బియ్యం సేకరణకు సహకరించండి.. కేంద్రానికి కేటీఆర్ విజ్ఞప్తి
ఇకనైనా కేంద్రం, తెలంగాణ రైతాంగానికి ప్రోత్సాహం అందించాలని, తెలంగాణ నుంచి అదనంగా 20 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ ని సేకరించాలని పీయూష్ గోయల్ ని కోరారు కేటీఆర్.
ఢిల్లీ పర్యటన రెండోరోజు మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతున్నారు. ఉదయం పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో సమావేశమైన కేటీఆర్, సాయంత్రం వాణిజ్యం, జౌళి, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో భేటీ అయ్యారు. తెలంగాణ ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు సహకరించాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు.
మిషన్ భగీరథ ద్వారా తెలంగాణలో ధాన్యం ఉత్పత్తి బాగా పెరిగింది. జాతీయ స్థాయిలో అత్యథికంగా వరి ధాన్యం ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో పంజాబ్ ని సైతం తెలంగాణ వెనక్కు నెట్టే స్థాయికి చేరుకుంది. రైతులకు మద్దతుధర లభించాలంటే ప్రభుత్వాల సహకారం అవసరం. కేంద్రం ధాన్యాన్ని అదనంగా కొనుగోలు చేస్తే తెలంగాణకు ఎలాంటి అవస్థలు ఉండవు. అయితే బాయిల్డ్ రైస్ విషయంలో కేంద్రం మెలిక పెట్టడంతో తెలంగాణ రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇకనైనా కేంద్రం, తెలంగాణ రైతాంగానికి ప్రోత్సాహం అందించాలని, తెలంగాణ నుంచి అదనంగా 20 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ ని సేకరించాలని పీయూష్ గోయల్ ని కోరారు కేటీఆర్.
జౌళి రంగంలో చేయూత కోసం..
కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ పురోగతి గురించి కూడా పీయూష్ గోయల్ కి వివరించారు కేటీఆర్. పీఎం మిత్ర (మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ రీజియన్ అండ్ అప్పెరెల్) స్కీమ్ కింద కేంద్రం ఈ టెక్స్ టైల్ పార్క్ కి ప్రోత్సాహకాలు అందించాల్సి ఉంది. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన, చేస్తున్న కంపెనీలకు కేంద్రం నుంచి మరిన్ని ప్రోత్సాహకాలు అవసరం అని చెప్పారు కేటీఆర్. తెలంగాణలో వస్త్ర తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి ఈ టెక్స్ టైల్ పార్క్ ఎంతగానే ఉపయోగపడుతుందని వివరించారు. తెలంగాణ వాణిజ్య రంగానికి ప్రోత్సాహకాలు అందించాలని పీయూష్ గోయల్ ని కోరారు.