బీఆర్ఎస్‌లోకి పొన్నాల.. కేటీఆర్‌తో ముగిసిన భేటీ
వయసులో పెద్దవాడు, బలమైన బీసీ నాయకుడు అని కూడా చూడకుండా.. పొన్నాలను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తూలనాడిన విధానాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు కేటీఆర్.
పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్ లో చేరబోతున్నారు. మంత్రి కేటీఆర్ తో జరిగిన చర్చలు ఫలించాయి. పొన్నాల బీఆర్ఎస్ లో చేరతానంటే ఆయన ఇంటికి రేపే వెళ్లి ఆహ్వానం పలుకుతానంటూ శనివారం కేటీఆర్ మీడియా చిట్ చాట్ లో చెప్పారు. అన్నట్టుగానే ఆయన ఈరోజు పొన్నాల ఇంటికి వెళ్లారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ తో కలసి, హైదరాబాద్ లో పొన్నాల ఇంటికి వెళ్లిన కేటీఆర్.. బీఆర్ఎస్ లోకి ఆహ్వానం పలికారు. ఆయనకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు.
రేపు అధికారిక ప్రకటన..
సీఎం కేసీఆర్ సూచన మేరకు తాము పొన్నాలను కలసినట్టు తెలిపారు మంత్రి కేటీఆర్. ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించామన్నారు. ఆదివారం సీఎం కేసీఆర్ ని పొన్నాల కలుస్తారని, అనంతరం ఆయనే అధికారికంగా పార్టీలో చేరుతున్నట్టు ప్రకటిస్తారని చెప్పారు. జనగామలో జరిగే పార్టీ సభలో పొన్నాల చేరిక ఉంటుందని కూడా చెప్పారు కేటీఆర్. బలహీనవర్గాలకు చెందిన అనేక మంది నాయకులకు సీఎం కేసీఆర్ ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు కేటీఆర్. 1960లోనే అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేసి, నాసా లాంటి అంతర్జాతీయ సంస్థల్లో ఇంజినీర్ గా పనిచేసిన పొన్నాలను.. కాంగ్రెస్ పార్టీ దూరం చేసుకుందన్నారు. వయసులో పెద్దవాడు, బలమైన బీసీ నాయకుడు అని కూడా చూడకుండా.. పొన్నాలను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తూలనాడిన విధానాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు కేటీఆర్.
జనగామ పరిస్థితి ఏంటి..?
జనగామ కాంగ్రెస్ టికెట్ తనకు ఇవ్వరు అన్న సంకేతాలతోనే పొన్నాల పార్టీ వీడారు. ఇప్పుడు బీఆర్ఎస్ లో చేరుతున్నారు. అయితే జనగామ బీఆర్ఎస్ టికెట్ కూడా ఖాళీగా లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని కాదని, అక్కడ పల్లా రాజేశ్వర్ రెడ్డికి టికెట్ ఇటీవలే ఖరారు చేశారు. ఈ దశలో జనగామ టికెట్ పొన్నాలకు దక్కుతుంది అనుకోలేం. అయితే పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారంటే.. ఆయనకు మరో రకంగా మేలు జరగడం గ్యారెంటీ. ఆ నమ్మకంతోనే పొన్నాల బీఆర్ఎస్ వైపు అడుగులేస్తున్నారు.
♦