మొన్న వివస్త్రను చేసి కొట్టారు, నిన్న గర్భం కోల్పోయింది
వరంగల్ జిల్లా, వర్ధన్నపేటలో మహిళపై జరిగిన అమానుష దాడిలో మరో విషాదం చోటుచేసుకుంది. దాడికి గురైన అంగోతు అనిత గర్భవతి. విపరీతమైన దెబ్బలు, మానసిక క్షోభని అనుభవించడంతో ఆమె తన కడుపులోని శిశువుని కోల్పోయింది. అనితను వర్ధన్నపేట మండలం డీసీ తండాకు చెందిన బానోతు రవి రెండో వివాహం చేసుకున్నాడు. దాంతో ఆగ్రహించిన అతని మొదటి భార్య, ఆమె తరపు బంధువులు గత సోమవారం ఆమెను వివస్త్రను చేసి, గ్రామంలో ఊరేగించి కర్రలతో కొట్టి, ఇనుప చువ్వలతో […]
వరంగల్ జిల్లా, వర్ధన్నపేటలో మహిళపై జరిగిన అమానుష దాడిలో మరో విషాదం చోటుచేసుకుంది. దాడికి గురైన అంగోతు అనిత గర్భవతి. విపరీతమైన దెబ్బలు, మానసిక క్షోభని అనుభవించడంతో ఆమె తన కడుపులోని శిశువుని కోల్పోయింది. అనితను వర్ధన్నపేట మండలం డీసీ తండాకు చెందిన బానోతు రవి రెండో వివాహం చేసుకున్నాడు. దాంతో ఆగ్రహించిన అతని మొదటి భార్య, ఆమె తరపు బంధువులు గత సోమవారం ఆమెను వివస్త్రను చేసి, గ్రామంలో ఊరేగించి కర్రలతో కొట్టి, ఇనుప చువ్వలతో కాల్చి చిత్రహింసలకు గురిచేశారు. అనితను ఆసుప్రతిలో చేర్చగా మంగళవారం ఆమె తీవ్రమైన కడుపునొప్పితో బాధపడింది. గర్భంలోని శిశువు మృతి చెందడంతో డాక్టర్లు ఆమెకు అబార్షన్ చేశారు.
అనితను గ్రామస్తులు అందరిముందే అవమానించారు, అమానుషంగా హింసించారు. అడ్డువచ్చిన గ్రామస్తులను కొట్టేందుకు దుండగులు ప్రయత్నించారని గ్రామస్తులు పోలీసుల విచారణలో చెప్పారు..
అనితపై దాడిచేసినవారిలో మహిళలే ఎక్కువగా ఉండటం మరొక దారుణం. ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అనితను కలెక్టర్ వాకాటి కరుణ, పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు పరామర్శించారు. అనితకు, ఆమె కుటుంబసభ్యులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. నిరక్షరాస్యత, అజ్ఞానం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందని, తండాను తాము దత్తత తీసుకుంటున్నట్లుగా సీపీ సుధీర్ బాబు ప్రకటించారు. గర్భిణి అని కూడా చూడకుండా అనితని అంతగా హింసిస్తుంటే ఎందుకు ఊరుకున్నారు అంటూ తండావాసులను ఆయన మందలించారు. తండాలో ఇక ముందు ఇలాంటి అమానుష సంఘటనలు జరగకుండా మార్పు తెస్తామన్నారు. తండాలో ఎవరైనా అనుచితంగా, అమానుషంగా ప్రవర్తిస్తే ఆ విషయాన్ని వెంటనే పోలీసులకు అందించేలా చైతన్యం తెస్తామన్నారు. తండాపై ఇకనుండి పోలీసు పర్యవేక్షణ ఉంటుందని సుధీర్‌బాబు తెలిపారు.