సొంత పార్టీ నేతలపై రాములమ్మ ఫైర్
చిట్ చాట్ ల పేరుతో ఏదో ఒక వ్యూహంతో చేసే కార్యాచరణ తనకు అలవాటు లేదంటున్నారు విజయశాంతి. పార్టీ కి ఏది ముఖ్యమో ఆ అంశాలను పార్టీ ప్రధాన నాయకులకు తాను స్పష్టంగా తెలియచేశానని చెప్పారామె.
తమ పార్టీలోని నేతలు పనిగట్టుకుని తనపై సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేయిస్తున్నారంటూ మండిపడ్డారు విజయశాంతి. ఆ ప్రచారాన్ని తాను ఖండిస్తున్నానని అన్నారు. ఉన్నట్టుండి సొంత పార్టీ నేతలపై ఆమె చేసిన ఆరోపణలు తెలంగాణ బీజేపీలో కలకలం సృష్టించాయి. రాములమ్మ పార్టీ మారుతుందంటూ ఇటీవల వార్తలు వినపడిన మాట వాస్తవం. అయితే ఆ వార్తలను సొంత పార్టీ నేతలే ప్రచారంలోకి తెచ్చారంటూ బాంబు పేల్చారు విజయశాంతి.
వాస్తవానికి విజయశాంతికి బీజేపీలో పెద్ద ప్రాధాన్యం దక్కడంలేదనేది తెలిసిన విషయమే. ఆమె కూడా ఉద్దేశపూర్వకంగానే అధిష్టానానికి దూరంగా ఉంటున్నారు. అయితే పార్టీ మార్పు విషయంలో మాత్రం విజయశాంతి అంత తొందరపడతారని అనుకోలేం. అదే సమయంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కూడా పెద్దగా టైమ్ లేదు. ఈ దశలో విజయశాంతి నిర్ణయం ఏంటా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆమెను పక్కకు తప్పించాలని సొంత పార్టీ నేతలే వ్యూహాలు రచిస్తున్నట్టు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నట్టు విజయశాంతి తాజా వ్యాఖ్యలతో రుజువైంది. ఆ నాయకులెవరనేది ఆమె పరోక్షంగా కూడా బయటపెట్టకపోవడం విశేషం.
చిట్ చాట్ ల పేరుతో ఏదో ఒక వ్యూహంతో చేసే కార్యాచరణ తనకు అలవాటు లేదంటున్నారు విజయశాంతి. పార్టీ కి ఏది ముఖ్యమో ఆ అంశాలను పార్టీ ప్రధాన నాయకులకు తాను స్పష్టంగా తెలియచేశానని చెప్పారామె. ఆ విషయాలు బయటకు లీకేజ్ ల పేరుతో తాను ఇవ్వలేనని, అలాంటి వ్యవహారాలకు తాను వ్యతిరేకం అన్నారు. సొంత పార్టీ నేతలపైనే విమర్శలు ఎక్కుపెడుతున్న రాములమ్మ, పార్టీకి నిజంగానే దూరం జరుగుతారా, కాంగ్రెస్ గూటికి చేరతారా అనేది తేలాల్సి ఉంది.