Telugu Global
Agriculture

సాగునీటి విడుదలలో ఇంత నిర్లక్ష్యమా?

ఇరిగేషన్‌ మంత్రి సొంత జిల్లాలోనే పరిస్థితి ఇట్లా ఉంటే.. రాష్ట్రం మొత్తం ఎలా ఉందో : మాజీ మంత్రి హరీశ్‌ రావు

సాగునీటి విడుదలలో ఇంత నిర్లక్ష్యమా?
X

సాగునీటిని విడుదల చేయాలని కోరుతూ రైతులు రోడ్డెక్కడమా.. కాంగ్రెస్‌ నిర్లక్ష్యపు పాలనకు ఇదే నిదర్శనమని మాజీ మంత్రి హరీశ్‌ రావు మండిపడ్డారు. ఇరిగేషన్‌ శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సొంత జిల్లాలోనే సాగునీటికి ఎంతటి కటకట ఉందో రైతుల ఆందోళనతోనే తేలిపోతుందని 'ఎక్స్' వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్‌ఆర్‌ఎస్పీ స్టేజ్‌ -2 నీటి కోసం మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సొంత జిల్లాలో రైతులు ఆందోళన చేసిన వీడియోలతో పాటు కాంగ్రెస్‌ ప్రభుత్వ యాసంగి సాగు ప్రణాళికను తన పోస్టుకు జత చేశారు. సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రుల మాటలు కోటలు దాటుతున్నాయే తప్ప ఆచరణ గడప దాటడం లేదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చింది.. రైతులకు కన్నీటి గోస తెచ్చిందన్నారు. ఇరిగేషన్‌ శాఖ మంత్రి ప్రాతినిథ్యం వహిస్తోన్న సూర్యాపేట జిల్లాలోనే పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రం మొత్తం ఎలా ఉందోనని ఆందోళన వ్యక్తం చేశారు.

యాసంగి సీజన్‌ లో ఆయకట్టుకు సాగునీటి విడుదల షెడ్యూల్ పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి ప్రకటనలు ఇచ్చారే తప్ప ఎస్సారెస్పీ స్టేజీ -2 కింద తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాల్లోని 3,36,630 ఎకరాలకు సాగునీటిని ఇస్తామని ప్రకటనల్లో చెప్పారు తప్ప కాల్వలకు నీటిని విడుదల చేయడం లేదన్నారు. ప్రభుత్వం మాటలు నమ్మి నాట్లు వేసిన రైతుల పరిస్థితి ఏం కావాలని సీఎం రేవంత్‌ రెడ్డిని నిలదీశారు. నాట్ల దశలోనే సాగునీటికి గోస పడితే రానున్న రోజుల్లో నీటిని ఎలా సరఫరా చేస్తారని ప్రశ్నించారు. అద్భుతాలు చేస్తామన్న భ్రమలు కల్పించడం మాని ఇకనైనా ఆచరణకు దిగాలని హితవు పలికారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలు, ప్రతిపక్షాల మీద ఆరోపణలు చేయడం మానేసి పంట పొలాలకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆందోళనలో ఉన్న రైతులకు భరోసా కల్పించాలని సూచించారు.

First Published:  20 Jan 2025 3:55 PM IST
Next Story