చంద్రుని పైకి వెళ్లడానికి అమెరికా ఎందుకు తొందరపడుతోంది?

మరో మూడు నెలలు గడిస్తే చంద్రునిపై మానవుడు అడుపు పెట్టి 50 ఏండ్లు అవుతుంది. 1969 జులై 21న అమెరికాకు చెందిన నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ తన ఎడమ పాదాన్ని తొలి సారిగా చంద్రునిపై మోపాడు. అపొలో 11 అనే పేరుతో నాసా చేసిన ఈ ప్రయోగం ఒక చారిత్రాత్మక అంశం. ఆ తర్వాత ఈనాటి వరకు మరే దేశమూ ఇలాంటి ప్రయోగం చేయలేదు. మరోసారి మానవుడు చంద్రునిపై అడుగుపెట్టలేదు. కాని మళ్లీ అదే అమెరికా చంద్రునిపైకి వెళ్లాలని […]

Advertisement
Update:2019-04-01 02:08 IST

మరో మూడు నెలలు గడిస్తే చంద్రునిపై మానవుడు అడుపు పెట్టి 50 ఏండ్లు అవుతుంది. 1969 జులై 21న అమెరికాకు చెందిన నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ తన ఎడమ పాదాన్ని తొలి సారిగా చంద్రునిపై మోపాడు. అపొలో 11 అనే పేరుతో నాసా చేసిన ఈ ప్రయోగం ఒక చారిత్రాత్మక అంశం. ఆ తర్వాత ఈనాటి వరకు మరే దేశమూ ఇలాంటి ప్రయోగం చేయలేదు. మరోసారి మానవుడు చంద్రునిపై అడుగుపెట్టలేదు. కాని మళ్లీ అదే అమెరికా చంద్రునిపైకి వెళ్లాలని తహతహలాడుతోంది.

ఐదు దశాబ్దాల పూర్వం కంటే టెక్నాలజీ ఎంతో పెరిగింది. అయినా చంద్రునిపైకి దిగాలంటే నాసాకు కూడా మరి కొంత కాలం పట్టేలా ఉంది. అందుకే 2028 నాటికి మరో సారి మానవుడిని అక్కడికి పంపాలని నిశ్చయించింది. కాని, అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ మాత్రం నాసాకి టార్గెట్ పెట్టాడు. 2028 కాదు 2024 కల్లా చంద్రునిపైకి వ్యోమగాములను పంపాలని కొత్త లక్ష్యాన్ని విధించాడు. దీంతో ప్రపంచ దేశాలు.. అమెరికా మళ్లీ ఎందుకు ఈ యాత్ర చేపడుతోందనే కొత్త అనుమానాలు మొదలయ్యాయి.

అమెరికా చంద్రుని యాత్రకు ఒక కారణం ఉంది. భవిష్యత్‌లో అమెరికా అంగారకుని పైకి మానవ సహిత యాత్రను చేపట్టాలనే ప్రణాళికలో ఉంది. దీనికి చంద్రుడిని బేస్ స్టేషన్‌గా ఉపయోగించుకోవాలని అనుకుంటోంది. అక్కడ ఒక ల్యాబ్ నిర్మించి.. రాబోయే కాలంలో మార్స్ రాకపోకలకు దాన్ని ఒక విరామ కేంద్రంగా ఉపయోగించుకోవాలని అమెరికా భావిస్తోంది.

మరోవైపు నాసాకు పోటీగా అమెరికాలోనే పలు ప్రైవేట్ సంస్థలు అంతరిక్ష ప్రయోగాలు చేపట్టాయి. ఇప్పటికీ నాసాదే ఆధిపత్యమైనా.. ప్రైవేట్ సంస్థలు ఈ రంగంలో దూసుకొని పోతున్నాయి. ముఖ్యంగా స్పేస్ ఎక్స్ సంస్థ రాకెట్ ప్రయోగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొని వచ్చింది. దీంతో పాటు అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్.. వర్జిన్ యజమాని రిచర్డ్ బ్రాన్సన్ కూడా స్పేస్ ఫ్లైట్ కంపెనీలను స్థాపించారు. వీళ్లు నాసాకు పోటీగా అంతరిక్ష ప్రయోగాలు చేపట్టే ఆలోచనలో ఉన్నారు.

చైనా ఇప్పటికే చంద్రునికి ఆవల ఉన్న ప్రదేశంపై తొలి సారిగా ఒక రోవర్‌ని దింపింది. ఇండియా కూడా అంతరిక్ష ప్రయోగాల్లో దూసుకొని పోతోంది. ఈ నేపథ్యంలో నాసా తన సామర్థ్యాన్ని మరో సారి నిరూపించుకోవాలనే ఆలోచనతో చంద్రునిపైకి మానవుడిని పంపాలనుకుంటోందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి నాసా ఆ దేశ ఉపాధ్యక్షుడి లక్ష్యాన్ని చేరుకుంటుందో లేదో చూడాల్సిందే.

Tags:    
Advertisement

Similar News