అగ్నిపథ్ పై తగ్గేదే లేదు.. కేంద్ర మంత్రులు ఏమన్నారంటే..?
అగ్నిపథ్ అల్లర్లతో ఓవైపు రైల్వే స్టేషన్లు తగలబడిపోతున్నాయి, మరోవైపు అమాయకులైన యువకుల ప్రాణాలు కూడా పోయాయి. అయినా కేంద్రం మాత్రం ఈ విషయంలో తగ్గేది లేదంటోంది. పథకం అమలు చేసి తీరతామంటున్నారు కేంద్ర మంత్రులు. కొత్త నియామకాల పద్ధతి యువతకు బంగారం లాంటి అవకాశం అని అన్నారు రాజ్ నాథ్ సింగ్. త్వరలోనే అగ్నిపథ్ నియామకాల ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. వెంటనే యువత అందుకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఓవైపు నిరసనలు జరుగుతున్నా.. మరోవైపు యువతకు సన్నద్ధం […]
అగ్నిపథ్ అల్లర్లతో ఓవైపు రైల్వే స్టేషన్లు తగలబడిపోతున్నాయి, మరోవైపు అమాయకులైన యువకుల ప్రాణాలు కూడా పోయాయి. అయినా కేంద్రం మాత్రం ఈ విషయంలో తగ్గేది లేదంటోంది. పథకం అమలు చేసి తీరతామంటున్నారు కేంద్ర మంత్రులు. కొత్త నియామకాల పద్ధతి యువతకు బంగారం లాంటి అవకాశం అని అన్నారు రాజ్ నాథ్ సింగ్. త్వరలోనే అగ్నిపథ్ నియామకాల ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. వెంటనే యువత అందుకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఓవైపు నిరసనలు జరుగుతున్నా.. మరోవైపు యువతకు సన్నద్ధం కావాలంటూ రాజ్ నాథ్ పిలుపునివ్వడం విశేషం.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఇలానే మాట్లాడారు. యువకుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వయోపరిమితిని పెంచామని, ఇది యువతకు ఓ సదవకాశమని తెలిపారు అమిత్ షా. దేశ సేవ చేసి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలనుకుంటున్న యువకులకు లాభం చేకూరుతుందని ఆయన చెప్పారు గడ్కరీ.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈ పథకాన్ని సమర్థిస్తూ మాట్లాడారు. అగ్నిపథ్ వంటి పథకాలు దేశంలో చాలా ఉన్నాయని, కానీ ఈ పథకం విషయంలో యువతను తప్పుదారి పట్టించాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారని, అది మంచి పద్ధతి కాదని అన్నారు. ఇది బలవంతపు ట్రైనింగ్ కాదని, స్వచ్చందంగా సైన్యంలో చేరవచ్చని, యువతలో జాతీయభావం తీసుకురావడంతో భాగంగా అగ్నిపథ్ ను తీసుకువచ్చామని అన్నారు కిషన్ రెడ్డి.
అటు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే కూడా అగ్నిపథ్ పథకం యువతకు గొప్ప వరం అన్నారు. గరిష్ట వయోపరిమితిని 21 నుంచి 23 ఏళ్లకు పెంచడం సైన్యంలో చేరాలనుకునే యువతకు మరో మంచి అవకాశమని చెప్పారు. ఈ ఏడాదికి సంబంధించిన నియామక ప్రక్రియ నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారాయన.
ఓవైపు అల్లర్లు జరుగుతుండగా.. మరోవైపు కేంద్ర మంత్రులు చేసిన ప్రకటన నిరుద్యోగులను మరింత రెచ్చగొట్టేలా ఉందంటూ ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. అగ్నిపథ్ పథకాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని ఆప్, కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నాయి. సవరణలు, సంస్కరణలకు అంగీకరించేదే లేదంటున్నారు నిరుద్యోగులు.