శ్రమైక సౌందర్యమూర్తులు ఆచార్య పట్నాయక్‌ శిల్ప- చిత్రాలు

”నా వయస్సు 82 సంవత్సరాలు, కాదు, కాదు 28” అంటూ నవ్వుతూ చెబుతారు చౌదరీ సత్యన్నారాయణ పట్నాయక్‌. గుంటూరు విద్యానగరంలో ఒక రాత్రి 9గంటల వేళ ఆయన తన ఇంటి ముందు నిర్మించుకున్న పర్ణశాలలో కొన్ని శిల్పాలకు తుది మెరుగులు దిద్దుతూ కనిపించారు. వయస్సు శరీరానికే తప్ప మనస్సుకు కాదని, వయస్సు ముందుకు వెడుతుంది, కానీ మనస్సు అక్కడే (28లో) ఆగిపోయిందంటారాయన. సృజనాత్మకమైన లోహపు కళాకృతులకు ఆయన పెట్టింది పేరు. ఆయన శిల్పాలలో సహజత్వం, నైరూప్యం రెండూ […]

Advertisement
Update:2015-09-27 02:30 IST
ఆచార్య పట్నాయక్‌

”నా వయస్సు 82 సంవత్సరాలు, కాదు, కాదు 28” అంటూ నవ్వుతూ చెబుతారు చౌదరీ సత్యన్నారాయణ పట్నాయక్‌. గుంటూరు విద్యానగరంలో ఒక రాత్రి 9గంటల వేళ ఆయన తన ఇంటి ముందు నిర్మించుకున్న పర్ణశాలలో కొన్ని శిల్పాలకు తుది మెరుగులు దిద్దుతూ కనిపించారు. వయస్సు శరీరానికే తప్ప మనస్సుకు కాదని, వయస్సు ముందుకు వెడుతుంది, కానీ మనస్సు అక్కడే (28లో) ఆగిపోయిందంటారాయన.

సృజనాత్మకమైన లోహపు కళాకృతులకు ఆయన పెట్టింది పేరు. ఆయన శిల్పాలలో సహజత్వం, నైరూప్యం రెండూ కలిసి ఒకటిగా మిథునావస్థకు చేరుకుంది. ప్రాచీనులలో నవీనుడు, నవీనులలో ప్రాచీనుడు అనేమాట ఆయనకు అక్షరాలా వర్తిస్తుంది. దానికి కారణం ఆయన మద్రాసు లలితకళాశాలలో భిన్న ధృవాలుగా పేరొందిన (రాయ్‌చౌదరి, పణిక్కర్‌లు) ఇద్దరు అఖండ ప్రజ్ఞావంతుల వద్ద శిక్షణ పొందటమే. గుంటూరు పట్టణం నడిబొడ్డున ఆయన నివసిస్తున్నా ఆయన గురించి మన రాష్ట్రప్రజల కంటే ఇతర రాష్ట్రాల వారికి తెలిసిందే ఎక్కువ. కొంత కాలం క్రితం హైదరాబాద్‌ కళాభవన్‌లో ఆయన ప్రదర్శన జరిగినపుడు, ఒకటీ అరా తప్ప ఆయన శిల్పాలేవీ అమ్ముడు కాలేదు. కొన్ని రోజుల తరువాత అదే ప్రదర్శనను ఢిల్లీ, బొంబాయిలలో జరిపినపుడు అక్కడి గ్యాలరీల వాళ్ళు ఆయన శిల్పాలలో ఒకటీ అరా మినహా ఏమీ మిగల్చకుండా పోటీపడి ఎగరేసుకుపోయారు.
గుంటూరులోని పర్ణశాల లాంటి తన ఇంటి మొదటి అంతస్తులో, తూర్పు కళింగ ప్రాంతపు, జానపద సోయగాలు, అరవిచ్చుకున్న నెమలిపింఛంలా విహరిస్తాయి. అక్కడ తాను సృష్టించి రూపుదిద్దిన ఆయన మానస సంతానం గౌరమ్మ, అప్పడు, లచ్చి, తవటయ్య లాంటి అనేక మూర్తులను అక్కడ ఆయన మనకు పరిచయం చేస్తారు. ఒకటికి పదిసార్లు చూడాలనిపించే శ్రమైక మూర్తులవి. అన్నీ లోహపు శిల్పాలే. ఇవన్నీ పోతబోసినట్లుగా ఒకే రంగులో కాకుండా ఒకటి రాగివర్ణంతో, ఉంటే ఒకటి పచ్చటి పసుపులో, మరొకటి నలుపు, ఒకటి సగం రాగి సగం నలుపు ఇలా అనేక వర్ణాలలో మన కంటికింపు కలిగిస్తాయి. ఇవన్నీ ఆయన చేసిన సుదీర్ఘ ప్రయోగ ఫలితాలు, అయితే దేనినీ ఆయన వ్యాపార రహస్యంగా దాచుకోరు. మనం అడిగితే ఆచార్య పట్నాయక్‌ మరుక్షణంలో కెమిస్ట్రీీ ప్రొఫెసర్‌ అయిపోతాడు. రకరకాల ఆమ్లాలు, రసాయనాలు ఎన్నోపేర్లు మనం గుర్తుంచుకోలేనన్ని వివరాలు ఎంతో ఓపికగా చెబుతారు.

పట్నాయక్‌ 1925, డిసంబరు 6న శ్రీకాకుళం జిల్లాలోని బాదం అనే పల్లెలో జన్మించారు. తండ్రి ఆ ఊరికి కరణం. చిన్నతనంలో చదువు సజావుగా సాగలేదు. దానికి కారణం గాంధీ ఉద్భోదలతో ఆయనలో జనించిన జాతీయ భావాలే, అయినా తండ్రి మాట కాదనలేక వంశపారంపర్యంగా వస్తున్న కరణం ఉద్యోగాన్ని 1943 లో స్వీకరించారు. 1945 వ సం||లో 11 సంవత్సరాల వయస్సు గల శ్యామలతో వివాహమయింది. ఉద్యోగంపై ఏ విధమైన శ్రద్ధా పెట్టలేకపోయారు. చిన్నతనం నుండి చిత్రకళపై మక్కువ వుండటంతో ఉద్యోగం వదలి శ్రీకాకుళంలో చిత్రకారునిగా, ఛాయాగ్రాహకునిగా పేరొందిన నరసింహం అనేవ్యక్తి వద్ద శిష్యునిగా చేరి ఆ కళలలో ప్రవేశం పొందారు. 1947వ సంవత్సరంలో మద్రాసు ప్రభుత్వం నిర్వహించే డ్రాయింగ్‌ హైయర్‌ గ్రేడ్‌ పరీక్షలో ఉత్తీర్ణత పొంది 1950 వ సంవత్సరంలో ప్రభుత్వ ఆర్ట్స్‌ అండ్‌ క్రాఫ్ట్స్‌ స్కూలులో నేరుగా రెండవ సంవత్సరంలోకి ప్రవేశార్హత పొందారు. చిత్ర శిల్ప కళలలో ప్రాతఃస్మరణీయులైన దేవీప్రసాద్‌ రాయ్‌ చౌదరీ అప్పుడు ప్రిన్సిపాల్‌. కె.సి.ఎస్‌.పణిక్కర్‌, ధనపాల్‌, హోతా రాంగోపాల్‌, లాంటి నిష్ణాతుల వద్ద శిక్షణ తీసుకున్నారు. విద్యార్థి దశలో వుండగా రూబెన్స్‌, రింబ్రాండ్‌ లాంటి క్లాసికల్‌ చిత్రకారులు, సెజాన్‌, వాన్‌గో లాంటి ఆధునిక చిత్రకారుల ప్రభావం ఆయనపై పడింది. వారితో పాటు గురువైన పణిక్కర్‌ ప్రభావం తనపై చాలా వుందని ఆయన అంటారు. 1955వ సం|| లో విద్యార్ధిగా చివరి సంవత్సరంలో వుండగానే ఆయన వేసిన చిత్రాల ప్రదర్శన జరిగింది. అందులో ఆయన వేసిన ‘కార్పొరేషన్‌ బ్యాంక్‌’ అన్న చిత్రాన్ని మద్రాసు ప్రభుత్వ మ్యూజియం కొనుగోలు చేయటం ఆయన ఆత్మవిశ్వాసాన్ని బలపరచింది. దానితో తాను కళాకారునిగా నిలదొక్కుకోగలననే ధైర్యం ఏర్పడింది. విద్యార్థి దశలో చివరి రెండు సంవత్సరాలలో ఆయన అభిరుచి శిల్పకళపై మళ్ళింది. శిల్పాచార్యుడైన మొదలియార్‌ వద్ద శిల్పానికి సంబంధించిన ప్రాథమిక శిక్షణను తీసుకుని త్వరలోనే శిల్పిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. రాయ్‌ప్రసాద్‌ చౌదరి స్టుడియోలో శిల్పాలు చెక్కుతున్నపుడు ఆయనకు సహాయకారిగా పనిచేసే అదృష్టం లభించిన అతికొద్ది మందిలో పట్నాయక్‌ ఒకరు. చిత్రకారునిగా, శిల్పిగా బహుముఖ ప్రజ్ఞాపాటవం కలిగిన పట్నాయక్‌ 1955 వ సం||లో అలవోకగా మొదటి తరగతిలో ఉత్తీర్ణులైనారు. కొంత కాలం పాటు తన బంధువైన వి.ఎ. పట్నాయక్‌ ప్రోత్సాహంతో ఆయన ఇంటి వద్దనే వుంటూ ఫ్రీలాన్స్‌ చిత్రకారునిగా కాలం గడిపారు.

ఆయనకు 1955 వ సం||లో రాయ్‌చౌదరి ప్రోద్బలంతో, పణిక్కర్‌ ప్రోత్సాహంతో పశ్చిమగోదావరి జిల్లా, పెంటపాడులోని పోష్టు గ్రాడ్యుయేట్‌ బేసిక్‌ ట్రైనింగ్‌ కాలేజీలో ఆర్ట్‌ టీచర్‌గా ఉద్యోగం లభించింది. ఇది తన జీవితాన్ని మలుపు తిప్పిన ఒక అరుదైన సంఘటనగా పట్నాయక్‌ భావిస్తారు. అక్కడ విద్యార్ధులందరికీ చదువులో భాగంగా శ్రమైక జీవనాన్ని బోధిస్తారు. నూలు వడకడం, చేనేత లాంటి వాటిలో కూడా శిక్షణ ఇవ్వబడతాయి. అక్కడ వుండగానే జాతీయ భావాలకనుగుణంగా అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఖద్దరు ధోతీ, కుర్తా ధరించటం అలవాటయింది. సెలవు దినాల్లో విద్యార్ధులను ప్రక్కనే వున్న పల్లెకు తీసుకొని వెళ్ళి అక్కడ పల్లె జీవన విధానాన్ని పరిశీలించటం అనే అంశం ఒకటి వుండేది. అక్కడకు వెళ్ళినపుడు ఆ పల్లెటూరి ప్రజల ముఖకవళికలను పరిశీలించి కొన్ని స్కెచ్‌లు వేసి తెచ్చుకొని వాటి నుంచి చిత్రాలు, శిల్పాలు తయారు చేసుకునేవారు.

1962 వ సం||లో ప్రభుత్వం నిర్వహించే ఆ ట్రైనింగ్‌ కాలేజీ మూసివేశారు. అప్పటి ఉస్మానియా యూనివర్శిటీ ప్రిన్సిపాల్‌ అయిన డాక్టర్‌.డి.ఎస్‌.రెడ్డి, జాయింట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఇన్‌స్ట్రక్షన్స్‌ ఎల్‌.బుల్లెయ్య సహకారంతో గుంటూరులోని మహిళా కళాలలో శిల్పకళా విభాగానికి లెక్చరర్‌గా నియమించబడ్డారు. అప్పటి నుంచి గుంటూరును ఆయన తన స్వస్థలంగా మార్చుకున్నారు.

1975 వ సం|| లో యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ వారి ఆధ్వర్యంలో లోహపు శిల్పాలపై టెర్రకోటా ప్రభావం అనే అంశంపై పరిశోధనలు సాగించారు. ఈ పరిశోధనలో భాగంగా మొహంజోదారో, మౌర్య, శుంగ, కుషాన్‌ శిల్ప రీతులను పరిశీలించడానికి ఉత్తర భారతమంతా ప్రయాణించారు. మార్గ మధ్యంలో చిష్నాపూర్‌లోని డోగ్రా శిల్పాలు తయారు చేసే విధానాన్ని క్షుణ్ణంగా తెలుసుకున్నారు. అంతకు పూర్వమే రాయ్‌చౌదరి యొక్క ‘జాతీయ వీరుల సంస్మరణార్థం’ తయారు చేసిన శిల్పంలో ధనపాల్‌ శిల్పించిన ‘శ్రీపెరియార్‌’ శిల్ప నిర్మాణంలోనూ ఆయన సహాయకారిగా పనిచేసి ఉండటంతో సేండ్‌ కాస్టింగ్‌ (Sand Casting) బాక్స్‌ మోల్డ్‌ ప్రొసెస్‌ (Box Mould Process) అనే రెండు భిన్న ప్రక్రియలలో అనేక ప్రయోగాలు చేసి విజయం సాధించారు. లోహపు శిల్పాలపై ఇంతలా ప్రయోగాలు చేసిన వారు ఆంధ్ర దేశంలోనే కాదు, భారత దేశంలోనే మరొకరు లేరు. 1977 వ సం|| నుంచి 1982 వ సం|| వరకూ ఆంధ్రప్రదేశ్‌ లలితకళా విభాగానికి ఉప అధ్యక్షునిగా నియమితులైనారు. అప్పుడు ఆయన మిత్రుడు ప్రఖ్యాత శిల్పి, చిత్రకారుడూ అయిన పి.టి.రెడ్డి కార్యదర్శిగా వున్నారు. వీరిద్దరూ కలసి ఎన్నో సృజనాత్మకమైన సలహాలను ప్రభుత్వానికి అందజేసారు. ప్రఖ్యాతి వహించిన ముల్క్‌రాజ్‌ ఆనంద్‌, హెబ్బార్‌, బెంద్రే, జ్యోతి భట్‌, రాఘవ కనేరియా, ఎ.ఎస్‌. రామన్‌ లాంటి దిగ్గజాలెందరో గుంటూరు వస్తే వారు ఆయన పర్ణశాలను దర్శించకుండా వెళ్లరు. దేశంలో ఎన్నో కళా ప్రదర్శనలకాయన న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. ప్రభుత్వం ప్రభుత్వేతర సంఘాల నుండే కాక దేశ విదేశాలలో లెక్కకు మించి సన్మానాలను పొందారు. ఆయన శిల్పాలు మన దేశంలోని అనేక ముఖ్య పట్టణాలతో పాటు, జపాన్‌, ఫ్రాన్స్‌, ఇంగ్లండ్‌, అమెరికా దేశాలలో కూడా అమ్ముడు పోయాయి (ప్రైవేట్‌ కలక్షన్‌లుగా). పట్నాయక్‌, శ్యామల దంపతులకు నటరాజ్‌, విద్యాభూషణ్‌, శాంతి స్వరూప్‌, రవి శంకర్‌ అనే కుమారులున్నారు. ఇందులో రవిశంకర్‌ విశాఖపట్టణంలోని ఆంధ్రా యూనివర్శిటీ ఫౖౖెన్‌ ఆర్ట్స్‌ విభాగానికి డీన్‌గా పనిచేస్తున్నారు. ఆయన తండ్రిలానే మంచి శిల్పి, ఆయన శ్రీమతి సంధ్య మంచి చిత్రకారిణి.
పట్నాయక్‌ మొదట్లో చాలా చిత్రాలు వేశారు. కాని శిల్పంపైనున్న మక్కువతో చిత్రకళను ద్వితీయ స్థానానికి నెట్టివేశారు. ఆయన చిత్రాలలో మరీ ముఖ్యంగా పాలెట్‌ నైఫ్‌ (Palette Knife) తో వేసిన చిత్రాలు ఎంతో మనోరంజకంగా వుంటాయి. వాటిని తాకి చూసినపుడు అవి చిత్రాలా, శిల్పాలా లేక చిత్రశిల్పాలా, శిల్పచిత్రాలా అనే భ్రమకి లోనుచేస్తాయి. ఎంతో కష్టసాధ్యమైన ఈ ప్రక్రియలో ఆయన అందెవేసిన చేయి. ‘ప్రతిశిల్పాన్ని రూపు దిద్దుతున్నపుడు, నేనొక ఆచార్యుణ్ణన్న సంగతి మర్చిపోతాను. రూపు దిద్దుతున్న ఆ ప్రక్రియలో అవి నాకు పాఠాలు నేర్పుతాయి. ఆ సమయంలో నేనొక విద్యార్ధినయిపోతా’నంటారు పట్నాయక్‌.

ఆయన శిల్పాలలో శ్రమజీవుల శిల్పాలే అధికం.నిత్యం చెమటోడుతూ సరియైన పోషణలేక శుష్కించిన శరీరాలతో, పీక్కుపోయిన ముఖాలు అయినప్పటికి తృప్తే ఆస్తిగా జీవిస్తున్న వారి శ్రమైక సౌందర్యాన్ని కన్నుల విందుగా శిల్పించటంలో పట్నాయక్‌ ఘనాపాఠి. వాటి పెదవుల కొసల్లో ఆనంద రేఖలే తప్ప విషాద రాగాలు కనిపించని శిల్పాలలానే పట్నాయక్‌ ఎప్పుడూ నవ్వుతూనే కనిపిస్తారు.

(సప్తపర్ణి నుంచి)

– కాండ్రేగుల నాగేశ్వరరావు

Tags:    
Advertisement

Similar News