వరవరరావును విడుదల చేయాలని ప్రజాసంఘాల డిమాండ్‌

వరవరరావుకు ఎలాంటి సంబంధమూ లేని భీమా కొరేగావ్‌ కేసులో ఇరికించి, ఇప్పుడు అరెస్టు చేయడం అప్రజాస్వామికమని ప్రజా సంఘాలు విమర్శిస్తున్నాయి. మేధావి, రచయిత, విప్లవ కవి వరవరరావును, మరో నలుగురు సుప్రసిద్ధ సామాజిక కార్యకర్తలు సుధాభరద్వాజ్‌, గౌతమ్‌ నవలఖా, వెర్నన్‌ గొంజాల్వెజ్‌, అరుణ్‌ ఫెరేరాలను ప్రధాన మంత్రిని హత్య చేసేందుకు కుట్ర పన్నారన్న హాస్యాస్పద ఆరోపణలతో దుర్మార్గమైన ఊపా చట్టం కింద నిర్బంధించడం ఈ దేశ ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు అని, రచయితలు, పౌరహక్కుల కార్యకర్తల మీద ఇటువంటి […]

Advertisement
Update:2018-11-18 06:55 IST

వరవరరావుకు ఎలాంటి సంబంధమూ లేని భీమా కొరేగావ్‌ కేసులో ఇరికించి, ఇప్పుడు అరెస్టు చేయడం అప్రజాస్వామికమని ప్రజా సంఘాలు విమర్శిస్తున్నాయి.

మేధావి, రచయిత, విప్లవ కవి వరవరరావును, మరో నలుగురు సుప్రసిద్ధ సామాజిక కార్యకర్తలు సుధాభరద్వాజ్‌, గౌతమ్‌ నవలఖా, వెర్నన్‌ గొంజాల్వెజ్‌, అరుణ్‌ ఫెరేరాలను ప్రధాన మంత్రిని హత్య చేసేందుకు కుట్ర పన్నారన్న హాస్యాస్పద ఆరోపణలతో దుర్మార్గమైన ఊపా చట్టం కింద నిర్బంధించడం ఈ దేశ ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు అని, రచయితలు, పౌరహక్కుల కార్యకర్తల మీద ఇటువంటి ఆరోపణలు ప్రపంచంలోనే ఎవరూ చేసుండరని, ఆ ఘనత మన ఫాసిస్టు మోదీ ప్రభుత్వానికే దక్కిందని ప్రజాసంఘాలు మండిపడ్డాయి.

రెండున్నర నెలల గృహనిర్బంధం తర్వాత శనివారం నాడు పూణే జైలుకు కామ్రేడ్‌ వరవరరావును తరలించారు. 78 సంవత్సరాల వయసు, అనారోగ్యం ఉన్న వ్యక్తిని ఈ చలికాలం ఏ వసతుల్లేని కారాగారంలో పడేసేంతగా రాజ్యం ఎందుకు కక్ష గట్టింది? ఎన్ని కుట్ర ఆరోపణలు చేసినా కామ్రేడ్‌ వరవరరావు సుదీర్ఘ సామాజిక ఆచరణంతా బహిరంగమే. మూడున్నర దశాబ్దాల పాటు విద్యార్థులకు ప్రియమైన అధ్యాపకుడిగా, పాతికేళ్లకు పైగా తెలుగు సామాజిక సాహిత్య చరిత్రలో ప్రభావశీలంగా పనిచేసిన ఆధునిక సాహిత్య వేదిక ‘సృజన’ సంపాదకుడిగా, తెలుగు సాహిత్య సాంస్కృతిక మేధో రంగాలను మలుపు తిప్పిన విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపకుల్లో ఒకరిగా, ప్రజాఉద్యమ స్వరంగా వరవరరావు అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తిని ఇప్పుడు ఎందుకు నిర్భంధించాల్సి వచ్చిందని ప్రజాసంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

వరవరరావు చలినెగళ్లు, జీవనాడి, ఊరేగింపు, స్వేచ్ఛ, సముద్రం, భవిష్యత్‌ చిత్రపటం, ముక్తకంఠం, ఆ రోజులు, ఉన్నదేదో ఉన్నట్లు, మౌనం యుద్ధనేరం, అంతస్సూత్రం, బీజభూమి వంటి కవితా సంపుటాలు, పాటలు ఆయన రచించారు. తెలంగాణ విమోచనోద్యమం – తెలుగు నవల, కల్పనా సాహిత్యం-వస్తువివేచన, సాహిత్యంలో సమాజ చలనపు ప్రతిఫలనం వంటి సాహిత్య విమర్శ గ్రంధాలు, మరెన్నో సామాజిక రాజకీయ వ్యాసాలు రాశారు, అనువాదాలు చేశారు.

ఆయన సముద్రం దీర్ఘ కవితలోని ఒక భాగాన్ని డా. బి.ఆర్‌ అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం బి.ఎ విద్యార్థులకు ఆధునిక కవితా విభాగంలో పాఠ్యాంశంగా పెట్టారు. వరవరరావు రచనలు ఇంగ్లీషు, హిందీ, మలయాళం, కన్నడ, బెంగాలీ భాషల్లోకి కూడా అనువాదమయ్యాయి.

కవిగా, విమర్శకుడిగా, సామాజిక వ్యాఖ్యాతగా, వక్తగా, పౌరహక్కుల కార్యకర్తగా వివి తన శక్తినీ, మేధస్సునూ ప్రజల కోసమే వెచ్చిస్తున్నారని, ప్రభుత్వానికీ, నక్సలైట్‌ పార్టీలకు మధ్య రెండు సార్లు జరిగిన శాంతి చర్చల ప్రయత్నంలో ఆయన కృషి ఎంతగానో ఉందని, నిరంతరం ప్రజాజీవితంలో ఉంటూ తెలుగు సమాజాల్లోనే కాదు, ప్రపంచ ఏ మూల ఏం జరిగినా తన సునిశిత విప్లవ దృక్పథంతో విశ్లేషిస్తారని ఇంతటి సామాజిక జీవితం ఉన్న రచయితను దొంగ లేఖలు సృష్టించి ప్రధాని హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణ కింద అరెస్టు చేయడం కన్నా దిగజారుడుతనం మరొకటి ఉండదు అని ప్రజాసంఘాలు విమర్శించాయి.

Tags:    
Advertisement

Similar News