రైల్ కోచ్ ఫ్యాక్టరీ అడిగితే రైలుతో సరిపెట్టారు.. సెల్ఫ్ డబ్బా మొదలెట్టారు

తెలంగాణకు వందేభారత్ ఎక్స్ ప్రెస్ ని సాధించి పెట్టింది తానేనంటూ ఇప్పుడు సెల్ఫ్ డబ్బా మొదలు పెట్టారు కిషన్ రెడ్డి.

Advertisement
Update:2023-01-07 20:28 IST

కాజేపేటలో రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అనేది తెలంగాణలో ఎప్పటినుంచో ఉన్న డిమాండ్. 2014లో ఏపీ పునర్విభజన చట్టంలో కూడా దీన్ని పొందుపరిచారు. తెలంగాణకు రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ఏళ్లు గడిచిపోయాయి, రైల్ కోచ్ ఫ్యాక్టరీ విషయంలో మోదీ సర్కారు తెలంగాణకు మొండిచేయి చూపించింది. అసలు రైల్ కోచ్ ఫ్యాక్టరీల అవసరమే లేదని, అందుకే తెలంగాణకు ప్రత్యేకంగా ఇవ్వలేకపోతున్నామని చెప్పింది. తాజాగా అసోంకి రైల్ కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేసింది కేంద్రం. ఈ సవతి తల్లి ప్రేమ గురించి ప్రశ్నిస్తే ఇప్పుడు వందేభారత్ ఎక్స్ ప్రెస్ పేరు చెప్పి సరిపెట్టాలని చూస్తున్నారు.

కిషన్ రెడ్డి సెల్ఫ్ డబ్బా..

తెలంగాణ ఉద్యమ సమయంలో కనీసం తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయని అసమర్థుడు కిషన్ రెడ్డి అని ఇటీవల మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఆ కౌంటర్ తర్వాత కిషన్ రెడ్డి తెగ ఇదైపోతున్నారు. అర్జంట్ గా ఏదైనా చేసి తన పాతివ్రత్యాన్ని నిరూపించుకోవాలనుకుంటున్నారు. ఆయనకు ఓ అవకాశం వచ్చింది. తెలంగాణకు వందేభారత్ ఎక్స్ ప్రెస్ ని సాధించి పెట్టింది తానేనంటూ ఇప్పుడు సెల్ఫ్ డబ్బా మొదలు పెట్టారు. సౌత్ సెంట్రల్ రైల్వేకు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు మంజూరు చేయడానికి కిషన్ రెడ్డి చొరవ ఫలించిందనే ప్రచారం మొదలైంది. ఈనెల 19 లేదా 20వ తేదీల్లో ప్రధాని నరేంద్రమోదీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనుల ప్రారంభంకోసం వస్తారట. అప్పుడే వందేభారత్ కి ఆయన జెండా ఊపుతారట.

ఎందుకీ కవరింగ్ లు..?

కిషన్ రెడ్డి అడిగినా, అడక్కపోయినా.. భారత రైల్వేకు అత్యధిక ఆదాయం సమకూర్చే సౌత్ సెంట్రల్ రైల్వేస్ కి వందేభారత్ ఎక్స్ ప్రెస్ రాకమానదు. దానికి కూడా కిషన్ రెడ్డి చొరవ అంటూ సెల్ఫ్ డబ్బా వేసుకోవడమే ఇక్కడ హైలెట్. ఆమాటకొస్తే వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు వల్ల ప్రత్యేక ఉపయోగాలేవీ ఇంతవరకు తెలియరాలేదు. పైగా ఆ రైలెక్కిన తర్వాత యాక్సిడెంట్ల భయం ఉండనే ఉంది. ఇలాంటి బండిని ఇప్పుడు సౌత్ సెంట్రల్ రైల్వేకు ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటోంది కేంద్రం. ప్రస్తుతం వస్తున్న వందే భారత్ రైలుకి బెర్త్ లు లేవు, కేవలం సీట్లు మాత్రమే ఉన్నందున ఇప్పుడు దీన్ని సికింద్రాబాద్ నుంచి విజయవాడ వరకు మాత్రమే పరిమితం చేస్తున్నారు. బెర్త్ లు జోడించిన తర్వాత విశాఖ వరకు పొడిగిస్తారని తెలుస్తోంది. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి కూడా వందేభారత్ రైలు ప్రతిపాదన ఉంది. దీనికి మోక్షం ఎప్పుడు కలుగుతుందో చూడాలి.

Tags:    
Advertisement

Similar News