Telugu Global
Agriculture

ఆ ప్రాజెక్టు గేమ్‌ చేంజర్‌ అవుతది

మీడియా సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు

ఆ ప్రాజెక్టు గేమ్‌ చేంజర్‌ అవుతది
X

గోదావరి - బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టు ఏపీకి గేమ్‌ చేంజర్‌ అవుతుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం ఏపీ సెక్రటేరియట్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలవరం కుడి కాలువ బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌ కాంప్లెక్స్‌ అనుసంధానంతో కొత్తగా 7.50 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి తీసుకువస్తామని చెప్పారు. బనకచర్ల నుంచి ప్రతి రోజు 2 టీఎంసీల నీటిని తరలించేలా చర్యలు చేపడుతామన్నారు. ఈ నదుల అనుసంధానం ప్రాజెక్టు పూర్తయితే తెలుగుతల్లికి జలహారతి ఇచ్చినట్టేనని అన్నారు. గోదావరి నుంచి ఈ ఏడాది 4,114 టీఎంసీల నీళ్లు సముద్రంలోకి వెళ్లాయన్నారు. రాష్ట్రంలోని రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యం 983 టీఎంసీలు ఉంటే, ఇప్పుడు 729 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు రిజర్వాయర్లలో 74 శాతం నీళ్లు నిల్వ ఉండటం ఒక రికార్డు అన్నారు.

పోలవరం కుడి కాలువను మరింత విస్తరించి ప్రకాశం బ్యారేజీకి నీటిని తరలిస్తామని.. అక్కడి నుంచి కొత్తగా నిర్మించే బొల్లాపల్లి రిజర్వాయర్‌ కు నీటిని తరలిస్తామని తెలిపారు. బొల్లాపల్లి నుంచి బనకచర్లకు లింక్‌ చేస్తామని.. దీంతో రాయలసీమ జిల్లాలకు ఎప్పటికీ నీటి కొరత రాదన్నారు. రాయలసీమతో పాటు ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు లాభం చేకూరుతుందన్నారు. రూ.80 వేల కోట్లతో ఈ ప్రాజెక్టు నిర్మిస్తే రాష్ట్రానికి ఎంతో ఆదాయం సమకూరుతుందన్నారు. ప్రధాని మోదీకి ఈ ప్రాజెక్టు నివేదిక పంపిస్తున్నామని.. హైబ్రిడ్‌ మోడల్‌ లో ఈ ప్రాజెక్టుకు నిధుల సమీకరణకు ఆలోచన చేస్తున్నామని చెప్పారు. ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు 48 వేల ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉంటుందని, 7.50 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లివ్వడంతో పాటు 80 లక్షల మందికి తాగునీటిని అందజేస్తామన్నారు. రెండు మూడు నెలల్లోనే ఈ ప్రాజెక్టుకు టెండర్లు పిలుస్తామన్నారు.

First Published:  30 Dec 2024 7:13 PM IST
Next Story