ లో సైతం పోలార్డ్ 41 పరుగుల నాటౌట్ స్కోరుతో నిలిచాడు. తనజట్టు టైటిల్ నెగ్గడంలో ప్రధానపాత్ర వహించాడు.

యార్కర్ల కింగ్ జస్ ప్రీత్ బుమ్రా…

పదునైన ముంబై బౌలింగ్ అమ్ములపొదిలో ప్రధాన అస్త్రం జస్ ప్రీత్ బుమ్రా అనడంలో ఏమాత్రం సందేహం లేదు. లీగ్ దశ నుంచి నాకౌట్ ఫైనల్స్ వరకూ ఆడిన మొత్తం 16 మ్యాచ్ ల్లో బుమ్రా 19 వికెట్లతో పాటు…. 6.63 ఎకానమీ నమోదు చేశాడు. పైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.

ఆఖరి బాల్ తో హీరో మలింగ….

ముంబై ఇండియన్స్ వెటరన్ ఫాస్ట్ బౌలర్ లాసిత్ మలింగ…. ధారాళంగా పరుగులిచ్చినా…. ఫైనల్స్ ఆఖరి ఓవర్ ఆఖరి బంతితో మ్యాజిక్ చేశాడు.

ఆఖరి బాల్ ద్వారా 2 పరుగులు చేయాల్సిన చెన్నైని యార్కర్ తో చావుదెబ్బ కొట్టాడు. శార్థూల్ ఠాకూర్ ను అవుట్ చేయడం ద్వారా ముంబైకి నాలుగో టైటిల్ అందించాడు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనిపించుకొన్నాడు.

స్పిన్ జాదూ రాహుల్ చాహర్….

లీగ్ దశ నుంచి ఫైనల్స్ వరకూ నిలకడగా రాణిస్తూ వచ్చిన యువలెగ్ స్పిన్నర్ రాహుల్ చాహర్ గురించి ఎంత చెప్పుకొన్నా అది తక్కువే అవుతుంది.

కోటీ 90లక్షల రూపాయల వేలంధరకు ముంబై జట్టులో చేరిన రాహుల్ ప్రస్తుత సీజన్లో ఆడిన 13 మ్యాచ్ ల్లో 13 వికెట్లు పడగొట్టాడు. అంతేకాదు… అత్యంత పొదుపుగా బౌల్ చేసి… 6.55 ఎకానమీ నమోదు చేశాడు.

ఫైనల్లో రాహుల్ అసాధారణంగా రాణించాడు. తన కోటా 4 ఓవర్లలో 13 డాట్ బాల్స్ తో సహా 14 పరుగులు మాత్రమే ఇచ్చి… ఓ వికెట్ పడగొట్టాడు.

మొత్తం మీద ఇటు సీనియర్లు… అటు జూనియర్ ఆటగాళ్ల సమష్టి కృషితో ముంబై ఇండియన్స్…. రికార్డు స్థాయిలో నాలుగోసారి ఐపీఎల్ ట్రోఫీ అందుకోగలిగింది.

Tags:    
Advertisement

Similar News