ట్రస్టు లెక్కలు చెప్పాల్సి వస్తుందనే భయంతోనే శశిధర్ రెడ్డి పార్టీని వీడారు : రేవంత్

శశిధర్ రెడ్డి ఇలా కోట్లాది రూపాయలు స్వాహా చేశారు. ఎన్నో పదవులు అనుభవించిన ఆయన.. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఏనాడూ రోడ్డెక్కలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు.

Advertisement
Update:2022-11-27 10:54 IST

కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డిపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. 'హైదరాబాద్ నగర కాంగ్రెస్‌ పేరుతో కోఠిలో కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయి. అవన్నీ ఒక ట్రస్టు కింద ఉన్నాయి. ఆ ట్రస్టులో శశిధర్ రెడ్డి కీలక బాధ్యతల్లో ఉన్నారు. అయితే ఇటీవల ఏఐసీసీ ఇలాంటి ట్రస్టులన్నింటినీ ఒకే గొడుగు కిందకు తేవాలని నిర్ణయించింది. నగర కాంగ్రెస్ ట్రస్టుకు సంబంధించిన వివరాలు అందించాలని హైకమాండ్ నాకు లేఖ రాసింది. దీంతో నేను శశిధర్ రెడ్డికి కాల్ చేశాను. ఐదు సార్లు పిలిచినా.. ఆయన మాత్రం రాలేదు. లెక్కలు చెప్పాల్సి వస్తుందనే ఆయన భయపడి.. పార్టీని వదిలి వెళ్లారు' అని రేవంత్ రెడ్డి వెల్లడించారు.

శశిధర్ రెడ్డి ఇలా కోట్లాది రూపాయలు స్వాహా చేశారు. ఎన్నో పదవులు అనుభవించిన ఆయన.. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏనాడూ రోడ్డెక్కలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. తనకు పీసీసీ పదవి ఇప్పించమని శశిధర్ రెడ్డి అడిగారు. అయితే ఢిల్లీలో నేను చెప్తే పదవులు ఇచ్చే పరిస్థితి లేదని చెప్పానన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీలో ఓ నలుగురైదుగురు ఉన్నారు. వాళ్లకు నాపై విమర్శలు చేయడమే పని. తెలంగాణ కాంగ్రెస్‌లో నా నాయకత్వాన్ని ఆ నాలుగురు తప్ప అందరూ అంగీకరించారు. వాళ్లకు పీసీసీ అధ్యక్షుడిని కావాలనే కోరిక ఉన్నది. అందుకే నాపై విమర్శలు చేస్తుంటారని రేవంత్ అన్నారు.

నాపై ఎన్ని విమర్శలు చేసినా తాను పట్టించుకోనని రేవంత్ రెడ్డి చెప్పారు. గులాం నబీ ఆజాద్ వంటి నాయకుడు ఏఐసీసీ స్థాయిలో అన్ని పదవులు అనుభవించారు. కానీ, ఆయనే కాంగ్రెస్ నాయకత్వాన్ని తీవ్రంగా విమర్శించి.. చివరకు పార్టీని వదలి వెళ్లారని రేవంత్ అన్నారు. ప్రతీ శనివారం గాంధీ భవన్‌కు వచ్చి.. అక్కడే అందరు నాయకులతో మాట్లాడుతున్నారు. అక్కడ నిర్ణయించిన కార్యక్రమాలతోనే ముందుకు వెళ్తున్నాము. కానీ కొంత మంది గాంధీభవన్‌కే రాకుండా, అక్కడ చేసిన తీర్మానాలు ఏంటో తెలుసుకోకుండా తమను సంప్రదించడం లేదనే విమర్శలు చేస్తున్నారన్నారు.

ఉపఎన్నికల ఫలితాల ఆధారంగా తన పని తీరును, పార్టీ పని తీరును నిర్ణయించలేమని రేవంత్ చెప్పారు. ఏం జరిగినా పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యత నాదే కావొచ్చు.. అందరు కలిసి తీసుకున్న నిర్ణయాల ఫలితం తేడాగా వస్తే.. పీసీసీ చీఫ్ మాత్రమే ఫెయిల్ అయ్యాడని ఎలా అంటారని ప్రశ్నించారు. ఇటీవల ఒక నాయకుడు నాకు తెలియకుండా వేరొకరిని కాన్ఫరెన్స్‌లో పెట్టి మాట్లాడాడు. కాన్ఫరెన్స్‌లో అవతల ఉన్న నాయకుడి గురించి నెగెటివ్‌గా మాట్లాడాడు. ఆ సమయంలో నేను అవతలి వ్యక్తి గురించి ఏమైనా చెప్తానేమో అని ఆశించాడు. కానీ, తాను మాత్రం అదృష్టం బాగుండి ఒక్క మాట కూడా అనలేదు. ఇలా నాపై కావాలనే ఫోన్ల నిఘా పెట్టారని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు.

పార్లమెంట్ సమావేశాలు మొదలయ్యే లోపు జిల్లా అధ్యక్షులు, ఉపాధ్యక్షులతో పాటు రాష్ట్ర ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల పేర్లు ప్రకటిస్తారని రేవంత్ రెడ్డి వెల్లడించారు.

Tags:    
Advertisement

Similar News