రాజేంద్రనగర్ MIM అభ్యర్థిగా రవి యాదవ్..!
ఈసారి మొత్తం 9 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు MIM చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. ఇందులో భాగంగా ఫస్ట్ లిస్ట్‌లో ఏడుగురు అభ్యర్థులకు అవకాశం కల్పించారు.
అసెంబ్లీ ఎన్నికల కోసం MIM పార్టీ మరో అభ్యర్థిని ప్రకటించింది. ఈసారి రాజేంద్రనగర్ నుంచి పోటీలో ఉన్న MIM..అక్కడి నుంచి బి.రవి యాదవ్‌కు అవకాశమిచ్చింది. దీంతో ఇప్పటివరకూ 8 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది. మరో స్థానంలో అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. నలుగురు MIM అభ్యర్థులు సోమవారం నామినేషన్లు సైతం దాఖలు చేశారు.
ఈసారి మొత్తం 9 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు MIM చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. ఇందులో భాగంగా ఫస్ట్ లిస్ట్‌లో ఏడుగురు అభ్యర్థులకు అవకాశం కల్పించారు. చాంద్రాయణగుట్ట, నాంపల్లి, మలక్‌పేట్, యాకుత్‌పురా, చార్మినార్, కార్వాన్, బహదూర్‌పురా, జూబ్లిహిల్స్, రాజేంద్రనగర్ స్థానాల్లో MIM పోటీ చేయనుంది. ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలను పోటీ నుంచి తప్పించింది. నిన్న ఉదయం జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థిగా షేక్‌పేట్ కార్పొరేటర్..మహ్మద్ రషీద్ ఫరాజుద్దీన్‌కు అవకాశమిచ్చింది. సాయంత్రానికి రాజేంద్రనగర్ అభ్యర్థిని ప్రకటించింది. జూబ్లిహిల్స్, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో ముస్లిం జనాభా అధికంగా ఉండటంతో రెండు నియోజకవర్గాల్లో పాగా వేయాలని MIM భావిస్తోంది.
ప్రస్తుతానికి బహదూర్‌పురా స్థానానికి అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. ఈ స్థానం నుంచి MIM ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ కుమారుడు నూరుద్దీన్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై MIM నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. నూరుద్దీన్ పోటీ చేస్తారా.. మరేవరికైనా అవకాశమిస్తారనేది తెలియాల్సి ఉంది. నామినేషన్ల సమర్పణకు మరో మూడు రోజులు మాత్రమే గడువు ఉండడంతో ఇవాళో, రేపో ఆ స్థానంపైనా క్లారిటీ రానుంది. ఈ సారి సీటు దక్కకపోవడంతో చార్మినార్ సిట్టింగ్ ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ పార్టీ మారుతారని ప్రచారం జరుగుతోంది.