లోక్‌సభకు పోటీ చేయనున్న కేసీఆర్?
తెలంగాణ సీఎం కేసీఆర్ చాన్నాళ్ల క్రితమే జాతీయ రాజకీయాలపై మక్కువ పెంచుకున్నారు. గత కొన్నాళ్లుగా కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయాల్లో మంచి వ్యూహకర్తగా పేరున్న కేసీఆర్.. రాష్ట్రంలో టీఆర్ఎస్‌ను తిరుగులేని శక్తిగా మార్చారు. ఉద్యమ పార్టీని ఫక్తు రాజకీయ పార్టీగా మార్చినా.. తెలంగాణ సెంటిమెంట్ మాత్రం తమ పార్టీ నుంచి చేజారకుండా చూసుకుంటున్నారు. ఇక జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే దిశగా ఇప్పటికే పలువురు నాయకులను కలిశారు. హేమంత్ […]
తెలంగాణ సీఎం కేసీఆర్ చాన్నాళ్ల క్రితమే జాతీయ రాజకీయాలపై మక్కువ పెంచుకున్నారు. గత కొన్నాళ్లుగా కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయాల్లో మంచి వ్యూహకర్తగా పేరున్న కేసీఆర్.. రాష్ట్రంలో టీఆర్ఎస్‌ను తిరుగులేని శక్తిగా మార్చారు. ఉద్యమ పార్టీని ఫక్తు రాజకీయ పార్టీగా మార్చినా.. తెలంగాణ సెంటిమెంట్ మాత్రం తమ పార్టీ నుంచి చేజారకుండా చూసుకుంటున్నారు. ఇక జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే దిశగా ఇప్పటికే పలువురు నాయకులను కలిశారు.
హేమంత్ సోరేన్, స్టాలిన్, ఉద్దవ్ ఠాక్రే, కేజ్రీవాల్ వంటి నాయకులతో భేటీ అయి.. కూటమి ప్రయత్నాలు మొదలు పెట్టారు. దసరా తర్వాత సంచలనం ఉంటుందని ప్రకటించి అందరిలో ఆసక్తికి కలిగించారు. కేంద్రంలో కీలక భూమిక పోషించాలంటే ఎంపీగా ఉంటేనే సాధ్యమవుతుందని కేసీఆర్ భావిస్తున్నారు. ఒక ప్రాంతీయ పార్టీకి అధినేత అయితే సరిపోదని.. లోక్‌సభలో తాను కూడా ఉంటేనే బాగుంటుందని ఆయన అనుకుంటున్నారు. జాతీయ రాజకీయాలకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా వెళ్లడం కంటే ఎంపీగా వెళ్లడమే కరెక్టని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. ఒక వేళ అవకాశం వస్తే కేంద్రంలో ముఖ్య పదవిని చేపట్టడానికి కూడా ఉపయోగపడుతుందని తలస్తున్నారు.
సీఎం కేసీఆర్ వరుసగా రెండు సార్లు గజ్వేల్ నియోజకవర్గం నుంచి గెలిచారు. కానీ, ఈ సారి ఆయన గజ్వేల్ నుంచి పోటీ చేయడం లేదనే విషయాన్ని స్థానిక నాయకులు కూడా ధ్రువపరుస్తున్నారు. టీఆర్ఎస్ టికెట్‌పై వంటేరు ప్రతాప్‌రెడ్డి పోటీలో ఉండబోతున్నారు. గతంలో కేసీఆర్ రెండు సార్లు పోటీ చేసినప్పుడు కూడా ప్రతాప్‌రెడ్డినే ప్రత్యర్థిగా ఉన్నారు. ఒకసారి టీడీపీ తరపున, మరోసారి కాంగ్రెస్ తరపున ఆయన పోటీ చేశారు. గత ఎన్నికల్లో ఆయన కేసీఆర్‌కు గట్టి పోటీనే ఇచ్చారు. కానీ ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
గజ్వేల్ నియోజకవర్గంలో ప్రతాప్‌రెడ్డి విస్తృతంగా పర్యటిస్తున్నారు. అక్కడ ఎమ్మెల్యే కేసీఆర్ అయినప్పటికీ ప్రతాప్‌రెడ్డికి పూర్తి స్వేచ్చను ఇచ్చారు. నియోజకవర్గం అంతా కలియదిరుగుతూ ప్రతాప్ రెడ్డి తన ప్రాభవాన్ని పెంచుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో తనకు టికెట్ వస్తుందనే భరోసా ఉండటంతో ఆయన ఆ మేరకు పని చేస్తున్నారు. అయితే మొదట్లో కేసీఆర్ నియోజకవర్గం మారతారనే ఊహాగానాలు వచ్చాయి. గజ్వేల్‌ను వదిలి వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని అందరూ భావించారు. కేసీఆర్ నియోజకవర్గం మారడంపై పార్టీలో కూడా భిన్నాభిప్రాయాలు వెలువడ్డాయి. కానీ, అసలు విషయం మాత్రం ఆయన అసెంబ్లీకి కాకుండా లోక్‌సభకు పోటీ చేయనుండటమే అని తెలుస్తున్నది.
కేసీఆర్ మెదక్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయడానికి రంగం సిద్దం చేసుకుంటున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఆయన ఆ నియోజకవర్గంపై దృష్టిపెట్టి.. సర్వేలు కూడా చేయించుకున్నట్లు సమాచారం. గతంలో కూడా కేసీఆర్ ఎంపీగా పని చేశారు. 2004-09 వరకు కరీంనగర్ ఎంపీగా.. 2009-14 వరకు మహబూబ్‌నగర్ ఎంపీగా ఆయన పని చేశారు. అయితే ఈ సారి మెదక్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. మెదక్ లోక్‌సభ పరిధిలో గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక, మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్‌చెరు నియోజకవర్గాలు ఉన్నాయి. ఇవన్నీ టీఆర్ఎస్ ఓటు బ్యాంకు భారీగా ఉన్న సెగ్మెంట్లే. అందుకే మెదక్ అయితే సేఫ్‌గా ఉంటుందని కేసీఆర్ అనుకుంటున్నారు.
కేసీఆర్ ఎంపీగా వెళ్తారన్న వార్తలు వస్తున్నా.. ఆయన వ్యూహాలను అంచనా వేయడం అంత తేలిక కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ ఇంకా బలంగానే ఉన్నది. ఆ పార్టీనే నేరుగా ఢీ కొట్టడానికి కేసీఆర్ సిద్దమవుతున్నారు. అందుకే అన్ని రకాల అంచనాలు వేసుకున్న తర్వాతే కేసీఆర్ లోక్‌సభ బరిలోకి దిగుతారని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి.