అభినందన్ ధైర్య సాహసాలను పొగుడుతూ.... పాక్ మీడియాలో కథనం
పాకిస్తాన్ యుద్ద విమానాలను వెంటాడుతూ పీవోకేలోకి వెళ్లి అక్కడ తన విమానం నుంచి ప్యారాచూట్ సహాయంతో కిందకు దిగి పాక్ ఆర్మీ చేతులో చిక్కిన అభినందన్ ధైర్య సాహసాలను పొగుడుతూ పాకిస్తాన్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఆ దేశంలోని ప్రముఖ పత్రిక ‘డాన్’ ఇవాల్డి ఎడిషన్ ఐదో పేజీలో ఈ వార్తను ప్రముఖంగా ప్రచురించింది. అజాద్ కశ్మీర్ (పీవోకేని పాకిస్తాన్ పిలిచే పేరు)లోని భింబర్ జిల్లా హోర్రా గ్రామానికి చెందిన మహ్మద్ రజాక్ చౌదరి అనే రాజకీయ, […]
పాకిస్తాన్ యుద్ద విమానాలను వెంటాడుతూ పీవోకేలోకి వెళ్లి అక్కడ తన విమానం నుంచి ప్యారాచూట్ సహాయంతో కిందకు దిగి పాక్ ఆర్మీ చేతులో చిక్కిన అభినందన్ ధైర్య సాహసాలను పొగుడుతూ పాకిస్తాన్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఆ దేశంలోని ప్రముఖ పత్రిక ‘డాన్’ ఇవాల్డి ఎడిషన్ ఐదో పేజీలో ఈ వార్తను ప్రముఖంగా ప్రచురించింది.
అజాద్ కశ్మీర్ (పీవోకేని పాకిస్తాన్ పిలిచే పేరు)లోని భింబర్ జిల్లా హోర్రా గ్రామానికి చెందిన మహ్మద్ రజాక్ చౌదరి అనే రాజకీయ, సామాజిక కార్యకర్త జరిగిన విషయం మొత్తాన్ని పాక్ మీడియాకు వెల్లడించాడు. ఒక విమానం మంటల్లో చిక్కుకోవడం.. కొద్ది సేపటికే ఒక వ్యక్తి ప్యారాచూట్ సహాయంతో కిలోమీటర్ అవతల దిగడం గమనించానని అతను చెప్పాడు. దీంతో గ్రామంలోని యువకులను అప్రమత్తం చేశానని అన్నాడు. కూలిన విమానం దగ్గరకు వెళ్లకండి.. కాని ఆ పైలెట్‌ను పట్టుకోమని చెప్పాడు.
దీంతో కొందరు యువకులు అభినందన్ వద్దకు చేరుకున్నారు. వాళ్లను చూసి ఇది ఇండియానా.. పాకిస్తానా అని యువకులను అడిగితే.. ఒక యువకుడు చాకచక్యంగా ఇది ఇండియానే అని బదులిచ్చాడు. దీంతో అభినందన్ భారత్ మాతాకూ జై అంటూ కొన్ని నినాదాలు చేశాడు. అంతే కాకుండా తన నడుముకు గాయం అయ్యింది.. దాహంగా ఉంది కొన్ని నీళ్లు ఇవ్వమని యువకులను కోరాడు. కాని భారత్ మాతాకు జై అనే నినాదంతో కోపోద్రిక్తులైన యువకులు అభినందన్‌ని రాళ్లతో దాడి చేయబోయారు.
యువకుల చర్యలను ముందే పసిగట్టిన అభినందన్ తన దగ్గర ఉన్న గన్ తీసి వారికి గురిపెట్టాడు. గాల్లోకి కాల్పులు జరుపుతూ ఒక అరకిలోమీటరు దూరం వెనకకు పరుగెత్తాడు. అప్పటికే గాయం కావడం.. అలసిపోయి ఉండటంతో పక్కనే ఉన్న నీటిలోకి దూకాడు.
తనను ఎలాగైనా పట్టుకుంటారని తెలిసి తన దగ్గర ఉన్న విలువైన డాక్యుమెంట్లు, మ్యాపులు నాశనం చేయడానికి ప్రయత్నించాడు. కొన్నింటిని నోటిలో పెట్టుకొని నమిలి మింగేశాడు. మరి కొన్నింటిని చించి నీటిలో వేశాడు. ఇంతలోనే అక్కడికి చేరుకున్న యువకులు రాళ్లతో దాడి చేయడానికి ప్రయత్నించారు. అయినా ధైర్యంగా ఎదుర్కున్నాడు. కాని ఒక యువకుడు కాలిపై గాయం చేయడంతో కిందపడిపోయాడు. దాంతో యువకులు అతడిని చుట్టుముట్టి దాడి చేశారు.
ఇంతలో పాక్ ఆర్మీ అక్కడకు చేరుకొని అభినందన్‌ను అదుపులోనికి తీసుకున్నారని.. అతడి ప్రాణానికి నష్టం వాటిల్లకుండా అక్కడి నుంచి రహస్య ప్రదేశానికి తరలించారని మహ్మద్ రజాక్ వివరించాడు.
శత్రువుల భూభాగంలో ఉండి కూడా ఎంతో తెగువ చూపించాడని పాక్ మీడియా పేర్కొంది. దీంతో అభినందన్ తెగువను ప్రతీ ఒక్కరు ప్రశంసిస్తున్నారు.