31న దావత్ లు బంద్ చేసి హాస్టళ్లను దత్తత తీసుకోండి
రాష్ట్ర యువతకు మాజీ మంత్రి హరీశ్ రావు పిలుపు
రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లలో చలికి విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో యువత న్యూ ఇయర్ సందర్భంగా ఈనెల 31న దావత్ లు బంద్ చేసి హాస్టళ్లను దత్తత తీసుకోవాలని మాజీ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. శనివారం సిద్దిపేటలోని బ్రిడ్జ్ స్కూల్ విద్యార్థులకు స్వెటర్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. పిల్లలకు సేవ చేస్తే భగవంతుడికి సేవ చేసినట్టేనని అన్నారు. హాస్టల్ విద్యార్థులకు ఈ ఏడాది ప్రభుత్వం దుప్పట్లు కూడా పంపిణీ చేయలేదని, హాస్టళ్లలో స్నానానికి వేడినీళ్లు కూడా ఇవ్వడం లేదని తెలిపారు. విద్యార్థులకు నాలుగు నెలలుగా మెస్ చార్జీలు పెండింగ్‌లో ఉన్నాయని.. గ్రీన్ చానల్ లో నిధులు ఇవ్వడం అంటే ఇదేనా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. జీతాలు ఆగినా విద్యార్థుల మెస్ చార్జీలు ఆగవు అన్న మాటలు ఏమయ్యాయని ముఖ్యమంత్రిని నిలదీశారు. సీఎం మాటలు కోటలు దాటుతున్నాయే తప్ప చేతలు గడప దాటడం లేదన్నారు. ఈయన మాటల ముఖ్యమంత్రే తప్ప చేతల ముఖ్యమంత్రి ఎంతమాత్రమూ కాదన్నారు. పరిపాలనపై పట్టు కోల్పోయారని అన్నారు. ఆరు గ్యారంటీలు సహా ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు.
ఆడబిడ్డలకు ఇస్తామన్న రూ.2,500 ఆర్థిక సాయం, కళ్యాణలక్ష్మీతో పాటు ఇస్తామన్న తులం బంగారం ఎటు పోయాయో చెప్పాలన్నారు. విద్యం, వైద్యం సహా కేంద్ర నుంచి పలు శాఖలకు నిధులు ఇస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వకపోవడంతో ఆ నిధులు సద్వినియోగం చేసుకొనే అవకాశం లేకుండా పోయిందన్నారు. పెంచిన్ మెస్ చార్జీలు ఇప్పటికీ అందజేయలేదన్నారు. అర్భన్ ఏరియాల్లో మెస్ చార్జీలు ఇంకా పెంచాలని, కాస్మోటిక్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. హాస్టళ్లు, గురుకులాలు, ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు తల్లితండ్రి ప్రభుత్వమే అన్న విషయాన్ని గుర్తించాలన్నారు. రాష్ట్రంలో విద్య, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వెల్ఫేర్ శాఖలకు మంత్రి లేడని.. అన్నింటికి ముఖ్యమంత్రినే మంత్రి అన్నారు. ఈ ప్రభుత్వం సరిగా పని చేయని కారణంగా ఎవరినైనా సస్పెండ్ చేయాల్సి వస్తే మొదట ఈ ముఖ్యమంత్రినే సస్పెండ్ చేయాలన్నారు. విద్యార్థులకు స్వెటర్స్, దుప్పట్లు పంపిణీ చేస్తున్న పవనసుత యూత్ అసోసియేషన్ సభ్యులను ఆయన అభినందించారు. వీరిని స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రంలోని మిగతా యువజన సంఘాలు హాస్టల్ విద్యార్థులకు అండగా నిలిచేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.