అక్షర తూణీరం చో రామస్వామి
కొంత మంది ఒకే పని చేసి అందులో ప్రావీణ్యం సంపాదించి ప్రసిద్ధులవుతారు. మరి కొందరు అనేక రకాల పనులు చేసి తమకు వైవిధ్యం ఉందని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తారు. భిన్నమైన అనేక పనులు చేయడానికి బదులు చేసిన పనినే భిన్నంగా చేయడం మరో పద్ధతి. చో రామ స్వామి భిన్నమైన పనులు చేసినా, విభిన్నమైన వృత్తులలో కొనసాగినా తమిళనాడు సరిహద్దులు దాటి జనానికి పరిచితమైన వ్యక్తి. ఆయన వ్యవహార సరళి ఎప్పుడూ భిన్నంగా ఉంటుంది. 1934 అక్టోబర్ 5న […]
చో రామ స్వామి భిన్నమైన పనులు చేసినా, విభిన్నమైన వృత్తులలో కొనసాగినా తమిళనాడు సరిహద్దులు దాటి జనానికి పరిచితమైన వ్యక్తి. ఆయన వ్యవహార సరళి ఎప్పుడూ భిన్నంగా ఉంటుంది. 1934 అక్టోబర్ 5న జన్మించిన చో మొదట న్యాయవాది, ఆ తర్వాత నాటక రచయిత, ఆ తర్వాత పత్రికా రచయిత, ఆనక రంగస్థల నటుడు, ఆ తర్వాత సినిమా నటుడు, సినిమా స్క్రిప్టు రచయిత. కాని ఆయన “తుగ్లక్” పత్రిక సంపాదకుడిగానే ఎక్కువ ప్రసిద్ధుడు. తుగ్లక్ అన్న పేరును ఆయన రాజకీయ వ్యంగ్యాస్త్రంగానే ఉపయోగించినా ఆయనకు ఆ మాటతో విడదీయరాని బంధం ఏర్పడింది. రాజకీయాలను అధిక్షేపించడానికి చో రామస్వామి రాసిన మహమ్మద్ బిన్ తుగ్లక్ నాటకాన్ని 1968లో మొట్ట మొదటిసారి ప్రదర్శించారు. ఈ నాటకాన్ని దాదాపు 2000 సార్లు ప్రదర్శించారు. ఇందిరాగాంధీ నిరంకుశ ధోరణి మీద సంధించిన వ్యంగ్యాస్త్రం అది. ఈ నాటకం ఇప్పటికీ చెల్లుబాటవుతుందని చో అభిప్రాయం. అవే సమస్యలు చెక్కు చెదరకొండా కొనసాగడం రాజకీయ నాయకుల చలవేనంటారు చో.
ఈ నాటకం బ్రహ్మాండంగా విజయవంతమైనందువల్ల అది ఒక బ్రాండ్ అయిపోయి స్థిరపడినందువల్ల 1970లో “తుగ్లక్” పేరుతో పత్రిక ప్రారంభించారు చో. ఆ పత్రిక ముఖ చిత్రం మీద ఎప్పుడూ రాజకీయ కార్టూనే ఉంటుంది. 1971లో మహమ్మద్ బిన్ తుగ్లక్ సినిమాలో ఆయన నటించారు కూడా. అందువల్ల చో రామ స్వామి అంటే తుగ్లక్ అనివార్యంగా గుర్తుకొస్తుంది.
చో రాతలో, నటనలో ప్రసిద్ధుడే కాక జనాకర్షక శక్తిగల వక్త కూడా. నిజానికి ఆయన మాటల్లో కనిపించే సత్య స్ఫూర్తి ఆయన చేసిన అన్ని పనుల్లోనూ ద్యోతకమవుతుంది. ఆయన 12 నాటకాలు రాశారు. 57 సినిమాల్లో నటించారు. 37 సినిమాలకు స్క్రీన్ ప్లే సమకూర్చారు. చో మాటలు వాడిగా, మాడు పగలగొట్టేంతటి వ్యంగ్యంగా ఉండడమే కాదు ఆచరణలో కూడా విపరీతమైన పరిహాస ధోరణి కనబరిచే వారు. సంజయ్ గాంధీ మరణించినప్పుడు అదే విమాన ప్రమాదంలో సక్సేనా అనే వ్యక్తి కూడా మరణించారట. ఆయన స్మారకార్థం చో ఓ తపాలా బిళ్ల రూపొందించి విడుదల చేశారు.
దేవన్ దర్శకత్వంలోని “కళ్యాణి” నాటకంతో నటించడం ప్రారంభించిన చో ఆ తర్వాత కూతబిరన్ దర్శకత్వం వహించిన “తెన్మోజియల్” లో నటించారు. ఆ తర్వాత తాను రాసిన అనేక నాటకాలలో నటించారు. ఆయన స్వరం నటనకు పొసగదన్న విమర్శ ఉన్నా ఆయన మాటలోని తీవ్రతకు ప్రేక్షకులు ఆకర్షితులయ్యారు.
ఆయనను రాజకీయ వ్యంగ్య రచనలే జనం ఎక్కువగా గుర్తు పెట్టుకున్నా నిజానికి ఆయన వ్యంగ్య నాటకాలు అయిదారే. కావి అవే ప్రసిద్ధికెక్కాయి. అందుకే ఆయనకు వ్యంగ్య రచయిత అన్న పేరొచ్చింది. ఆయన సీరియస్ నాటకాలే ఎక్కువగా రాశారు. సినిమాల్లో ఆయన ప్రధానంగా హాస్య పాత్రలే పోషించారు. తుగ్లక్ నాటక ప్రదర్శన మీద ఆంక్షలు విధించడం, అసలు ప్రదర్శననే నిషేధించడం, ప్రదర్శనకు అవాంతరాలు కల్పించడం కూడా తప్పలేదు. చో తాను రాసిన నాటకాలను ఎవరైనా రాసి ఉండొచ్చునంటారు. ఆ నాటకాల్లో పెద్ద పరిశోధన ఏమీ లేదు. రాజకీయాల మీద కాస్తో కూస్తో పట్టున్న వారెవరైనా ఈ నాటకాలు రాసి ఉండొచ్చునంటారు. ఆయన రచనల్లో బలమంతా దూకుడు, కొంటెతనం, నిర్భీతి పరుచుకుని ఉంటాయి. ఇదే జనాన్ని ఆకట్టుకుంది. అందరినీ, ముఖ్యంగా రాజకీయ నాయకులను ఆటపట్టించడంలో దిట్ట. తన మీద తానే పరిహాహాసమాడే వారు. “నాకు ఘర్షణ పడడం ఇష్టం ఉండదు. కాని అవసరమైతే ఘర్షణ పడడానికి సిద్ధమే” అంటారు చో.
తుగ్లక్ పత్రిక వార్షికోత్సవాల సందర్భంగా పాఠకులతో ముఖా ముఖి ఏర్పాటు చేస్తారు. అప్పుడు పాఠకులు ఆయన మీద ప్రశ్నలు సంధించవచ్చు. “వారిని మాట్లాడనిచ్చే దాకానే నాకు ప్రజాస్వామ్యం మీద గౌరవం. ఆ తర్వాత నిర్ణయాలు నావే” అనగలిగిన సాహసం చో సొంతం.
చో న్యాయవాదుల కుటుంబానికి చెందినవారు. ఆయన తండ్రి, తాత కూడా న్యాయవాదులే. అందువల్ల సమస్య మూలాల్లోకి వెళ్లడం అలవడింది. తన వాదనను బలంగా వినిపించే శక్తి అబ్బింది. నాటకాలు రాయడం వల్లే తన రచనా కౌశలం పదునుదేరిందంటారు. తన రచనల వల్ల ఎవరైనా మారారా అని అడిగితే “లేదు” అని నిబ్బరంగా సమాధానం చెప్తారు చో. నిజానికి చో రామస్వామి పట్టణ వాసుల మిథ్యా అంతరాత్మకు ప్రతీక. ఆయన నాటకాన్ని చూసి ఆనందించే వారు ఆ తర్వాత తమకు అలవాటైన కపట జీవితం గడపగలరు. చో మాటల్లో, రాతల్లో అడుగడుగునా తుంటరి తనం తొణికిసలాడుతుంది. కాని ఆ మాటల్లోంచి ఏదో విశేషం తొంగి చూస్తుంటుంది. మాటకు మాట అనగల సామర్థ్యం చో సొంతం. పరిహాసం పాళ్లు ఎక్కువ. అయినా చో ప్రత్యేకత ఏమిటంటే ఆ పరిహాసంలోనే సమాధానాలు ఉండడం.
చో రచనలను జాగ్రత్తగా గమనిస్తే నిరాపేక్ష విశ్లేషకుడిలా కనిపిస్తారు. నిజానికి ఆయనలో ఉన్నది రాజకీయ వాక్చాతుర్యం మాత్రమే అన్న విమర్శా ఉంది. రాజకీయ లోతులు ఆయనకు తెలియవనే వారూ లేక పోలేదు. అయితే కొన్ని సందర్భాలలో రాజకీయ నిశిత దృష్టి పెల్లుబుకుతుంది. “నెహ్రూ కుటుంబం వారినే జనం ఆరాధిస్తారా?” అని ఒక ఇంటర్వ్యూలో అడిగితే “అదేం లేదు లాలూ ప్రసాద్ యాదవ్, కరుణానిధి, ఎన్.టి.రామా రావు, ఎం.జి.ఆర్. చరణ్ సింగ్, జయలలిత, దేవీలాల్ ను ఆరాధించడం లేదా?” అని ఎదురు ప్రశ్న వేశారు. నెహ్రూ స్థాయి నాయకుడు ఆ తర్వాత కనిపించకపోవడం, జాతీయ స్థాయిలో పేరున్న నాయకులు లేక పోవడం వల్ల ప్రాంతీయంగా ఉండే నాయకులు తమ ప్రాంతాలకే పరిమితమై పోవడం వల్ల ఈ అభిప్రాయం ఏర్పడిందంటారు చో.
అన్ని పక్షాల రాజకీయ నాయకులను దుయ్యబట్టే చో రాజకీయ దృక్పథం ఏమిటో చెప్పడం కష్టమే. 1971 ఎన్నికలలో కాంగ్రెస్ (ఓ)-స్వతంత్ర పార్టీ కూటమికి అనుకూలంగా ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు. జయలలితకన్నా రజనీకాంత్ ముఖ్యమంత్రికి పదవికి తగినవాడని అంటారు. జయలలిత అవినీతిని తూర్పార బట్టారు. అన్నాడి.ఎం.కె. నాయకురాలు జయలలితే ఆ పార్టీలో సర్వస్వం. ఆమె ఎవరి సలహా పాటించరు అంటారు. కాని ఆమె చో సలహా తీసుకుంటారు.
“సంభవామి యుగే యుగే” నాటకం రాసే సందర్భంలో భగవద్గీత లోంచి కావాల్సిన భాగం వెతికే క్రమం ఆ ప్రాచీన గ్రంథం ఆయనను అమితంగా ఆకర్షించింది. అందుకే మహాభారతాన్ని, రామాయణాన్ని అనువదించారు.
వివాదాస్పద అంశాల మీద చో రామస్వామి అభిప్రాయాలు అంతకన్నా వివాదాస్పదంగా ఉంటాయి. ఆయన రిజర్వేషన్లకు వ్యతిరేకి. ఒకే ఒక సందర్భంలో తప్ప కుల వివక్షను ఎన్నడూ వ్యతిరేకించలేదు. ఆయన రాజకీయ దృక్పథం ఏమిటో చెప్పలేక పోయినా ఆయన పచ్చి కమ్యూనిస్టు వ్యతిరేకి. కమ్యూనిజం మానవ స్వభావానికి విరుద్ధమైందన్నది ఆయన ప్రగాఢ విశ్వాసం. ఆ మాటకొస్తే సామాజిక సమానత్వంపై కూడా ఆయనకు నమ్మకం లేదు. “ప్రకృతిలోనే సమానత్వం లేదు. ప్రకృతికి విరుద్ధంగా వెళ్లలేం” అన్నది ఆయన అవగాహన. చో అంతటితో ఆగరు. పెట్టుబడిదారీ విధానం పేదలకు వ్యతిరేకం కాదని కూడా వాదించగలరు. పెట్టుబడి దారీ విధానం వృద్ధి చెందితే పేదలకు ఉద్యోగాలు వస్తాయన్నది ఆయన అభిప్రాయం. “పెట్టుబడిదారీ విధానాన్ని సమర్థించే వారిని తిరోగమన వాదులంటారు. వారిని మేధావులు అనడం లేదు. తిరోగమన వాదులే అసలైన మేధావులు” అని ముక్తాయించగలిగిన సాహసి చో. ఆయన పదునైన రీతిలో రాయగలరని మాట్లాడగలరని చెప్పగలం కాని ఆయన ఆలోచనల్లో పదును కనిపించదు.