Telugu Global
Agriculture

రేవంత్‌ మీ ఊరికి పోదామా? నువ్వే ఇక్కడికి వస్తావా? రుణమాఫీ అయిందో లేదో చూద్దాం

సీఎం రేవంత్‌ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్‌ రావు బహిరంగ సవాల్‌

రేవంత్‌ మీ ఊరికి పోదామా? నువ్వే ఇక్కడికి వస్తావా? రుణమాఫీ అయిందో లేదో చూద్దాం
X

సీఎం రేవంత్‌ రెడ్డి రుణమాఫీ పూర్తయ్యిందని చెప్తున్నారని.. తాను ఇప్పుడున్న గాడిచర్లపల్లి చిన్నగ్రామమని.. ఇక్కడ రుణమాఫీ కానీ రైతులే ఎక్కువ మంది ఉన్నారని మాజీ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. రేవంత్‌ రెడ్డి సొంతూరు కొండారెడ్డిపల్లికి పోదామా? లేదంటే గాడిచర్లపల్లికి వస్తావా ఎంత మందికి రుణమాఫీ కాలేదో చూద్దామని సవాల్‌ విసిరారు. బుధవారం సిద్దిపేట మున్సిపాలిటీలోని 15వ వార్డు (గాడిచర్లపల్లి)లో నిర్వహించిన వార్డు సభలో ఆయన పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సభలోనే తనకు రుణమాఫీ కోసం ఆకుల రాజు, కుసుంబ నగేశ్‌, బాగమ్మగారి పూజ, ఎం. రాధ, ఊత బలయ్య, మరిగె సుధాకర్‌ తమ బ్యాంకు లోన్లు రూ.లక్షలోపు నుంచి రూ.2 లక్షల లోపు ఉన్న మాఫీ కాలేదని దరఖాస్తు పెట్టుకున్నారని తెలిపారు. సత్తయ్య అనే రైతుకు రూ.2 లక్షలకు పైగా అప్పు ఉందని బ్యాంకు అధికారులు రూ.68 వేలు కట్టించుకున్నారని.. అయినా తనకు రుణమాఫీ కాలేదని ఆయన మొర పెట్టుకున్నారని తెలిపారు. రూ.2 లక్షల మీదున్న అప్పు కడితే రూ.2 లక్షలు మాఫీ చేస్తామన్న ముఖ్యమంత్రి మాటలు నమ్మి అప్పు తెచ్చి రూ.68 వేలు కడితే పైసా మాఫీ కాలేదని ఆందోళన చెందుతున్నారని హరీశ్‌ రావు వివరించారు.

ప్రజలు సంక్షేమ పథకాల కోసం ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకోవాలని ప్రశ్నించారు. ప్రతిసారి దరఖాస్తు చేసుకోవడానికి ఒక్కొక్కరు రూ.40 వరకు ఖర్చు పెట్టాల్సి వస్తుందన్నారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారని, మీ సేవ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశారని.. ఇప్పుడు మళ్లీ గ్రామ సభల్లో అప్లికేషన్లు పెడుతున్నారని గుర్తు చేశారు. 13 నెలల్లో ఈ ప్రభుత్వం ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. ఎలక్షన్లకు ముందు అందరికీ పరమాన్నం పెడుతామని చెప్పి ఇప్పుడు పంగనామాలు పెడుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి హైదరాబాద్‌లో ఉండటం కాదు ప్రజల మధ్యకు వస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు. పోలీస్‌ పహారాలో గ్రామ సభలు నిర్వహిస్తూ ఎవరైనా మాట్లాడితే అరెస్టు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నవంబర్‌ 30న రూ.2,750 కోట్ల రుణాలు మాఫీ చేస్తున్నట్టు సీఎం చెక్కు ఇచ్చినా అది ఇప్పటి వరకు పాస్‌ కాలేదని.. అంటే సీఎం ఇచ్చిన చెక్కు బౌన్స్‌ అయితే ప్రభుత్వం పరువు పోయినట్టేనని ఎద్దేవా చేశారు. తాను ఇచ్చిన చెక్కు పాస్‌ కాకపోతే ఈ ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి బాధ్యత లేదా అని ప్రశ్నించారు. రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. మంగళవారం ఒక్కరోజే రాష్ట్రంలో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని.. అయినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదన్నారు.

రైతుబంధు సాయమెప్పుడని రైతులు ప్రశ్నిస్తున్నారని.. వానాకాలంలో ఎగవేసిన సాయం కూడా ఇవ్వాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారని అన్నారు. ఎన్నికలకు ముందు కోతలు కోసిన రేవంత్‌ రెడ్డి గెలిచిన తర్వాత తర్వాత అన్నింట్లో కోతలు పెడుతున్నారని అన్నారు. రేవంత్‌ సొంత గ్రామానికి ఆరు లైన్లతో రోడ్డు వేసుకునేందుకు రూ.5 వేల కోట్లు ఉన్నాయి కాని రైతులకు డబ్బులు ఇచ్చేందుకు పైసలు లేవా అని ప్రశ్నించారు. రేషన్‌ కార్డుల కోసం గతంలో వచ్చిన అప్లికేషన్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. అర్హులైన పేదలందరికీ రేషన్‌ కార్డులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏడాదికి 5 లక్షల ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చి ఉన్న ఇండ్లనే కూలగొడుతుందన్నారు. గుంట భూమి లేని భాగ్యమ్మ అనకు ఆత్మీయ భరోసా వర్తించదని ఆందోళన చెందుతున్నారని.. ఉపాధి హామీతో ఈ పథకానికి లంకె పెట్టడంతోనే భాగ్యమ్మలాంటి వాళ్లు అనర్హులుగా మారుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో కోటి మంది కూలీలుంటే 6 లక్షల మందికి మాత్రమే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తామని ఈ ప్రభుత్వం అంటోందన్నారు. ఇన్‌చార్జీల మంత్రుల పేరుతో కాంగ్రెస్‌ కార్యకర్తలకు మాత్రమే సంక్షేమ పథకాలు ఇస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ప్రొటోకాల్‌ ఇవ్వడం లేదని.. గ్రామసభల్లో ఫొటోలు పెట్టడం లేదని అన్నారు. మహాలక్ష్మీ పథకం కింద ఒక్కో మహిళకు ఈ ప్రభుత్వం రూ.30 వేల చొప్పున బాకీ పడిందన్నారు. అవ్వాతాతలకు పెన్షన్‌ ఎప్పుడు పెంచి ఇస్తారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

First Published:  22 Jan 2025 2:53 PM IST
Next Story