Telugu Global
Agriculture

దేశానికి అన్నం పెట్టే రైతు ప్రభుత్వాన్ని అడుక్కోవాలా?

రేవంత్‌ రెడ్డి రైతు వ్యతిరేకి.. రైతులందరికీ రైతుభరోసా ఇవ్వాలి : ఎమ్మెల్సీ కవిత

దేశానికి అన్నం పెట్టే రైతు ప్రభుత్వాన్ని అడుక్కోవాలా?
X

దేశానికి అన్నం పెట్టే రైతు ప్రభుత్వాన్ని అడుక్కోవాలా అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌ రెడ్డి రైతు వ్యతిరేకి అని అందుకే రైతుభరోసా పథకం అమలుకు ఆంక్షలు పెడుతున్నాడని అన్నారు. గురువారం తన నివాసంలో బోధన్‌ నియోజకవర్గ నాయకుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రైతుభరోసా అమలుకు షరతలు, నిబంధులు ఎందుకని ప్రశ్నించారు. రైతులందరికీ పెట్టుబడి సాయం అందించాలని డిమాండ్‌ చేశారు. రైతు భరోసాకు దరఖాస్తులు తీసుకోవాలనే నిర్ణయమే దారుణమన్నారు. ప్రజాపాలన పేరుతో ఇదివరకే స్వీకరించిన దరఖాస్తులు ఏమయ్యాయో చెప్పాలన్నారు. ఇంకెన్నిసార్లు దరఖాస్తులు తీసుకుంటారని నిలదీశారు. రైతులు వ్యవసాయం చేసుకోవాలా గవర్నమెంట్‌ ఆఫీసుల చుట్టూ తిరగాలా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ రైతులను కడుపులో పెట్టుకొని చూసుకుంటే కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతాంగాన్ని కుదేలు చేస్తోందన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేక ఏర్పడిందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని అన్నారు. ఏడాది పాలనలోనే కాంగ్రెస్ పార్టీ తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుందన్నారు. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ అన్ని వర్గాలకు అన్యాయం చేసిందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేక సీఎం రేవంత్ రెడ్డి చేతులెత్తేశారన్నారు. ఈ ప్రభుత్వంపై ప్రజలు కోపంతో ఉన్నారని తెలిపారు. మహిళలకు నెలకు రూ.2,500 సాయం, 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలకు స్కూటీలు, కళ్యాణ లక్ష్మీ కింద తులం బంగారం ఇస్తామని నమ్మించి కాంగ్రెస్మో సం చేసిందన్నారు. రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి... ఇప్పడు రైతు భరోసాకు షరతుల పేరుతో మరోసారి దగా చేస్తున్నారని మండిపడ్డారు.

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని కార్యకర్తలకు మార్గనిర్దేశం చేశారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు లేవనెత్తి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నారు. గతంలో కేసీఆర్ అమలు చేసిన పథకాలు, కార్యక్రమాలతో కలిగిన ప్రయోజనాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలన్నారు. స్థానిక సంస్థలు ఎన్నికల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు కలసికట్టుగా పనిచేయాలన్నారు. కార్యకర్తలకు తామంతా అండగా ఉంటామన్నారు. సమావేశంలో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ సతీమణి అయేషా ఫాతిమా, మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

First Published:  2 Jan 2025 5:10 PM IST
Next Story