కాంగ్రెస్ లోకి విజయశాంతి.. రాహుల్ ఉన్నా ఖర్గే సమక్షంలోనే ఎందుకు..?
కాంగ్రెస్ లో చేరిన సందర్భంగా విజయశాంతి బీఆర్ఎస్ పై కీలక ఆరోపణలు చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ మాత్రమేనన్నారామె.
విజయశాంతి కాంగ్రెస్ లో చేరారు. అందరూ ఊహించిన పరిణామమే ఇది. అయితే ఆమె గాంధీ భవన్ లో సింపుల్ గా కండువా మార్చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆమెకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. హంగు, ఆర్భాటం లేకుండా ఈ కార్యక్రమం సింపుల్ గా తేలిపోయింది. అసలు విజయశాంతి అనుచరులెవరూ ఈ కార్యక్రమానికి వచ్చినట్టులేరు. అతి కొద్దిమంది మాత్రమే గాంధీ భవన్ లో జరిగిన రాములమ్మ చేరిక కార్యక్రమానికి హాజరయ్యారు.
కాంగ్రెస్ లో చేరేవారెవరైనా తమకు సోనియా లేదా రాహుల్, పోనీ ప్రియాంక అయినా కండువా కప్పాలని ఆశిస్తారు. అందులోనూ రాహుల్ గాంధీ ఈ రోజు తెలంగాణలోనే పర్యటిస్తున్నారు. కానీ విజయశాంతి మాత్రం మల్లికార్జున్ ఖర్గే సమక్షంలోనే పార్టీలో చేరారు. అది కూడా చాలా సింపుల్ గా. కనీసం కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల సమయంలో అయినా స్టేజ్ పై ఈ తంతు జరుగుతుందని అనుకున్నా.. అది కూడా లేదు. మేనిఫెస్టో విడుదలైన తర్వాత గాంధీ భవన్ లో అతికొద్దిమంది సమక్షంలోనే ఈ కార్యక్రమం జరిగింది.
బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్సే..
కాంగ్రెస్ లో చేరిన సందర్భంగా విజయశాంతి బీఆర్ఎస్ పై కీలక ఆరోపణలు చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ మాత్రమేనన్నారామె. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. కొన్నాళ్లుగా బీజేపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆమె, చివరకు ఆ పార్టీకి రాజీనామా చేసి, ఎన్నికలకు 2వారాల ముందు కాంగ్రెస్ లో చేరారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ తరపున విజయశాంతి చురుగ్గా పాల్గొనే అవకాశముంది.
♦