సొంత జిల్లాల్లో కార్యాలయాలు ప్రారంభించండి.. ఎన్ఆర్ఐలకు మంత్రి కేటీఆర్ పిలుపు

ఎన్ఆర్ఐలు తమ సొంత జిల్లాల్లో, పట్టణాల్లో కార్యాలయాలు ప్రారంభిస్తే.. తెలంగాణ గ్రామీణ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు.

Advertisement
Update:2023-05-19 20:20 IST

తెలంగాణలోని టైర్-2 పట్టణాలకు కూడా ఐటీ రంగాన్ని తీసుకెళ్లిన ఘనత తమ ప్రభుత్వానిదే అని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎన్ఆర్ఐలు తమ సొంత జిల్లాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలని ఆయన కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐటీ రంగాన్ని విస్తరించే లక్ష్యంతో, అమెరికా పర్యటనలో ఉన్న ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పలు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు.

అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో పలువురు ఎన్ఆర్ఐ సీఈవోలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా త్వరలోనే 2,500పైగా ఐటీ ఉద్యోగావకాశాలను టైర్-2 పట్టణాల్లో కల్పిస్తామని ఎన్ఆర్ఐలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం 3డీ మంత్రాతో ముందుకు అడుగులు వేస్తోందని చెప్పారు. డీకంజెస్ట్, డీకార్బనైజ్, డీసెంట్రలైజ్ అనే నినాదంతో యువతకు హైదరాబాద్ కాకుండా ఇతర పట్టణాల్లో కూడా అనేక అవకాశాలు కల్పిస్తోందని పేర్కొన్నారు. ఎన్ఆర్ఐలు తమ సొంత జిల్లాల్లో, పట్టణాల్లో కార్యాలయాలు ప్రారంభిస్తే.. తెలంగాణ గ్రామీణ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రంలో ఐటీ రంగ అభిృద్ధి కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాకుండా.. టైర్-2 నగరాలకు కూడా విస్తరించాలనే ఉద్దేశంతో వరంగల్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్‌నగర్ పట్టణాల్లో ఐటీ టవర్లు నిర్మించామన్నారు. ఇలాంటి నగరాల్లో తప్పకుండా కార్యకలాపాలు ప్రారంభించాలని ఆయన కోరారు.

కాగా, మంత్రి కేటీఆర్‌తో సమావేశం అనంతరం పలు సంస్థలు తెలంగాణ ప్రభుత్వంతో ఎంవోయూలు కుదుర్చుకున్నాయి. త్వరలోనే నిజామాబాద్, సిద్దిపేట, నల్గొండ పట్టణాల్లో 2,500పైగా ఉద్యోగాలు ఈ ఒప్పందం ద్వారా రానున్నాయి. అంతే కాకుండా ఈ ఒప్పందం వల్ల 10వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించనున్నది. మంత్రి కేటీఆర్‌తో మాట్లాడిన అనంతరం చాలా మంది తెలుగేతర, తెలంగాణేతర ఎన్ఆర్ఐలు కూడా రాష్ట్రంలో కార్యాలయాలు తెరిచేందుకు ఆసక్తి కనపరిచారు.

ఈ సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రటరీ (ఐటీ, పరిశ్రమలు) జయేశ్ రంజన్, స్పెషల్ సెక్రటరీ (ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ అండ్ ఎన్ఆర్ఐ అఫైర్స్) ఈ విష్ణువర్ధన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. 


Tags:    
Advertisement

Similar News