మేడిగడ్డ ప్రాజెక్టుతో కోటి ఎకరాలకు సాగు : వి ప్రకాశ్

ఓర్వలేనితనంతో మేడిగడ్డ ప్రాజెక్టుపై దుష్ప్రచారాలు చేస్తున్నారని రాష్ట్ర జలవనరుల సంస్థ మాజీ చైర్మన్‌ వి ప్రకాశ్ అన్నారు.

Advertisement
Update:2025-01-31 20:41 IST

తెలంగాణ ప్రయోజనాలను ఎన్నడూ పట్టించుకోని కాంగ్రెస్‌ నాయకులు ఓర్వలేనితనంతో మేడిగడ్డ ప్రాజెక్టుపై దుష్ప్రచారాలు చేస్తున్నారని రాష్ట్ర జలవనరుల సంస్థ మాజీ చైర్మన్‌ వి ప్రకాశ్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన ‘నీళ్లు- నిజాలు ’ అనే అశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలో నిర్మించ దలిచిన ఇచ్చంపల్లి ప్రాజెక్టు వల్ల తెలంగాణ కంటే చత్తీస్ గఢ్, ఆంధ్రాకే లాభం ఎక్కువని అన్నారు. ఈ విషయాన్ని గమనించిన కేసీఆర్ అధికారంలోకి రాగానే మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు కట్టి కోటి ఎకరాల మాగాణాన్ని సాధించి చూపించారని తెలిపారు. అతి తక్కువ సమయంలో కాళేశ్వరం నిర్మించి రికార్డు సృష్టించారని అన్నారు. పదేళ్ల కాలంలో తెలంగాణ సాగునీటి రంగాన్ని ప్రపంచంలోనే మేటిగా నిలిపారని స్పష్టం చేశారు.ఆంధ్రా పాలకులు శ్రీరాం సాగర్ నుంచి ధవళేశ్వరం వరకు ఒక్క ప్రాజెక్టు కూడా కట్టుకుండా తెలంగాణకు అన్యాయం చేశారని ఆరోపించారు. ప్రాణహిత,పెన్ గంగా ప్రాజెక్టులను కేసీఆర్ మొదలుపెట్టే వరకు వాటికి అతీగతీ లేదని వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏలేశ్వరం ప్రాజెక్టు నిర్మించి ఉంటే వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలో 10 లక్షల ఎకరాలకు నీళ్లు అందేవని అన్నారు.

సీనియర్ జర్నలిస్ట్ నవీన్ కుమార్ మాట్లాడుతూ, తెలంగాణ రూ.93 వేల కోట్లు ఖర్చు చేసి 19.60 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తే ఏపీ ప్రభుత్వం రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చుతో ఎకరా కూడా కొత్త ఆయకట్టు లేని పోలవరం - బనకచర్ల ప్రాజెక్టు నిర్మిస్తోందని తెలిపారు. కృష్ణా డెల్టా, నాగార్జున సాగర్ కుడి కాలువ, తెలుగుగంగ, గాలేరు - నగరి, శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్, కర్నూల్ - కడప కెనాల్ ఆయకట్టుకు నీళ్లిచ్చేలా ఈ ప్రాజెక్టు తలపెట్టిందన్నారు. ఇప్పటికే శ్రీశైలం, నాగార్జున సాగర్ కింద నీళ్లిచ్చే ప్రాజెక్టులకే ఏపీ ఇంకో లక్ష కోట్లతో మరో ప్రాజెక్టు నిర్మిస్తుంటే.. తెలంగాణ లో ఈ గడ్డకు సాగునీళ్లిచ్చే ప్రాజెక్టు లపై మన పాలకులు, కొందరు మేధావులు కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై రాద్దాంతం చేయకుండా వాటి వినియోగంపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.

Tags:    
Advertisement

Similar News