Telugu Global
Agriculture

యాసంగిలో పంట వేయొద్దనడం ప్రభుత్వ వైఫల్యమే

మాజీ ఎంపీ బి. వినోద్‌ కుమార్‌

యాసంగిలో పంట వేయొద్దనడం ప్రభుత్వ వైఫల్యమే
X

ఎస్సారెస్పీ స్టేజ్‌ -1, 2 ఆయకట్టుకు నీళ్లివ్వలేం.. తక్కువ విస్తీర్ణంలో పంటలు వేసుకోవాలని చెప్పడం అంటే అది ప్రభుత్వ వైఫల్యమేనని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌ కుమార్‌ అన్నారు. తెలంగాణ భవన్‌లో బుధవారం ఆయన జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, నాయకులు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌, రూప్‌ సింగ్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. రైతులకు యాసంగి పంట ఎంతో కీలకమని చెప్పారు. మేడిగడ్డ బ్యారేజీ వినియోగంపై రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. బ్యారేజీ రిపేర్లకు ఎన్‌డీఎస్‌ఏ అనుమతి తీసుకోవాలని నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ యాక్ట్‌లో ఎక్కడా లేదన్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌డీఎస్‌ఏ పేరు చెప్పి మేడిగడ్డకు రిపేర్లు చేయడం లేదన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనని చెప్పారు. నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీకి సూచనలు చేసే అధికారం మాత్రమే ఉందని గుర్తించాలన్నారు. ఈ వానాకాలంలో మేడిగడ్డ బ్యారేజీ నుంచి వేలాది టీఎంసీల వరద పోయినా, రిక్టర్‌ స్కేల్‌పై 5.3 తీవ్రతతో భూకంపం వచ్చినా బ్యారేజీకి ఏమీ కాలేదని గుర్తు చేశారు. కేసీఆర్‌ ను బద్నాం చేయడానికే మేడిగడ్డ కుంగిందని ప్రభుత్వం, కాంగ్రెస్‌ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఎక్కడైనా తప్పులు జరిగితే చర్యలు తీసుకోవాలని కోరారు. సీఎం రేవంత్‌ రెడ్డి, ఇరిగేషన్‌ శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వెంటనే సమీక్ష సమావేశం నిర్వహించి మేడిగడ్డకు రిపేర్లు చేసి యాసంగి పంటలకు సాగునీళ్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.

First Published:  11 Dec 2024 3:06 PM IST
Next Story