మళ్లీ షర్మిల హడావిడి.. అరెస్ట్, విడుదల

ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తడంతో పోలీసులు షర్మిలను అదుపులోకి తీసుకుని హయత్ నగర్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. అక్కడినుంచి ఆమెను లోటస్ పాండ్ లోని ఇంటి వద్ద వదిలిపెట్టారు.

Advertisement
Update:2023-08-20 19:30 IST

సమస్య చిన్నదైనా, పెద్దదైనా, ఆఖరికి పరిష్కారం లభించినదయినా వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల హడావిడి ఇటీవల కాలంలో ఎక్కువగా కనపడుతోంది. ఆమధ్య పోలీస్ లు అదుపులోకి తీసుకునే క్రమంలో వారిపైనే చేయిచేసుకున్న ఆమె, మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లెక్కాల్సి వచ్చింది. బీఎన్ రెడ్డి నగర్ లోని ఓ ఆస్పత్రి ఎదుట రోడ్డుపై బైఠాయించి ధర్నాలో పాల్గొన్న షర్మిలను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కి తరలించారు. అనంతరం ఆమెను లోటస్ పాండ్ లోని నివాసం వద్ద వదిలిపెట్టారు.

అసలేం జరిగింది..?

ఎల్బీనగర్ లో పోలీసులు అకారణంగా స్టేషన్ కు తీసుకెళ్లి లక్ష్మి అనే గిరిజన మహిళను తీవ్రంగా కొట్టారనే ఆరోపణలున్నాయి. బాధితురాలు ప్రస్తుతం బీఎన్ రెడ్డి నగర్ లో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు ఈ దాడికి కారకులుగా తేల్చి ఇద్దరు పోలీసులపై చర్యలు తీసుకున్నారు అధికారులు. బాధితురాలికి న్యాయం చేస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారు. అయితే ఈలోగా షర్మిల ఎంట్రీ ఇచ్చారు. ఆస్పత్రి వద్ద హడావిడి చేసి, బాధితురాలిని పరామర్శించి రోడ్డుపై బైఠాయించారు.


ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తడంతో పోలీసులు షర్మిలను అదుపులోకి తీసుకుని హయత్ నగర్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. అక్కడినుంచి ఆమెను లోటస్ పాండ్ లోని ఇంటి వద్ద వదిలిపెట్టారు. పోలీసులపై షర్మిల తీవ్ర ఆరోపణలు చేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ పోలీస్ డిపార్ట్మెంట్ నీచమైన చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారామె. రౌడీల్లా, రేపిస్టుల్లా పోలీసులు దారుణంగా ప్రవర్తించారన్నారు. అరాచకానికి పాల్పడిన ఎస్ఐ రవికుమార్, కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణమే నిందితుల పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి, బాధిత మహిళకు రూ.25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు షర్మిల. 

Tags:    
Advertisement

Similar News