సభలో కాదు సచివాలయంలోనే.. గ్యారెంటీల వేదిక మార్పు
చేవెళ్ల సభలో ప్రారంభించాల్సిన గ్యారెంటీలను సచివాలయానికి పరిమితం చేశారు, పూర్తి అధికారిక కార్యక్రమంగా మార్చేశారు.
చేవెళ్ల సభలో రెండు గ్యారెంటీలను ప్రారంభించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భారీ ప్రణాళిక సిద్ధం చేసింది. ఆ సభకు ప్రియాంక గాంధీని ఆహ్వానించింది. ప్రియాంక పర్యటన రద్దు కావడంతోపాటు.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డు రావడంతో వేదిక మారింది. తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి రెండు గ్యారెంటీల అమలు ప్రకటన చేస్తారని తాజా సమాచారం. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం ఈ రెండు గ్యారెంటీలను లాంఛనంగా ప్రారంభిస్తారు.
తెలంగాణలో ఆరు గ్యారెంటీల వ్యవహారం పొలిటికల్ హాట్ టాపిక్ గా మారింది. చెప్పినవి చెప్పినట్టు చేయాలంటే నిధులు సరిపోవు, కొర్రీలు పెట్టినా, అమలుని వాయిదా వేసినా లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కి నష్టం జరిగే అవకాశముంది. అందుకే సీఎం రేవంత్ రెడ్డి గ్యారెంటీల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. 100 రోజుల డెడ్ లైన్ పెట్టి సేఫ్ గేమ్ మొదలు పెట్టారు. ప్రస్తుతానికి మరో రెండు గ్యారెంటీలతో సరిపెట్టారు. రూ.500కే వంట గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలను ఈరోజు ప్రారంభించబోతున్నారు.
చేవెళ్ల సభ యథాతథం..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సోమవారం సాయంత్రం షెడ్యూల్ విడుదలైంది. దీంతో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినట్టయింది. అందుకే చేవెళ్ల సభలో ప్రారంభించాల్సిన గ్యారెంటీలను సచివాలయానికి పరిమితం చేశారు, అధికారిక కార్యక్రమంగా మార్చేశారు. ఇక చేవెళ్లలో పొలిటికల్ మీటింగ్ యథాతథంగా జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డితోపాటు మంత్రులు, కాంగ్రెస్ ముఖ్య నేతలు ఈ సభలో పాల్గొంటారు.