మీడియా మొగల్‌కు మోకరిల్లని మొనగాడు

-రామ్ నాథ్ నార్పల వైఎస్ అంటే ఆరోగ్య శ్రీ, 108, ఉచిత విద్యుత్ వంటి అద్బుతమైన పథకాలు గుర్తుకొస్తాయి. పేదోడు కూడా కార్పొరేట్‌ ఆస్పత్రిలో అడుగు పెట్టగల ధైర్యాన్ని వైఎస్ ఇచ్చారు. అయితే ఒక ముఖ్యమంత్రిగా  ప్రజలకు ఏమి అవసరమో గమనించి పథకాలు ప్రవేశపెట్టడం ముఖ్యమంత్రి బాధ్యత.  వైఎస్‌ తన వ్యక్తిత్వం వల్ల కూడా పేదల కష్టాలు తీర్చేందుకే ఎక్కువగా తపించారు. ఈ పథకాల సంగతి కాసేపు పక్కనపెడితే ఆంధ్రప్రదేశ్లో చీకటి కోణాలే ఉషాకిరణాలుగా ఏమార్చి ప్రజలపైకి ప్రసరింప చేస్తున్న […]

Advertisement
Update:2016-07-08 05:41 IST

-రామ్ నాథ్ నార్పల

వైఎస్ అంటే ఆరోగ్య శ్రీ, 108, ఉచిత విద్యుత్ వంటి అద్బుతమైన పథకాలు గుర్తుకొస్తాయి. పేదోడు కూడా కార్పొరేట్‌ ఆస్పత్రిలో అడుగు పెట్టగల ధైర్యాన్ని వైఎస్ ఇచ్చారు. అయితే ఒక ముఖ్యమంత్రిగా ప్రజలకు ఏమి అవసరమో గమనించి పథకాలు ప్రవేశపెట్టడం ముఖ్యమంత్రి బాధ్యత. వైఎస్‌ తన వ్యక్తిత్వం వల్ల కూడా పేదల కష్టాలు తీర్చేందుకే ఎక్కువగా తపించారు. ఈ పథకాల సంగతి కాసేపు పక్కనపెడితే ఆంధ్రప్రదేశ్లో చీకటి కోణాలే ఉషాకిరణాలుగా ఏమార్చి ప్రజలపైకి ప్రసరింప చేస్తున్న ఏకపక్ష మీడియాకు ఎదురొడ్డి నిలబడ్డ వ్యక్తి మాత్రం వైఎస్ ఒక్కరే. తరతరాలుగా మీడియారంగంలో పాతుకుపోయిన ఏకపక్ష, పక్షపాత మీడియాను ఎదురించడంలో వైఎస్ చూపిన తెగువ అసాధారణమే.

ఒక పార్టీకి మాత్రమే మద్దతు పలుకుతూ తమ వారి ప్రయోజనాలే దేశం ప్రయోజనాలు అన్నట్టుగా హద్దులు లేని ఆంబోతుల్లా రంకేలేశాయి కొన్ని పత్రికలు. అందుకే కొందరి ప్రయోజనాలే అందరి ప్రయోజ‌నాలుగా కాలం గడిచింది. తమకు హద్దులేదన్న అహంతోనే రాష్ట్రంలోని ఒక ప్రాంతాన్ని రక్తానికి మరిగిన రాక్షసుల ఆవాసంగానూ, ఇంకో ప్రాంతాన్ని తినడం కూడా తెలియని అనాగరికుల రాజ్యంగా చిత్రీకరించి, భ్రమకలిగించి సగటు మనిషిని నమ్మించగలిగాయి సదరు పత్రికలు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అనేక మంది వచ్చినా, సదరు పత్రికలు తమ పార్టీకి వ్యతిరేకమని తెలిసినా తమ పూట గడిస్తే చాలు అన్నట్టుగా మీడియా మొగలాయులకు శిస్తు చెల్లించి మోకరిల్లి పాలన సాగించారు. కానీ…వైఎస్‌ మాత్రం అలా చేయలేదు. ప్రత్యర్థి మీడియాకు మోకరిల్లి బతకాల్సిన అవసరం తమకేంటని భావించారు. అందుకే బలమైన పక్షపాత మీడియాను నిరోధించడం కంటే మరో బలమైన ప్రత్యామ్నాయ వ్యవస్థ నిర్మించడమే సరైన మార్గమని బహుశా వైఎస్ భావించి ఉండవచ్చు.

సాక్షి మీడియాను స్థాపించడం ద్వారా తెలుగుప్రజలకు నాణేనికి రెండోవైపు చూసే అవకాశం వచ్చింది. ఇంతకాలం వన్నెతగ్గని బంగారంలా మెరిసిన వ్యక్తుల, సంస్థల, పార్టీల అసలు రూపాలను జనం దర్శించగలుగుతున్నారు. పత్రిక, టీవీ పెట్టేందుకు ఇంత డబ్బు ఎక్కడిది అని ప్రత్యర్థి మీడియా ప్రధాన ఆరోపణ. అయితే ఇక్కడే మరో ప్రశ్న కూడా ఎదురవుతుంది. పచ్చళ్లు అమ్ముకున్నవ్యక్తి పత్రిక పెట్టగలిగినప్పుడు, పాత సైకిల్ మీద తిరిగిన రిపోర్టర్ ఏకంగా తాను పనిచేసిన పత్రికను కొనగలిగినప్పుడు… కాలేజ్‌ రోజుల నుంచే ఇన్ కం టాక్స్ కడుతున్న వ్యక్తి పత్రికను స్థాపించడంలో ఆశ్చర్యం ఏముంది అన్నది వైఎస్ వర్గం నుంచి సమాధానం.

అప్పటి వరకు మీడియాలో సానుకూల వార్తలకు తమ పార్టీ, తాము అనర్హులమేమో అన్న భావనతోనే కాంగ్రెస్ శ్రేణులు కూడా బతికాయి. కానీ సాక్షి మీడియా వచ్చిన తర్వాత కాంగ్రెస్ శ్రేణులు కూడా ఎదురుదాడి చేసే అవకాశం చిక్కింది. కాంగ్రెస్ కావాలా లేక వైఎస్‌ కావాలా అంటే మొదట మాకు వైస్సే కావాలని కాంగ్రెస్ వీర అభిమానులు కూడా చెప్పే స్థాయికి పరిస్థితి వచ్చిందంటే… అందుకు అప్పటి వరకు టీడీపీ మీడియా ముందు తలదించుకుని తిరుగుతున్న కాంగ్రెస్‌ శ్రేణులకు ప్రత్యామ్నాయ మీడియాను వైఎస్‌ పరిచయం చేయడం కూడా ఒక కారణం.

ఒకప్పుడు రామోజీరావు గురించి వ్యతిరేకంగా మాట్లాడాలంటే నాయకులు, ప్రజలే కాదు మీడియా సంస్థలు కూడా వణికేవి. అందుకే ఆయన మీడియా మొగల్‌గా కీర్తించుకుంటూ తిరిగారు. కానీ ఈ రోజు రామోజీరావును సోషల్ మీడియా ద్వారా సామాన్యుడు కూడా ధైర్యంగా ప్రశ్నించగలగుతున్నారంటే … రామోజీకిపై వైఎస్‌ రూపంలో తొలిసారి జరిగిన ఎదురుదాడే కారణం. రామోజీపై వైఎస్ తిరగబడ్డ తర్వాతే మీడియా మెగల్‌కు వ్యతిరేకంగానూ, ఆయన వ్యక్తిగతం గురించి కూడా సమాజానికి తెలిసే అవకాశం వచ్చింది. అందుకే వైఎస్ చనిపోయిన కొద్ది రోజులకే సంప్రదాయాలను కూడా వదిలేసి ఆయనపై ఆ పత్రికలు రాయకూడని రాతలు రాస్తూ విషం చిమ్మాయి. ఇంకా చిమ్ముతూనే ఉన్నాయి.

గతంలో ఇదే వర్గం మీడియాతో ధర్మయుద్ధానికి దిగిన ”ఉదయం” లాంటి పత్రికలు ఏమయ్యాయో చరిత్రలో ఎలాగో లిఖించబడే ఉంది. ”ఉదయం” నోటిలో మద్యం పోసి హత్య చేసేశారు. వైఎస్ సీఎం కాకముందు అంతా ఏకపక్ష మీడియానే. కాబట్టి ఆ పక్షపాత మీడియా ఏంచేసిందో కూడా సాధారణజనానికి తెలిసే అవకాశం లేకుండాపోయింది. అందుకే భూతకాలంలో ఘోరాలు చేసినా కొందరు మీడియా పెద్దలు దర్జాగానే తిరుగుతున్నారు. అయినా సాక్షి తప్ప మిగిలిన అన్ని పత్రికలు,చానళ్లు చంద్రబాబుకు డబ్బా కొడుతాయా అన్న అనుమానం కొత్త జనరేషన్‌కు రావచ్చు. అలాంటివారికి ఇటీవల జరిగిన కాపు నేత ముద్రగడ దీక్షే సమాధానం చెబుతుంది.

రాష్ట్రంలో అతి పెద్ద సామాజికవర్గం అయినప్పటికీ చంద్రబాబు ఆదేశాల కారణంగా ముద్రగడ దీక్ష వార్తలను 12 రోజుల పాటు ఒక్క చానల్‌ కూడా ప్రసారం చేయలేదు. ఈ సంఘటన చాలు వైఎస్‌ రాష్ట్రానికి ప్రత్యామ్నాయ మీడియా ఉండలన్నా ఆలోచన చేయకముందు ఏపీలో మీడియా ఏవిధంగా గంతులేసిందో చెప్పేందుకు. సాక్షి జగన్‌కు వంతపాడుతూ ఉండవచ్చు. కానీ జగన్ తప్పు చేస్తే చూపించడానికి ఎలాగో రెండు ముఖ్యపత్రికలు, 15 టీవీ చానళ్లు కాచుకుని కూర్చున్నాయి. ఇప్పుడు సాక్షి రావడం వల్ల చంద్రబాబు అండ్‌ కంపెనీ ఏం చేస్తోందో కూడా జనానికి తెలిసే అవకాశం వచ్చింది. నాణానికి రెండు వైపులను ప్రజలు చూసే వీలైంది. అందుకు కారణం మాత్రం వైఎస్సే.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News