కవచం రివ్యూ

రివ్యూ: కవచం రేటింగ్: 1.75/5 తారాగణం: బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్, మెహ్రీన్, నీల్ నితీష్, పోసాని, సంగీతం: తమన్ కెమెరా: చోటా కె నాయుడు నిర్మాత: నవీన్ సోతినేని దర్శకత్వం: శ్రీనివాస్ మామిళ్ళ ఇప్పుడున్నతెలుగు హీరోల్లో మహా అదృష్టవంతుడు ఎవరు అంటే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పేరే చెప్పుకోవచ్చు. సక్సెస్ లేకపోయినా నాన్న సపోర్ట్ తో ఏదో రకంగా భారీ అవకాశాలను తెచ్చుకుంటూనే ఉన్న ఇతని కొత్త సినిమా కవచం ఈ రోజు ప్రేక్షకుల తీర్పు కోసం […]

Advertisement
Update:2018-12-07 11:24 IST

రివ్యూ: కవచం
రేటింగ్: 1.75/5
తారాగణం: బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్, మెహ్రీన్, నీల్ నితీష్, పోసాని,
సంగీతం: తమన్
కెమెరా: చోటా కె నాయుడు
నిర్మాత: నవీన్ సోతినేని
దర్శకత్వం: శ్రీనివాస్ మామిళ్ళ

ఇప్పుడున్నతెలుగు హీరోల్లో మహా అదృష్టవంతుడు ఎవరు అంటే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పేరే చెప్పుకోవచ్చు. సక్సెస్ లేకపోయినా నాన్న సపోర్ట్ తో ఏదో రకంగా భారీ అవకాశాలను తెచ్చుకుంటూనే ఉన్న ఇతని కొత్త సినిమా కవచం ఈ రోజు ప్రేక్షకుల తీర్పు కోసం వచ్చింది. మరో మూడు సినిమాల పోటీ ఉన్నప్పటికీ అన్నింటిలో ఇదే కాస్త రిచ్ గా ఉండటంతో పాటు హీరోయిన్ల గ్లామర్ ప్లస్ పాయింట్ గా మారడంతో మాస్ దీని వైపు ఓ లుక్ వేసేలా చేసింది. మరి కవచం వాళ్ళ ఆశలను కాపాడిందా లేక ఎప్పటిలాగే బెల్లంబాబు సినిమాల బాపతులోకి కలిసిపోయిందా అనేది రివ్యూలో చూసి నిర్ణయించండి.

కోటీశ్వరురాలైన సంయుక్త(కాజల్ అగార్వల్)ఆస్తి మీద కన్నేస్తాడు బావ విక్రమాదిత్య(నీల్ నితీష్). అయితే కంపెనీ బాధ్యతలు చెప్పట్టడానికి ముందు ఉద్యోగం చేయాలన్న తలంపుతో సంయుక్త ఓ కాఫీ షాప్ లో చేరుతుంది. ఓ సందర్భంలో ఎస్ఐ విజయ్(సాయి శ్రీనివాస్)తో పరిచయం ప్రేమగా మారుతుంది. అది వ్యక్తపరిచే లోపే ఇద్దరూ దూరమవుతారు. కానీ సంయుక్త పేరు కానీ తను మిలియనీర్ అన్న విషయం విజయ్ కు తెలిసుండదు. తర్వాత తాను ఓ ప్రమాదం బారి నుండి కాపాడిన పల్లవి(మెహ్రీన్)ని చూసి సంయుక్త అనుకుంటాడు విజయ్. తర్వాత ఓ పెద్ద చక్రవ్యూహంలో ఇరుక్కుని అందరిని ప్రమాదంలో పడేస్తాడు. తనను నమ్మిన అమ్మాయి కోసం విజయ్ ఇందులో నుంచి ఎలా బయటికి వచ్చాడు అనేదే కథ

సాయి శ్రీనివాస్ నటన ఎప్పటి లాగే ఉంది.ఎలాంటి మార్పు లేదు. నటుడిగా మెరుగవడం మానేసి ఇలా భారీ బడ్జెట్ ల మీద స్టార్ హీరోయిన్ల ఇమేజ్ మీద ఆధారపడినంత కాలం విజయం అందని ద్రాక్షపండులా ఉంటుంది. విజయ్ పాత్రకు ఇతను అంతగా సూట్ కాలేదు. పవర్ ఫుల్ డైలాగ్స్ చాలా ఉన్నాయి కానీ ఏదీ మాస్ కి కిక్కిచ్చేలా పలకలేకపోయాడు శ్రీనివాస్. ఇలాగే కొనసాగితే మాజీ లిస్ట్ లో చేరడం ఖాయం. డాన్సుల వరకు కొంత నయం. కాజల్ అగర్వాల్ క్యూట్ గా ఉంది. మెహ్రీన్ అసలు ఈ పాత్ర ఎందుకు ఒప్పుకుందో అర్థం కాదు. నీల్ నితీష్ విలనిజం అందరు బాలీవుడ్ విలన్లలాగే ఉంది. హరీష్ ఉత్తమన్ కొంత నయం. మహేష్ ఋషి, పోసాని, సత్యం రాజేష్ అందరివీ అరిగిపోయిన పాత చింతకాయ పచ్చడి పాత్రలే .

దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ళ కథ కన్నా ముందుగా ట్విస్టులు రాసుకున్నాడు. అందుకే ఇది మల్టీ ప్లెక్స్ లా ఉండాల్సింది పోయి రైతు బజార్ లా అనిపిస్తుంది. అసలు కథలోకి ప్రవేశించడానికే గంటకు పైగా తీసుకుని ఇంటర్వెల్ దాకా టైం వేస్ట్ చేసిన శ్రీనివాస్ సెకండ్ హాఫ్ హద్దులు దాటిన ట్విస్టులతో ఎంత ఓర్చుకున్నా విసుగు తెప్పిస్తాడు. పోనీ అవైనా థ్రిల్ ఇస్తాయా అంటే సగటు ప్రేక్షకుడు ఈజీగా గెస్ చేసే అవకాశం ఉన్నవే కావడంతో సినిమా ఎప్పుడు అయిపోతుందా అనే ఫీలింగ్ కలుగుతుంది. రెండవ‌ భాగం ఎంత ఫాస్ట్ గా సాగుతున్నా బోర్ కొట్టింది అంటే స్క్రీన్ ప్లే ఎంత తప్పుల తడకగా ఉందొ అర్థం చేసుకోవచ్చు. తమన్ పాటలు ఒక్కటంటే ఒక్కటీ యావరేజ్ గా కూడా లేవు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొంత నయం. చోటా కె నాయుడు కెమెరా ప్రతి రూపాయని తెరమీద చూపించింది. ఎడిటింగ్ లోపాలు చాలా ఉన్నాయి. అబ్బూరి రవి సంభాషణలు టీవీ సీరియల్ కు ఏ మాత్రం తీసిపోని రీతిలో సీరియస్ సీన్లలో పంచ్ డైలాగ్స్ కి నవ్వు తెప్పిస్తాయి. ఇలాంటి కథ మీద ఇంత ఖర్చు పెట్టిన నిర్మాత ధైర్యానికి హాట్స్ ఆఫ్

చివరిగా చెప్పాలంటే తాను చేసిన వెనుకటి సినిమాలు చాలా బెటర్ అని మన చేత చెప్పించేందుకే సాయి శ్రీనివాస్ చేసిన ప్రయత్నం కవచం. తన బాడీ లాంగ్వేజ్ కి సూట్ కానీ కథలతో, తన మార్కెట్ రేంజ్ కి మించిన బడ్జెట్ తో ఇతనితో ఇంకా సినిమాలు చేస్తున్న నిర్మాతల ధైర్యానికి హాట్స్ ఆఫ్ చెప్పడానికి తప్ప కవచంని మెచ్చుకోవడానికి ఒక్క పాయింట్ కనిపించదు. పోలీస్ ఆఫీసర్ కథ కాబట్టి అంకుశం నుంచి ధృవ దాకా వచ్చిన టాలీవుడ్ సినిమాలను గుర్తుచేసుకుని కవచంలోకి అడుగు పెడితే అది స్వంత రిస్క్ గానే భావించాలి

కవచం : ట్విస్టుల అయోమయం

Tags:    
Advertisement

Similar News