మునుగోడు ప్రజలారా! మేం మోసపోయాం మీరు మోసపోకండి... ఇట్లు దుబ్బాక, హుజూరాబాద్ ప్రజలు
కోమటి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి పై మునుగోడులో రాత్రికి రాత్రి మళ్ళీ వెలిసిన పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. దుబ్బాక, హుజూరాబాద్ ప్రజల పేరుతో వెలసిన ఈ పోస్టర్లు ప్రజలను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి.
మునుగోడు ఉప ఎన్నికల్లో పోస్టర్ల వార్ హీట్ పుట్టిస్తోంది. బీజేపీని, రాజగోపాల్ రెడ్డిని ఎండగడుతూ రోజుకో కొత్తరకమైన పోస్టర్లు వెలుస్తున్నాయి. మొన్నటికి మొన్న పేటీఎం తరహాలో పే కాంట్రాక్టర్ అంటూ కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డిపై వ్యంగ్య పోస్టర్లు మునుగోడు నియోజకవర్గమంతా కలకలం సృష్టించగా నిన్న రాత్రికి రాత్రి వెలిసిన మరో తరహా పోస్టర్లు చూసి జనం చర్చించుకుంటున్నారు.
''ప్రజలారా.. మేం మోసపోయాం, మీరు మోసపోకండి'' ఇట్లు దుబ్బాక ప్రజలు అని కొన్ని పోస్టర్లు 'ప్రజలారా.. మేం మోసపోయాం, మీరు మోసపోకండి' ఇట్లు హుజూరాబాద్ ప్రజలు అంటూ మరి కొన్ని పోస్టర్లు చౌటుప్పల్ మున్సిపాలిటీ అంతటా వెలిశాయి. ఆ పక్కనే ఉన్న సంస్థాన్ నారాయణపురంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, కోమటి రెడ్డి తరపున ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఇక చండూరులో మరో రకమైన పోస్టర్లు వెలిశాయి. నేడే విడుదల అంటూ సినిమా పోస్టర్ తరహాలో ఈ పోస్టర్లు ఉన్నాయి. షా ప్రొడక్షన్స్ సమర్పించు '18000 కోట్లు' మూవీ, దర్శకత్వం: కోవర్ట్ రెడ్డి, సత్యనారాయణ 70 ఎంఎం, చండూరులో నేడే విడుదల అంటూ పోస్టర్ ప్రజలను విపరీతంగా ఆకర్శిస్తోంది.
ఇప్పటికే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి 18000 కోట్ల కాంట్రాక్ట్ తీసుకొని బీజేపీ లో చేరాడని పల్లె పల్లెలో ప్రచారం జరుగుతుండటంతో తలలు పట్టుకున్న బీజేపీ నేతలకు ఈ పోస్టర్లతో ఏం చేయాలో అర్దం కాని పరిస్థితి నెలకొంది. ఈ '18000 కోట్లు' తమ మెడకు చుట్టుకునేలా ఉందని బీజేపీకార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు.