మురళీధర్‌రావు ట్వీట్.. బీజేపీకి షాకిస్తారా..?
RSS నేపథ్యం ఉన్న మురళీధర్‌రావు.. 2009లో బీజేపీలో జాయిన్ అయ్యారు. గతంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగానూ బాధ్యతలు నిర్వహించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున క్రియాశీలకపాత్ర పోషించారు
మల్కాజ్‌గిరి నుంచి బీజేపీ ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డారు ఆ పార్టీ సీనియర్ నేత మురళీధర్‌రావు. టికెట్ నిరాకరించడంతో ఆయన అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గ టికెట్‌ను మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత ఈటలకు కేటాయించింది.
టికెట్ రాకపోవడంతో నిరాశకు గురైన మురళీధర్‌రావు.. ఓ ట్వీట్ చేశారు. గత కొన్నేళ్లుగా సన్నిహితులు, సహచరులు, పార్టీ కార్యకర్తలు మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో తన కోసం కష్టపడ్డారని, ప్రచారం నిర్వహించారని గుర్తు చేసుకున్నారు. వారందరికీ కృతజ్ఞతలు తెలిపిన మురళీధర్‌రావు.. త్వరలోనే వారితో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు.
RSS నేపథ్యం ఉన్న మురళీధర్‌రావు.. 2009లో బీజేపీలో జాయిన్ అయ్యారు. గతంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగానూ బాధ్యతలు నిర్వహించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున క్రియాశీలకపాత్ర పోషించారు మురళీధర్‌రావు. ఐతే గత కొన్నేళ్లుగా ఆయన మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానంలో పని చేసుకుంటూ వస్తున్నారు. ఈసారి అక్కడి నుంచి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో దిగాలని భావించారు. కానీ, బీజేపీ హైకమాండ్ మురళీధర్‌రావును కాదని.. మొదటి లిస్టులోనే మల్కాజ్‌గిరి స్థానం అభ్యర్థిగా ఈటలకు అవకాశమిచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఈటలకు రెండు స్థానాలు ఇచ్చారని.. మళ్లీ ఇప్పుడు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వడంతో పలువురు పార్టీ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.