నేటి నుంచి ఆర్టీసీ ఏసీ బస్సుల్లో ఛలో శ్రీశైలం..
శ్రీశైలానికి ఏసీ బస్సులు నడపాలని ఆర్టీసీకి ప్రయాణికుల నుంచి ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. అయితే ఆర్టీసీలో ఏసీ సర్వీసులుగా నడిపిస్తున్న రాజధాని బస్సులు సూపర్ లగ్జరీ కంటే పొడవు ఎక్కువ ఉంటాయి.
హైదరాబాద్ టు శ్రీశైలం.. ఆర్టీసీలో అత్యంత కీలకమైన రూట్. ఒక్క హైదరాబాద్ నుంచే ఆర్టీసీ రోజూ 30కి పైగా సూపర్ లగ్జరీ బస్సులు నడుపుతోంది. అయినా కూడా రోజూ కొన్ని వేల మంది భక్తులు కార్లు, మినీ బస్సులు వంటి ప్రైవేట్ వాహనాల్లో వెళుతుంటారు. దీనికి ప్రధాన కారణం ఈ మార్గంలో ఆర్టీసీ ఏసీ బస్సులు లేకపోవడం. నాన్ ఏసీ బస్సుల్లో ప్రయాణించలేక ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నవారిని ఆకర్షించేందుకు టీఎస్ ఆర్టీసీ సిద్ధమైంది. ఇకనుంచి రోజూ హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి 10 ఏసీ బస్సులు నడపనుంది.
రాజధాని మలుపు తిరగదు..
శ్రీశైలానికి ఏసీ బస్సులు నడపాలని ఆర్టీసీకి ప్రయాణికుల నుంచి ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. అయితే ఆర్టీసీలో ఏసీ సర్వీసులుగా నడిపిస్తున్న రాజధాని బస్సులు సూపర్ లగ్జరీ కంటే పొడవు ఎక్కువ ఉంటాయి. శ్రీశైలం ఘాట్ రోడ్డులో అవి మలుపు తిరగడం కష్టం. దీంతో ఇన్నాళ్లూ సూపర్ లగ్జరీలతోనే సరిపెడుతున్నారు.
సూపర్ లగ్జరీలోనే ఏసీ సదుపాయం
ఈ నేపథ్యంలో సూపర్ లగ్జరీలోనే ఏసీ సదుపాయం ఉండేలా బస్సులను తీర్చిదిద్దారు. మొత్తం 10 ఏసీ బస్సులను ఈ రోజు నుంచే ప్రారంభించనున్నారు. శనివారం సాయంత్రం సీఎం రేవంత్‌రెడ్డి ఈ ఏసీ బస్సులను జెండా ఊపి ప్రారంభించబోతున్నారు.