టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. బీజేపీలో కలకలం
వికాస్ రావుకి అన్యాయం చేశారంటూ అతడు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయం వద్ద పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ రాలేదని అలిగిన వారిని చూశాం, తిరిగి సర్దుకుపోయినవారినీ చూశాం, పార్టీ మారి పాత పార్టీని విమర్శిస్తున్న వారినీ చూస్తున్నాం. గాంధీ భవన్ కి తాళాలు, ఫ్లెక్సీలకు నిప్పు లాంటివి వీటికి అదనం. తాజాగా బీజేపీలో అంతకు మించి అనేంతగా ఓ సీన్ జరిగింది. తన అభిమాన నాయకుడికి టికెట్ రాకపోవడంతో ఏకంగా ఓ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేయడం, ఆ ప్రయత్నంలో అతను గాయాలపాలవడం సంచలనంగా మారింది. బీజేపీలో వేములవాడ టికెట్ పెట్టిన చిచ్చు ఇప్పుడల్లా ఆరేలా కనపడ్డంలేదు.
వేములవాడలో బీజేపీ టికెట్ మాజీ మంత్రి విద్యాసాగర్ రావు కుమారుడు వికాస్ రావుకి ఇస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఈటల రాజేందర్ వర్గానికి చెందిన తుల ఉమకు ఆ టికెట్ ఖరారైంది. దీంతో వికాస్ రావు వర్గం ఆందోళకు దిగింది. మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు నేతలు, అధిష్టానానికి మూడు రోజుల డెడ్ లైన్ పెట్టారు. ఈ క్రమంలో బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ యువ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేయడం సంచలనంగా మారింది.
వేములవాడ బీజేపీ టికెట్ వికాస్ రావుకి కాదని, తుల ఉమకు ఎలా ఇస్తారంటూ మనస్తాపం చెందిన యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. వికాస్ రావుకి అన్యాయం చేశారంటూ అతడు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయం వద్ద పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గమనించిన తోటి కార్యకర్తలు, అక్కడే ఉన్న పోలీసులు అప్రమత్తమై యువకుడిని అడ్డుకున్నారు. ఈ ప్రమాదంలో ఆ యువకుడికి స్వల్ప గాయాలయ్యాయి.
♦