బాబుకు చివరికి మిగిలేది...?
ప్రధాని మోడిపై కత్తిగట్టిన ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్డీఏకు ప్రత్యామ్నాయాన్ని కాంగ్రెస్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో రూపుదిద్దేందుకు చేస్తున్న ప్రయత్నాలకు విస్తృతమైన ప్రచారం లభిస్తోంది. జాతీయ స్థాయి మీడియా సైతం ఆయనకు ఊహించిన దానికన్నా ఎక్కువగానే ప్రాధాన్యత ఇస్తోంది. ఎన్డీఏ నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ధర్మపోరాట దీక్ష పేరుతో బిజెపికి వ్యతిరేకంగా రాజకీయ పోరాటం సాగిస్తూ క్రమంగా పార్టీని కాంగ్రెస్‌వైపు వ్యూహాత్మకంగా నడిపించి చివరకు ఢిల్లీలో రాహుల్‌గాంధీని కలవటం ద్వారా […]
ప్రధాని మోడిపై కత్తిగట్టిన ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్డీఏకు ప్రత్యామ్నాయాన్ని కాంగ్రెస్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో రూపుదిద్దేందుకు చేస్తున్న ప్రయత్నాలకు విస్తృతమైన ప్రచారం లభిస్తోంది. జాతీయ స్థాయి మీడియా సైతం ఆయనకు ఊహించిన దానికన్నా ఎక్కువగానే ప్రాధాన్యత ఇస్తోంది.
ఎన్డీఏ నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ధర్మపోరాట దీక్ష పేరుతో బిజెపికి వ్యతిరేకంగా రాజకీయ పోరాటం సాగిస్తూ క్రమంగా పార్టీని కాంగ్రెస్‌వైపు వ్యూహాత్మకంగా నడిపించి చివరకు ఢిల్లీలో రాహుల్‌గాంధీని కలవటం ద్వారా ఆ పార్టీతో కలిసి పనిచేయాలని నిర్ణయించారు.
తెలుగు ఆత్మగౌరవం పేరుతో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మూడు దశాబ్దాల క్రితం ఏర్పాటైన తెలుగుదేశం చివరకు మళ్లీ ఆ పార్టీతోనే ఎన్నికల పొత్తుకు సిద్ధమైంది. ఇప్పటికే తెలంగాణలో మహాకూటమి ఏర్పాటైంది.
రానున్న 2019 లోక్‌సభ ఎన్నికలు, ఏపి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో తెలుగుదేశం పార్టీ పొత్తు అనివార్యమని చంద్రబాబు తేల్చిచెప్పేశారు. నిన్నమొన్నటి వరకు కాంగ్రెస్‌ను బద్ధ శత్రువుగా, 2014 రాష్ట్ర విభజన సమయంలో ఏపికి అన్యాయం జరగటం వెనుక కాంగ్రెస్సే కారణం అంటూ తీవ్రంగా దుయ్యబట్టిన ఆయన చివరకు ఊహించని విధంగా ఆ పార్టీతో కలిసి పనిచేయటానికి నిర్ణయించుకున్నారు.
కర్నాటకలో హంగ్ అసెంబ్లీ ఏర్పడడంతో కాంగ్రెస్ మద్దతుతో కుమారస్వామి (జనతాదళ్ (ఎస్)) ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకార కార్యక్రమానికి జాతీయ పార్టీలతోపాటు చంద్రబాబు నాయుడు కూడా హాజరైయ్యారు. అప్పటి నుంచి కాంగ్రెస్‌తో సన్నిహిత సంబంధాలు క్రమంగా పెంచుకుంటూ అందులో భాగంగానే బిజెపిపై ముఖ్యంగా మోడికి వ్యతిరేకంగా రాష్ట్రంలో రాజకీయ పోరాటం ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఆయన ఢిల్లీ, బెంగళూరు, చెన్నై నగరాలకు వెళ్లి అక్కడ బిజెపి వ్యతిరేక పక్షాలతో సమావేశాలు నిర్వహించి కాంగ్రెస్ ఆధ్వర్యంలో బిజెపి వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేసేందుకు పావులు కదిలించారు. తాజాగా కలకత్తాకు వెళ్లి మమతా బెనర్జీని కలవనున్నారు.
ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఆయన కలుస్తున్న నాయకులంతా ఇప్పటికే బిజెపి వ్యతిరేక కూటమిలో ఉన్నవారే. అయితే అందులో కొన్ని పార్టీలు కాంగ్రెస్‌తో నేరుగా కలిసి పనిచేసే విషయంలో స్పష్టత లేకపోయినప్పటికీ మోడి, బిజెపి వ్యతిరేక వర్గంలోనే ఉంటున్నాయి. చంద్రబాబు చేస్తున్న ప్రయత్నం వల్ల కొత్తగా కాంగ్రెస్‌కు జాతీయ స్థాయిలో కలిసివచ్చే నాయకులు, పార్టీలు కనిపించడం లేదు.
ఉదాహారణకు బెంగాల్, కేరళలో వామపక్షాలు ముఖ్యంగా సీపిఎం, సీపిఐ, ఉత్తరప్రదేశ్‌లో మాయావతి అదే విధంగా బీఎస్పీ ప్రభావం ఉన్న మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోనూ ఆ పార్టీలు కాంగ్రెస్‌తో కలిసి పనిచేసే సూచనలు కనిపించడం లేదు. మాయావతిని ఒప్పించే శక్తి సామర్థ్యాలు కూడా చంద్రబాబుకు లేవనే చెప్పాలి.
అలాగే బెంగాల్‌లో మమతాబెనర్జీ బలమైన శక్తిగా ఉన్నారు. అక్కడ ఆమెకు రాజకీయ ప్రత్యర్థులు కాంగ్రెస్, వామపక్షాలు. ఆమెను (తృణమూల్ కాంగ్రెస్) కాంగ్రెస్ వైపు తీసుకువచ్చే శక్తి సామర్థ్యాలు బాబుకు బొత్తిగా లేవు. ఇక ఢిల్లీలో అధికారంలో ఉండి హరియాణా, పంజాబ్‌లో అంతో ఇంతో ప్రభావం ఉన్న ఆప్ పార్టీని కూడా ఆయన కొత్తగా కాంగ్రెస్ కూటమిలోకి తీసుకువస్తున్న దాఖలాలు ఏమీ లేవు.
మొత్తానికి బిజెపికి, మోడికి వ్యతిరేకంగా బలమైన కూటమి ఏర్పాటు చేయాలనే ఆయన ప్రయత్నాలకు విపరీతమైన ప్రాధాన్యత మీడియాలో లభిస్తోంది. ఇందుకు కారణం తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటినుంచి రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా మీడియాతో నిర్వహించే మంచి సంబంధాలే కారణంగా చెప్పాలి. ఆయనంటే గిట్టనివారికన్నా అభిమానించే మీడియా మిత్రులే ఎక్కువ. రాజకీయ అంశాలకు అతీతంగా ఎక్కువ సంఖ్యలో మీడియాలో ఆయన అభిమానులు ఉన్నారంటే ఆయన పైస్థాయి (మీడియా) నిర్వాహణ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంతగా ఆయనకు ప్రచారం వస్తున్నా బిజెపి వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేసే విధంగా బలమైన అడుగులు వేస్తున్నారని జాతీయ మీడియా కొనియాడుతున్నా వాస్తవానికి ఆ విధమైన పటిష్ట కూటమి ఏర్పాటు అవుతున్న దాఖలాలు ఇప్పటికైతే కనిపించడం లేదు.
మరి ఈ విషయం చంద్రబాబుకు తెలియదా? అయినప్పటికీ ఆయన ఎందుకింత ఫలితంకన్నా ప్రచార ఆర్భాటానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎందుకంటే 2019లో ఆంధ్రప్రదేశ్ నుంచి అధిక సంఖ్యలో లోక్‌సభ స్థానాలు సాధించుకోవడంతో పాటు శాసనసభలో తిరిగి మెజార్టీ సభ్యులను గెలిపించుకుని అధికారంలోకి రావాలనేది ఆయన లక్ష్యం.
రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ స్వతంత్రంగా 1983,85,94 సంవత్సరాలలో అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత 1999,2004,09,14 ఎన్నికల్లో ఆయన ఏదో ఒక పార్టీతో అంటకాగి వారిఓట్లను కూడా తన వైపు తిప్పుకుని లాభపడ్డారు. అందులో భాగంగానే యునైటెడ్ ఫ్రంట్, ఎన్డీఏలతో పాటు వామపక్షాలను ఆయన ఉపయోగించుకున్నారు. 2014లో మోడి హవా, బిజెపి ఓట్లు అదేసమయంలో పవన్‌కళ్యాణ్ అండ కలిసివచ్చి స్వల్ప ఓట్ల ఆధిక్యతతో అధికారంలోకి వచ్చారు. తీరా ఇప్పుడు ఎన్డీఏకి దూరం అయ్యారు.
నిజానికి టిడిపి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ కావడంతో బిజెపితో పనిచేయడం కష్టం కాదు. విధాన పరంగా ఎటువంటి విభేదాలు లేవు. అయితే మోడి, అమిత్ షాలు చంద్రబాబుకు ప్రాధాన్యత ఇవ్వకపోగా పొగ బెట్టడం వల్లనే బయటకు వచ్చారు. ఈ పరిస్థితుల్లో దూరమైన ఓట్ల వల్ల అధికారం పోకుండా ఉండాలంటే ఎంతోకొంత కొత్తఓట్లను రాబట్టుకోగలగాలి. అందులో భాగంగా కనీసం 2శాతం కాంగ్రెస్ ఓట్లను టిడిపి ఖాతాల్లో వేయించుకోవాలనేది ఆయన లక్ష్యం.
అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో మోడి వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయి. వాటిని తనకు (టిడిపికి) అనుకూలంగా మలుచుకోవాలనేది ఆయన లక్ష్యం. ఈ కారణంతోనే కాంగ్రెస్‌తో చేతులు కలిపారే తప్ప విధానపరంగా బిజెపిని వ్యతిరేకించి కాదు. మోడిని తప్పిస్తే ఆయన మళ్లి బిజెపి పంచన చేరే అవకాశం లేకపోలేదు. ఇక తాను జాతి, దేశ ప్రయోజనాల దృష్ట్యా కాంగ్రెస్‌తో చేతులు కలిపానంటూ….ఇందుకు మోడి దేశంలోని వ్యవస్థలను, రాజ్యాంగ సంస్థలను నాశనం చేస్తుండడమే కారణమని సమర్థించుకునే సూత్రీకరణ ముందుకు తెచ్చారు.
ఇదంతా కూడా ఏపిలో మోడి వ్యతిరేక ఓట్లను కాంగ్రెస్‌కు సంబంధించిన ఓట్లను తన ఖాతాలో వేయించుకుని 2019లో తిరిగి అధికారంలో రావాలనేది ఆయన లక్ష్యం. ఇది జరుగుతుందా లేదా అనేది కాలమే చెప్పాలి. చివరకు ఆయనకు అధికారం మళ్ళీ దక్కుతుందా లేక ప్రచార ఆర్భాటమే మిగులుతుందా అనేది వేచి చూడాలి.