ఆటోలో ఆరుగురు విద్యార్థులు మాత్రమే ఉండాలి- హైకోర్టు
ముఖ్యంగా ఆటోల్లో విద్యార్థులను ఎక్కువ మందిని తీసుకెళ్తున్న వైనంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇకపై ఆటోలో ఆరుగురికి మించి విద్యార్థులను తీసుకెళ్లడానికి వీల్లేదని ఆదేశించింది.
స్కూల్ పిల్లల భద్రత కోసం తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తన నాలుగేళ్ల కూతురు రోడ్డు దాటుతుండగా ప్రమాదానికి గురై మరణించిందని, ఇలాంటి ప్రమాదాలు నివారించేందుకు తగిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ వెస్ట్ మారేడ్ పల్లికి చెందిన హనుమంతరావు అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు పలు కీలక ఆదేశాలు జారీ చేసింది.
పాఠశాలల వద్ద పిల్లలు సురక్షితంగా రోడ్డు దాటేందుకు తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. స్కూల్ జోన్లలో సిగ్నల్స్, జీబ్రా లైన్స్‌ను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించింది. పిల్లలు స్కూల్ వద్ద రోడ్డు దాటే సమయంలో గార్డును తప్పనిసరి చేయాలని.. ఈ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని పోలీసులు, ఇతర శాఖల అధికారులకు హైకోర్టు ఆదేశించింది.
ఈ అంశంపై దాఖలు చేసిన అఫిడవిట్‌లో ప్రభుత్వం తాము తీసుకున్న చర్యలను వివరించింది. నగర పరిధిలోని స్కూళ్ల యాజమాన్యాలతో ఇటీవల సమావేశాలు నిర్వహించినట్టు వెల్లడించింది. స్కూళ్ల వద్ద ఓవర్ స్పీడ్, ర్యాష్ డ్రైవింగ్ వంటి వాటిని కట్టడికి చర్యలు తీసుకోవడంతో పాటు ఆయా ప్రాంతాల్లో వన్‌వే ట్రాఫిక్ రూల్ కూడా పెట్టామని ప్రభుత్వం వివరించింది. విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్‌పైనా అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పింది.
అవసరం ఉన్న చోట్ల ఫుట్ బ్రిడ్జ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు ప్రభుత్వం వివరించింది. ఇందుకు స్పందించిన హైకోర్టు.. వీటిని కఠినంగా అమలు చేయడంతో పాటు.. ముఖ్యంగా ఆటోల్లో విద్యార్థులను ఎక్కువ మందిని తీసుకెళ్తున్న వైనంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇకపై ఆటోలో ఆరుగురికి మించి విద్యార్థులను తీసుకెళ్లడానికి వీల్లేదని ఆదేశించింది.