నేడు హైదరాబాద్‌కు ప్రియాంకా గాంధీ.. యూత్ డిక్లరేషన్ చేయనున్న కాంగ్రెస్ పార్టీ
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సరూర్‌నగర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన 'యువ సంఘర్షణ సభ'లో పాల్గొని, మాట్లాడతారు.
కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీ ఇవాళ హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనున్నది. దీంతో ఆమె అక్కడ ప్రచారం ముగించుకొని.. మధ్యాహ్నం మూడు గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సరూర్‌నగర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన 'యువ సంఘర్షణ సభ'లో పాల్గొని, మాట్లాడతారు.
తెలంగాణలో 9 ఏళ్లుగా అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. వరంగల్‌లో రాహుల్ గాంధీ బహిరంగ సభ తర్వాత.. ఇక్కడ ఎలాంటి సభలు నిర్వహించలేదు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర వల్ల కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం వచ్చింది. అయితే, టీపీసీసీలో ఉన్న విభేదాల కారణంగా పార్టీ పరంగా చేపడుతున్న పాదయాత్రలు సక్సెస్ కావడం లేదు. ఒకవైపు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మరోవైపు సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క వేర్వేరుగా యాత్రలు చేస్తున్నారు. ఎన్నాళ్లుగానో రేవంత్ రెడ్డి, సీనియర్ నాయకుల మధ్య విభేదాలు ఉన్నాయి.
రాహుల్ గాంధీ గతంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులను పిలిచి మాట్లాడినా పరిస్థితి మారలేదు. ఈ క్రమంలో ప్రియాంక గాంధీకి తెలంగాణ పార్టీ వ్యవహారాలను చూసేందుకు అనధికారికంగా అధిష్టానం బాధ్యతలు ఇచ్చినట్లు తెలుస్తున్నది. నేటి యువ సంఘర్షణ సభలో యూత్ డిక్లరేషన్ చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. విద్యార్థులు, నిరుద్యోగ సమస్యలపై పోరాట వేదికగా ఈ సభను ఏర్పాటు చేశారు.
నిరుద్యోగులకు రూ.3వేల భృతి, ఉద్యోగ భర్తీ క్యాలెండర్, యువతకు రాజకీయ అవకాశాల హామీలను కాంగ్రెస్ పార్టీ ఇవ్వనున్నట్లు తెలుస్తున్నది. రైతు డిక్లరేషన్ ప్రకటించి ఎలా ప్రజల్లోకి తీసుకొని వెళ్లారో.. అదే విధంగా యూత్ డిక్లరేషన్ చేస్తారని సమాచారం. ఈ సభ ద్వారా పార్టీ క్యాడర్‌లో ఉత్సాహం వస్తుందని పార్టీ అంచనా వేస్తోంది. అదే విధంగా ప్రియాంక గాంధీ తెలంగాణ నాయకులతో సమావేశం అవుతారని.. అప్పుడే ఆమె పూర్తి స్థాయి ఇంచార్జి బాధ్యతలు తీసుకుంటారా లేదా అనే విషయంపై స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.